శివయ్యా.. వచ్చేస్తున్నా.. తీగ మార్గంలో కేదార్ నాథ్‌కు చకచకా
అది 2013... హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని అతి భారీ వర్షాలు ముంచెత్తాయి... దీంతో ఆ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లా అతలాకుతలం అయింది.
By: Tupaki Political Desk | 11 Oct 2025 9:57 PM ISTఅది 2013... హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని అతి భారీ వర్షాలు ముంచెత్తాయి... దీంతో ఆ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లా అతలాకుతలం అయింది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రసిద్ధి చెందిన కేదార్ నాథ్ ఆలయ ప్రాంతానికి సైతం వరద పోటెత్తింది. ఆ వరదల తీవ్రత చూస్తే.. కేదార్‌నాథ్ ఆలయం కొట్టుకుపోయేదే.. కానీ, వరదకు ఒక భారీ రాయి అడ్డుపడి ఆలయానికి రక్షణగా నిలిచింది. ఇప్పుడు ఆ రాయిని భీమ శిలగా పిలుస్తున్నారు. ఈ ఘటన తర్వాత సముద్ర మట్టానికి 3,5844 మీటర్ల ఎత్తులో.. మందాకినీ నది పైన మంచుకొండల్లో ఉండే కేదార్ నాథ్ క్షేత్ర మహిమ మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే..
మహా శివా.. వచ్చేస్తున్నా
మహా శివుడు కొలువైన కేదార్‌నాథ్ క్షేత్రానికి చేరేందుకు ఇప్పటివరకు అనేక ప్రయాసలు పడాల్సి వస్తోంది. కారణం.. హిమాలయాల్లో కొలువై ఉండడమే. అయినప్పటికీ భక్తులు తండోపతండాలుగా వెళ్తుంటారు. దీంతో కేదార్ నాథ్‌కు సురక్షిత రవాణా మార్గంగా కేంద్ర ప్రభుత్వం రోప్ వే (తీగల మార్గం) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది సోన్ ప్రయాగ్ నుంచి కేదార్‌నాథ్‌ను అనుసంధానిస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే భక్తులు నేరుగా ఆకాశ మార్గంలో మహా శివుడిని చేరుకోవచ్చు.
8-9 గంటల ప్రయాణం.. అరంగటకు..
కేదార్ నాథ్‌లోని మంచుకొండల్లో ఉన్న మహాశివుడిని దర్శించుకోవాలంటే.. ప్రస్తుతం 8 నుంచి 9 గంటల పాటు హిమాలయాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. అదే రోప్ వే పూర్తయితే సోన్ ప్రయాగ్ నుంచి కేవలం 36 నిమిషాల్లో కేదార్ నాథ్ చేరుకోవచ్చు. కాగా, అదానీ ఎంటర్ ప్రైజెస్ సంస్థ ఈ రోప్ వే నిర్మాణం చేపడుతోంది. 12.90 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును జాతీయ రోప్ వేస్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ -పర్వతమాల పరియోజనలో భాగంగా చేపట్టారు. దీని నిర్మాణ వ్యవధి ఆరేళ్లు.
ఖర్చు రూ.4 వేల కోట్లు
రూ.4,081 కోట్లతో చేపట్టిన కేదార్ నాథ్ రోప్ వే ద్వారా గంటకు 1800 మంది ప్రయాణించవ్చు. అధునాతన ట్రై కేబుల్ డిటాచబుల్ గొండోలా సాంకేతికతను దీని నిర్మాణంలో వాడుతున్నారు. అయితే, అదానీ ఎంటర్ ప్రైజెస్- నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్ మెంట్ ప్రభుత్వ ప్రైవేటు పార్ట్ నర్ షిప్ (పీపీపీ) పద్ధతిలో చేపట్టాయి. రోప్ వే పూర్తయితే మహిళలు, పిల్లలు, వయోధికులకు కేదార్ నాథ్ మహా శివుడి దర్శనంలో ఇబ్బందులు తప్పుతాయి. అంతేకాదు... ఈ ప్రదేశానికి పర్యటకంగా మరింత పేరొస్తుంది. కొత్త ఉద్యోగాలనూ సృష్టిస్తుంది. కొందరు ప్రస్తుతం కేదార్ నాథ్ కు హెలికాప్టర్లలో చేరుతూ డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఇలాంటి వారు రోప్ వేను ఆశ్రయిస్తారు. ఈ ఏడాది జూలై నాటికే రోప్ వే పూర్తికావాల్సి ఉంది. కానీ, నిర్మాణ సంక్లిష్టతల రీత్యా ఆలస్యమైంది.
