Begin typing your search above and press return to search.

బస్సులో టచ్చింగ్ ఆరోపణల వీడియో... వైరల్ అవ్వడంతో వ్యక్తి ఆత్మహత్య!

బస్సులో ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని రోజుల తర్వాత.. 42 ఏళ్ల వ్యక్తి తన ఇంట్లో చనిపోయి కనిపించాడని పోలీసులు తెలిపారు.

By:  Raja Ch   |   19 Jan 2026 5:00 PM IST
బస్సులో టచ్చింగ్  ఆరోపణల వీడియో... వైరల్  అవ్వడంతో వ్యక్తి ఆత్మహత్య!
X

బస్సులో ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని రోజుల తర్వాత.. 42 ఏళ్ల వ్యక్తి తన ఇంట్లో చనిపోయి కనిపించాడని పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తిని పుతియారకు చెందిన దీపక్ గా గుర్తించారు. అతను కోజికోడ్‌ లోని గోవిందపురంలో నివసిస్తున్నాడని.. ఈ సమయంలో దీపక్ తన బెడ్‌ రూమ్ లోపల సీలింగ్ ఫ్యాన్‌ కు వేలాడుతూ కనిపించాడని పోలీసులు వెల్లడించారు. దీనిపై తీవ్ర ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు.

అవును... జనవరి 18, ఆదివారం నాడు కేరళలో దీపక్ అనే 42 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. బస్సులో ఒక మహిళను అనుచితంగా తాకినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న కొన్ని రోజుల తర్వాత ఈ దారుణం చోటు చేసుకుంది. ఆ మహిళ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేయగా.. అది వైరల్ అయింది. వీడియోలో.. రద్దీగా ఉన్న బస్సు లోపల దీపక్ మోచేయి ఆ మహిళ శరీరాన్ని తాకుతున్నట్లు కనిపిస్తుంది! ఇవి పక్కా వేధింపులే అని సదరు మహిళ శింజిత ఆరోపించారు.

అయితే... బస్సులో జనసమూహం కారణంగా ఇది సహజమైన చేతి కదలిక అని చాలా మంది వీక్షకులు అంటున్నారు! ఈ నేపథ్యలోనే దీపక్ మరణం ఆగ్రహాన్ని రేకెత్తించిందని చెబుతున్నారు. శింజిత ప్రమాదవశాత్తు టచ్ జరిగినట్లు కనిపించే దాని ఆధారంగా లైంగిక వేధింపులను అతిశయోక్తిగా చేసిందని పలువురు విమర్శించారు! అయితే ఆమె మాత్రం... ఇది కావాలని చేసిన పనే అని.. అప్పటికే అతడు మరో మహిళను అలా తాకాడని ఆమె చెబుతోంది!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోజికోడ్ కు చెందిన దీపక్ ఒక వస్త్ర సంస్థలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో.. జనవరి 16న అతను పని కోసం కన్నూర్ కు వెళ్తున్నాడు. సోషల్ మీడియా ప్రొఫైల్ లో తాను కన్సల్టెంట్ సైకాలజిస్ట్, కామర్స్ లెక్చరర్ అని చెబుతున్న శింజిత అనే మహిళ.. కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ కు చెందిన అదే బస్సులో ప్రయాణిస్తోంది.

ఈ సందర్బంగా ఆమె తన ఇన్‌ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన వీడియోలో.. దీపక్ మొదట్లో దూరంగా ఆమె పక్కన నిలబడి కనిపించాడు. తరువాత.. దీపక్ బస్సు దిగుతున్నప్పుడు అతని మోచేయి ఆమె ఛాతీని తాకినట్లు కనిపించింది! అయితే ఇది ప్రమాదంగా జరిగింది కాదని.. ఉద్దేశ్యపూర్వకంగా చేసిన పనే అని ఆమె తెలిపింది. అతడు అప్పటికే మరో మహిళను ఇబ్బంది పెట్టడాన్ని గమనించిన తర్వాతే తాను వీడియో తీయడం ప్రారంభించినట్లు చెబుతున్నారు.

ఈ సందర్భంగా... 'నేను సెల్ఫీ వీడియో తీయడం మొదలుపెట్టాను.. నేను అలా చేయడం అతను చూశాడు.. బస్ స్టాండ్‌ లో, బస్సులో రద్దీ తగ్గినప్పుడు, నేను మళ్ళీ వీడియో ఆన్ చేసాను.. అతను ఉద్దేశపూర్వకంగానే తాకాడు' అని ఆమె చెప్పింది. అయితే.. అతను ఆత్మహత్య చేసుకుని చనిపోతాడని తాను ఊహించలేదని ఆమె చెప్పింది. ఆ వీడియో విస్తృతంగా ప్రచారం అయినప్పటి నుండి దీపక్ తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నాడని అతని బంధువులు, స్నేహితులు ఆరోపించారు.