Begin typing your search above and press return to search.

గవర్నర్ వెజిటేరియన్.. రాజ్ భవన్ లో శాఖహారం.. కేరళలో ముదిరిన వివాదం

కేరళ రాజ్‌భవన్‌లో ఇకపై చికెన్, మటన్‌లకు నో-ఎంట్రీ.. ఆరు రుచుల కరివేపాకు, సాంబార్ల హడావుడి మొదలైన వేళ... కొత్త గవర్నర్ గారు పీఠమెక్కగానే వంటగదిపై 'శాకాహార ఆంక్షల' జెండా ఎగరేశారు.

By:  A.N.Kumar   |   25 Oct 2026 5:06 PM IST
గవర్నర్ వెజిటేరియన్.. రాజ్ భవన్ లో శాఖహారం.. కేరళలో ముదిరిన వివాదం
X

కేరళ రాజ్‌భవన్‌లో ఇకపై చికెన్, మటన్‌లకు నో-ఎంట్రీ.. ఆరు రుచుల కరివేపాకు, సాంబార్ల హడావుడి మొదలైన వేళ... కొత్త గవర్నర్ గారు పీఠమెక్కగానే వంటగదిపై 'శాకాహార ఆంక్షల' జెండా ఎగరేశారు. కోడి కూరకు బదులు క్యారట్ ముక్కలే రాజ్యమేలుతుంటే 'అయ్యా... మా కడుపుల మీద కొట్టకండి, మా ప్లేట్లపై రాజ్యాంగ దాడి జరుగుతోంది' అంటూ కాంగ్రెస్, సీపీఎం నేతలు లబోదిబోమంటున్నారు. ఇంతకీ అక్కడ మారింది రాజ్‌భవన్ మెనూ మాత్రమేనా... లేక కేరళ రాజకీయాల రంగు కూడానా?" అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గవర్నర్ ఆహార అలవాట్లపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. వ్యక్తిగత ఎంపికను వ్యవస్థపై రుద్దుతున్నారంటూ కాంగ్రెస్, సీపీఎం నేతలు తీవ్రంగా విమర్శిస్తుండగా... అధికారులు ఈ వ్యవహారంపై స్పష్టమైన వివరణ ఇచ్చారు.

కేరళ రాజకీయాల్లో ఇప్పుడు ఆహార సంస్కృతి కేంద్రబిందువుగా మారింది. నూతన గవర్నర్ ఓం ప్రకాశ్ మాథూర్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో లోక్‌భవన్‌లో శాకాహార నిబంధనలు అమల్లోకి వచ్చాయన్న వార్త తీవ్ర వివాదానికి దారితీసింది. గవర్నర్ వ్యక్తిగత ఆహార అలవాట్లకు సంబంధించిన ఈ అంశం క్రమంగా వ్యక్తిగత స్వేచ్ఛ, ఆహార సంస్కృతి, రాజ్యాంగ విలువలపై చర్చగా రూపాంతరం చెందింది. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి తన ఆహార ప్రాధాన్యతలను అధికారిక వ్యవస్థలో ఎంతవరకు అమలు చేయవచ్చనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

రాజ్ భవన్‌లో మాంసాహారాన్ని అనుమతించడం లేదని, అక్కడ కేవలం శాకాహార వంటకాలనే సిద్ధం చేయాలని గవర్నర్ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లినట్లు వార్తలు రావడంతో కేరళ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. విభిన్న మతాలు, సంస్కృతులు, వైవిధ్యభరితమైన ఆహార అలవాట్లకు నిలయమైన కేరళ సమాజంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. శాకాహారం లేదా మాంసాహారం తీసుకోవడం అనేది ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశం. గవర్నర్ తన వ్యక్తిగత అవసరాల కోసం ప్రత్యేకంగా శాకాహారాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేకపోయినా.. అదే నిబంధనను మొత్తం కార్యాలయానికి లేదా సిబ్బందికి వర్తింపజేస్తే ప్రశ్నలు తలెత్తడం సహజం.

ఈ వ్యవహారంపై కాంగ్రెస్, సీపీఎం నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఈ నిర్ణయాన్ని వ్యక్తిగత స్వేచ్ఛ, ఆహార ఎంపికలపై ప్రభావం చూపే చర్యగా అభివర్ణించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి తన వ్యక్తిగత అలవాట్లను అధికార యంత్రాంగంపై బలవంతంగా రుద్దడం సరైన విధానం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు ఏ ఒక్కరి వ్యక్తిగత నమ్మకాలకు లేదా జీవనశైలికి ప్రతిరూపాలుగా మారకూడదని... భిన్నమైన ఆహార అలవాట్లు ఉన్న ఉద్యోగుల స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉందని కమ్యూనిస్టు నేతలు కూడా అభిప్రాయపడ్డారు.

వివాదం తీవ్రం కావడంతో రాజ్ భవన్ అధికారులు స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు. సిబ్బంది ఆహారంపై ఎలాంటి నిషేధం లేదని.. ఉద్యోగులు తమకు నచ్చిన ఆహారాన్ని తీసుకురావడానికి లేదా తినడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని వెల్లడించారు. గవర్నర్ వ్యక్తిగత సేవలకు, ఆయన ప్రత్యేక వంటగదికి మాత్రమే శాకాహార నిబంధనలు పరిమితమని అధికారులు వివరణ ఇచ్చారు. గతంలో పనిచేసిన గవర్నర్లు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, రాజేంద్ర ఆర్లేకర్ కాలంలో మాంసాహార వంటకాలు సిద్ధం చేసేవారన్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఈ వివరణ ఇచ్చినప్పటికీ ఆదేశాల పరిధిపై చర్చ కొనసాగుతూనే ఉంది.

ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం ఉన్న సీనియర్ నాయకుడిగా ఓం ప్రకాశ్ మాథూర్‌కు గుర్తింపు ఉండటంతో కొందరు ఈ నిర్ణయానికి రాజకీయ రంగు పులుముతున్నారు. మరోవైపు బీజేపీ నాయకులు గవర్నర్ వ్యక్తిగత ఆహార ప్రాధాన్యతలను సమర్థిస్తున్నారు.

ప్రజా సంస్థల్లో వైవిధ్యాన్ని గౌరవించడం ఎంత ముఖ్యమో.. వ్యక్తుల వ్యక్తిగత ఎంపికలను గౌరవించడం కూడా అంతే ముఖ్యం. గవర్నర్ తన వ్యక్తిగత ఆహార స్వేచ్ఛకు గౌరవం ఇస్తూనే సిబ్బంది వ్యక్తిగత ఎంపికలను కూడా కాపాడగలిగితే ఈ వివాదానికి పరిష్కారం లభిస్తుంది.