Begin typing your search above and press return to search.

తాగేసిన మద్యం బాటిల్ తిరిగిస్తే... రూ.20 వాపస్ ఇస్తారు!

అవును... మద్యం తాగేసి ఎక్కడబడితే అక్కడ పాడేసే ప్లాస్టిక్‌ బాటిళ్ల విషయంలో కేరళ సర్కార్ ఓ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది.

By:  Raja Ch   |   31 July 2025 11:21 PM IST
తాగేసిన మద్యం బాటిల్  తిరిగిస్తే... రూ.20 వాపస్  ఇస్తారు!
X

ఉదయం షాప్ ఓపెన్ చేస్తే ముందు వైపు, ఇంకా ఓపెన్ చేసే సమయం అవ్వకపోతే షాప్ వెనుకవైపు క్యూలు కనిపిస్తుంటాయి! తెలియని వారు.. ఈ క్యూ ఏమిటా అని చూస్తే.. పైన పెద్ద బోర్డు కనిపిస్తుంది... "వైన్స్" అని! మద్యానికి మనిషికి అంత అవినాభావ సంబంధం ఉందని అంటారు! కష్టం వస్తే బాధలో, సుఖం వస్తే ఆనందంలో మనిషి పంచుకునే వాటిలో మద్యం ఒకటని చెబుతారు!

అయితే మెజారిటీ మందుబాబులు పని పూర్తైన వెంటనే ఆ ఖాళీ బాటిల్స్ ను పక్కకు విసిరేస్తారు. పైగా అక్కడ డస్ట్ బిన్స్ పెద్దగా కనిపించకపోవడంతో.. బాటిల్ + గ్లాస్ + వాటర్ బాటిల్/ప్యాకెట్ ఒకే ఊపులో విసిరేస్తారు! దీంతో వైన్ షాప్ చుట్టూ ఎక్కడబడితే అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ కనిపిస్తుంటాయి. ఈ సమయంలో.. ఈ సమస్య పరిష్కారానికి కేరళ సర్కార్ ఓ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది.

అవును... మద్యం తాగేసి ఎక్కడబడితే అక్కడ పాడేసే ప్లాస్టిక్‌ బాటిళ్ల విషయంలో కేరళ సర్కార్ ఓ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. ఇకపై ప్రతి మద్యం బాటిల్‌ పై అదనంగా రూ.20 ముందస్తు డిపాజిట్‌ చేయాలని.. మళ్లీ అదే అవుట్‌ లెట్‌ లో ఖాళీ బాటిల్‌ ను తిరిగి ఇస్తే.. డిపాజిట్‌ సొమ్మును వెనక్కి ఇవ్వనున్నట్లు తెలిపింది.

ఈ సందర్భంగా స్పందించిన కేరళ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి ఎం.బి. రాజేష్... రాష్ట్ర వ్యాప్తంగా బేవరేజస్‌ కార్పొరేషన్‌ ద్వారా ఏడాదికి 70 కోట్ల సీసాల మద్యం విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో... ఈ వ్యవహారం రాష్ట్రంలో ప్రధాన ప్లాస్టిక్‌ వ్యర్థాల ఉత్పత్తిదారుగా నిలిచిందని తెలిపారు. వీటిలో కేవలం 56 కోట్ల బాటిళ్లు మాత్రమే రీసైకిల్‌ అవుతున్నాయని అన్నారు.

ఈ నేపథ్యంలోనే వ్యర్ధాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వాస్తవానికి వీలైనంత వరకు గాజు సీసాల్లోనే మద్యం నింపాలని సూచించినా.. అది అంత సులువు కానందువల్ల రూ.800 అంతకంటే ఎక్కువ ధర ఉన్న మద్యాన్ని కచ్చితంగా గాజు సీసాల్లోనే ఇవ్వాలని తెలిపారు. ఇది మద్యం సేవించే వారికి అసౌకర్యం కలిగించడానికి లేదా జరిమానా విధించడానికి ఉద్దేశించినది కాదని తెలిపారు.

ఈ నేపథ్యంలో... ఈ ఏడాది సెప్టెంబరులో కొన్ని ప్రాంతాల్లో పైలట్‌ ప్రాజెక్టుల కింద చేపట్టి.. జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కాగా... ఇదే తరహా విధానాన్ని తమిళనాడు రాష్ట్రం ఇప్పటికే అనుసరిస్తోన్న సంగతి తెలిసిందే.