కాంగ్రెస్ ఇక మారదా? గెలిచి ఓడిపోతున్న హస్తం పార్టీ
గత నెలలో జరిగిన కేరళం అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 4న ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి అత్యధిక మెజార్టీతో గెలిచింది.
By: Tupaki Political Desk | 12 May 2026 12:19 PM ISTకేరళం రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ రాజకీయం గందరగోళం సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో స్పష్టమైన మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎంపికపై తేల్చుకోలేకపోతోంది. మెజార్టీ శాసనసభ్యుల అభిప్రాయాలు తెలుసుకుని ఏదో ఒక నిర్ణయం తీసుకోవడంలో హైకమాండ్ నాన్చుడు ధోరణి అవలంబిస్తోందని ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చి వారం దాటినా సీఎం ఎంపికపై తుది నిర్ణయం తీసుకోకపోవడం, ఇంకా అభిప్రాయ సేకరణ అంటూ కాలయాపన చేయడంపై క్షేత్రస్థాయి కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. ఇలాంటి ధోరణి వల్లే పార్టీపై ప్రజల్లో విశ్వాసం పెంచలేకపోతున్నామని ఇతర రాష్ట్రాల నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
గత నెలలో జరిగిన కేరళం అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 4న ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి అత్యధిక మెజార్టీతో గెలిచింది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా 63 సీట్లలో విజయం సాధించింది. ఆ పార్టీ నాయకత్వంలోని యూడీఎఫ్ కూటమి 102 చోట్ల గెలిచి తిరుగులేని మెజార్టీ సొంతం చేసుకుంది. ఇక మాజీ ముఖ్యమంత్రి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి కేవలం 35 చోట్ల మాత్రమే గెలిచింది. ఇంత స్పష్టమైన మెజార్టీ సాధించినా కాంగ్రెస్ పార్టీ మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడంలో ఒక నిర్ణయానికి రాలేకపోతోందని అంటున్నారు.
కేరళం సీఎం పదవికి కాంగ్రెస్ లో ముగ్గురు నేతలు పోటీపడుతుండగా, ప్రధానంగా గత అసెంబ్లీలో విపక్ష నేతగా పనిచేసిన వీడీ సతీషన్, పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మధ్యే పోటీ నెలకొందని చెబుతున్నారు. గత ఐదేళ్లు విపక్ష నేతగా పార్టీని బలోపేతం చేయడంతోపాటు గత ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత పెంచి, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో సీనియర్ నేత వీడి సతీషన్ పట్టు సాధించారని అంటున్నారు. కూటమిలోని ఇతర మిత్రపక్షాలు సైతం సతీషన్ అభ్యర్థిత్వంపైనే మొగ్గుచూపుతున్నాయని అంటున్నారు. అయితే అధిష్టానం మాత్రం తనకు బాగా సన్నిహితుడైన పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ వైపు మొగ్గుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సీఎం ఎంపికపై ప్రతిష్ఠంభన నెలకొందని అంటున్నారు.
కేరళంతోపాటు ఎన్నికలు జరిగిన మిగిలిన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తుంటే, కేరళంలో మాత్రం ఇంకా శాసనసభాపక్ష సమావేశమే నిర్వహించకపోవడం కాంగ్రెస్ పరిస్థితిని అద్దం పడుతోందని అంటున్నారు. హైకమాండ్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే సమస్య ఉండదని నేతలు భావిస్తున్నారు. ఎమ్మెల్యేల మనోభీష్టానికి భిన్నంగా అధిష్టానం ఆలోచనలు ఉండటంతోనే ప్రకటన చేయడంలో ఆలస్యం జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది. ఇక క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని కార్యకర్తలు సూచిస్తున్నారు. అధిష్టానం తీరు వల్ల ఎన్నికల్లో గెలిచినా, ప్రజల ముందు ఓడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
