విమానాల్లోనూ ఈ20.. కేంద్రంపై బాంబు పేల్చిన కేజ్రీవాల్
ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం గానీ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గానీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
By: A.N.Kumar | 6 Aug 2026 4:07 PM ISTకేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇథనాల్ మిశ్రమ ఇంధన విధానం దేశవ్యాప్తంగా మరోసారి తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఇప్పటికే సాధారణ పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ (ఈ20) కలిపి విక్రయించడంపై వాహనదారులు, ఆటోమొబైల్ నిపుణుల నుంచి అనేక సందేహాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.
తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించిన అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. తన వద్ద ఉన్న సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) లో కూడా ఇథనాల్ కలపడానికి సన్నాహాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. విమాన ఇంధనంలో ఇథనాల్ కలపడం వల్ల విమానాల భద్రతపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ప్రమాదముందని విమానయాన రంగానికి చెందిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తన వ్యాఖ్యల్లో పేర్కొన్నారు. ప్రయాణికుల ప్రాణాలకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని ఆయన విమర్శించారు.
సాధారణంగా ముడి చమురు దిగుమతి భారాన్ని తగ్గించుకోవడం, రైతులకు అదనపు ఆదాయం సమకూర్చడం, పర్యావరణ కాలుష్యాన్ని అదుపు చేయడం అనే సదుద్దేశాలతో కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ బ్లెండింగ్ విధానాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే పెట్రోల్‌లో ఇథనాల్ శాతం పెంచడం వల్ల పాత వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయని, మైలేజ్ తగ్గుతోందని ఇప్పటికే వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే విధానాన్ని అత్యంత సున్నితమైన విమానయాన రంగానికి కూడా విస్తరిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తుతున్నాయి. విమానాల ఇంజిన్ భద్రత, గాలిలో ఉష్ణోగ్రతల వ్యత్యాసాలను తట్టుకునే సామర్థ్యంపై ఇథనాల్ ఎటువంటి ప్రభావం చూపుతుందోనన్న చర్చలు మొదలయ్యాయి.
ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం గానీ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గానీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలలో ఎంతవరకు నిజముందనే దానికి సంబంధించి తగిన ఆధారాలు లేదా ప్రభుత్వ ధృవీకరణ ఇంకా బయటకు రాలేదు. ప్రస్తుతానికి ఈ అంశం కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితమా లేక నిజంగానే ప్రభుత్వం విమాన ఇంధనంలో మార్పులపై పరిశీలన చేస్తోందా అనేది స్పష్టమవ్వాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం లేదా విమానయాన శాఖ నుంచి అధికారిక వివరణ వస్తే తప్ప ఈ గందరగోళానికి తెరపడే అవకాశం లేదు.
