ఎన్నికలకు ముందు.. సీఎంపై 'మసాలా' కేసు!
కేరళలో ఆదాయం సమకూర్చుకునేందుకు 2019లో సీఎం విజయన్.. మసాలా బాడ్ల పేరుతో పెట్టుబడులను ఆకర్షించారు.
By: Garuda Media | 1 Dec 2025 4:56 PM ISTవినడానికే చిత్రంగా ఉన్నప్పటికీ.. ఇది నిజం. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 7 సంవత్సరాల కిందట జరిగిన ఓఘటనకు సంబంధించి ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కేరళ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు దిగ్గజ నాయకుడు పినరయి విజయన్‌పై కేసు నమోదు చేశారు. దీనికిసంబంధించిన నోటీసులను సీఎంవోకార్యాలయానికే నేరుగా పంపించారు. అయితే.. ఈ కేసులో విజయన్ నేరుగా ఈడీ అధికారుల ముందు హాజరు కావాల్సిన అవసరం లేదని.. వివరణ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.
అయితే.. ఇదంతా అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న పరిణామం కావడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించు కుంది. తమను ఉద్దేశ పూర్వకంగానే టార్గెట్ చేస్తున్నారని.. ముఖ్యమంత్రి విజయన్ ఓ ప్రకటన జారీ చేశారు. అసలు ఎప్పుడో జరిగిన ఘటనకు ఇప్పుడు విచారణ ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ.. ఈ కేసులో తానే మీ అక్రమాలు చేసినట్టుగా కూడా ఈడీ పేర్కొనలేదని.. దీనిని బట్టి ఇది ఉద్దేశ పూర్వక రాజకీయ కేసుగా ఆయన పేర్కొన్నారు. ఇక, ఈ కేసు ఇప్పటిది కాకపోయినా.. తాము విచారణ చేపడుతున్నామని.. ఆధారాల మేరకు సీఎంకు నోటీసులు ఇచ్చామని ఈడీ అధికారులు తెలిపారు.
అసలు ఏం జరిగింది?
కేరళలో ఆదాయం సమకూర్చుకునేందుకు 2019లో సీఎం విజయన్.. మసాలా బాడ్ల పేరుతో పెట్టుబడులను ఆకర్షించారు. ఈ బండ్లను కొనుగోలు చేయాలని అనుకునేవారు.. ఆయా దేశాల కరెన్సీలో కాకుండా.. భారతీయ కరెన్సీలోనే వీటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పెట్టుబడి దారుల నుంచి నిధులు సేకరించడంతోపాటు.. అంతర్జాతీయంగా రూపాయిని స్థిరీకరించడం అనే కీలక కోణం ఉందని అప్పట్లో విజయన్ పేర్కొన్నారు. అంతేకాదు.. దేశంలోనే తొలిసారి తాము మసాలా బాండ్లు విడుదల చేసినట్టు తెలిపారు. ఈ బాండ్లను విక్రయించడం ద్వారా కేరళ మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల బోర్డు 2 వేల కోట్ల రూపాయల మేరకు రాబట్టింది.
ఈ పెట్టుబడులను లండన్ ఎక్సేంజ్ ద్వారా మార్పు చేసుకోవడం ద్వారా మరో 150 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చాయి. దీనినే తప్పుబడుతూ.. ఈడీ అధికారులు గతంలోనే కేసు నమోదు చేశారు. అంతర్జాతీయ ద్రవ్యపరపతి, విధానాల చట్టాన్ని తుంగలో తొక్కారని.. ఈ నిధులను అక్రమంగా మళ్లించారని, ఫెమా చట్టాన్ని ఉల్లంఘించారని ఈడీ తెలిపింది. ఈనేపథ్యంలోనే 2023లో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి విచారణ జరుగుతూనే ఉంది. అయితే.. తాజాగా ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడం వివాదానికి దారితీసింది. ఇదిలావుంటే.. విజయన్‌పై గతంలోనూ కేసులు ఉన్నాయి. వాటి విచారణ కూడా జరుగుతుండడం గమనార్హం.
