Begin typing your search above and press return to search.

వెరీ ఇంట్ర‌స్టింగ్‌: వీధి కుక్క‌లపై నాటిక.. నిజంగా వ‌చ్చి పిక్క‌ప‌ట్టిన కుక్క‌!

కొన్నికొన్ని ఘ‌ట‌న‌లు చిత్రంగా ఉంటాయి. ఊహించ‌డానికి కూడా వీల్లేకుండా ఉంటాయి.

By:  Garuda Media   |   7 Oct 2025 5:00 AM IST
వెరీ ఇంట్ర‌స్టింగ్‌: వీధి కుక్క‌లపై నాటిక.. నిజంగా వ‌చ్చి పిక్క‌ప‌ట్టిన కుక్క‌!
X

కొన్నికొన్ని ఘ‌ట‌న‌లు చిత్రంగా ఉంటాయి. ఊహించ‌డానికి కూడా వీల్లేకుండా ఉంటాయి. ప్ర‌స్తుతం రెండుతెలుగు రాష్ట్రాల‌తో పాటు.. దేశ‌వ్యాప్తంగా కూడా వీధి కుక్క‌ల `సీజ‌న్‌` న‌డుస్తోంది!. కుక్క‌కాట్లు పెరుగుతున్నాయి. దీంతో రెబీస్ వ్యాధిన ప‌డిన దేశంలో మ‌ర‌ణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ విష‌యంలో ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో కేర‌ళ‌లో ఇటీవ‌ల రెబీస్ వ్యాధులు పెరుగుతుండ‌డం, గ‌త మూడు మాసాల్లోనే 24 మంది రెబీస్ బారిన ప‌డి క‌న్ను మూయ‌డంతో సీఎం పిన‌రయి విజ‌య‌న్ నేతృత్వంలోని స‌ర్కారు ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న పెంచేందుకు క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించింది.

ఈ క్ర‌మంలో ప‌లువురు క‌ళాకారులు త‌మ త‌మ నైపుణ్యంతో కుక్క‌ల విష‌యంలో ప్ర‌జ‌లు ఎలా వ్య‌వ‌హ‌రించాల‌న్న విష‌యంపై ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తున్నారు. ఇలా.. కేర‌ళ‌లోని మ‌య్య‌ల్ అనే గ్రామంలో రాధాకృష్ణ‌న్ అనే క‌ళాకారుడు త‌న బృందంతో వీధినాట‌కం ప్ర‌ద‌ర్శించారు. వీధి కుక్క‌ల విష‌యంలో జాగ్ర‌త్త‌లు.. ఒక‌వేళ దుర‌దృష్ట‌వ శాత్తు.. అవి క‌రిస్తే.. ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు ఎలా తీసుకోవాలి..? అస‌లు వీధి కుక్క‌ల బారి నుంచిఎలా బ‌య‌ట‌ప‌డాలి? అనే విష‌యాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే ఈ నాటిక ఉద్దేశం. ఇలా.. ఆయ‌న త‌న బృందంతో నాటిక ప్ర‌ద‌ర్శిస్తున్న స‌మ‌యంలో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది.

వీధి కుక్క‌ల బారిన చిన్న‌పిల్లాడు ప‌డితే.. ఎలా ఉంటుంది? అనే స‌న్నివేశం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ స‌మ‌యంలో సౌండ్ ఎఫెక్ట్‌లో కుక్క‌ల మొర‌గ‌డం, అవి చిన్న‌పిల్ల‌ల‌పై ప‌డితే.. వారు ఎలా స్పందిస్తార‌న్న‌ది వినిపించారు. ఈ సౌండ్ ఎఫెక్ట్ అచ్చం కుక్క‌ల మాదిరిగానే ఉంది. దీంతో అక్క‌డికి స‌మీపంలో త‌చ్చాడుతున్న ఓ వీధి కుక్క ఒక్క‌సారిగా ప్రాంగ‌ణంలోకి వ‌చ్చి.. రాధాకృష్ణ‌న్ పిక్క‌ను ప‌ట్టుకుంది. తీవ్రంగా గాయ‌మైంది. అయితే.. వీధి నాట‌కంవీక్షిస్తున్న‌వారంతా.. `ఇదంతా నాటిక‌లో భాగం` అనుకున్నా రు. కిమ్మ‌న‌కుండా.. నాటిక‌ను వీక్షించారు. కానీ, త‌న‌ను నిజంగానే కుక్క క‌రిచిన‌ప్ప‌టికీ.. రాధాకృష్ణ‌న్ మాత్రం.. త‌న నాటిక‌ను కొన‌సాగించారు. మొత్తానికి నాటిక‌ను పూర్తి చేసి.. ప‌రుగు ప‌రుగున ఆయ‌న ఆసుప‌త్రికి వెళ్లారు.

అయితే.. అప్ప‌టికి కేవ‌లం 15 నిమిషాలే కావ‌డంతో వెంట‌నే వైద్యులు ఆయ‌న‌కు స‌ప‌ర్య‌లు చేసి.. మందు ఇచ్చారు. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా..దేశంలోనూ ఆశ్చ‌ర్యంగా మారింది. కుక్క‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న స‌మ‌యంలో నిజంగానే కుక్క వ‌చ్చి క‌ర‌వ‌డంపై అంద‌రూ విస్మ‌యం కూడా వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా రెబీస్ కేసులు పెరుగుతున్నాయి. అయితే.. రోగుల‌కు త‌గిన సంఖ్య‌లో వైద్యం,మందులు అందుబాటులో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.