Begin typing your search above and press return to search.

ఆ పాటపై పార్లమెంట్ లో చర్చ.. కేంద్రమంత్రి ఏమన్నారంటే?

సభ్యత కంటే సంచలనమే ఆయుధంగా కొన్ని సినిమాల్ని సిద్ధం చేస్తుంటారు. సినిమాలో ఒక పాట మీద రేగిన రచ్చ పుణ్యమా అని యావత్ దేశానికి ఇప్పుడీ సినిమా గురించి మాట్లాడుకునే పరిస్థితి.

By:  Garuda Media   |   18 March 2026 8:06 PM IST
ఆ పాటపై పార్లమెంట్ లో చర్చ.. కేంద్రమంత్రి ఏమన్నారంటే?
X

సభ్యత కంటే సంచలనమే ఆయుధంగా కొన్ని సినిమాల్ని సిద్ధం చేస్తుంటారు. సినిమాలో ఒక పాట మీద రేగిన రచ్చ పుణ్యమా అని యావత్ దేశానికి ఇప్పుడీ సినిమా గురించి మాట్లాడుకునే పరిస్థితి. ఈ వివాదం సినిమా కలెక్షన్ల మీద ఎంత సానుకూలంగా ఉంటుందన్నది పక్కన పెడితే.. స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే.. చర్యలు తప్పవన్న విషయాన్ని కేంద్రం తన చర్యతో స్పష్టం చేసిందని చెప్పాలి. ‘కేడీ: ది డెవిల్’ మూవీలో ‘సర్కే చునారే తేరీ సర్కే’ పాట వివాదం తాజాగా పార్లమెంటు సమావేశాల్లోనూ ప్రశ్న రూపంలో చర్చకు వచ్చింది.

ఈ బూతు పాటను తప్పు పడుతూ సమాజ్ వాదీ పార్టీ ఎంపీఆనంద్ భదౌరియా సభలో లేవనెత్తారు. ఈ పాటలోని అశ్లీల సాహత్యం.. పాటను చిత్రీకరించిన తీరును సభలో ప్రస్తావిస్తూ.. సినిమా పాటల్లో వస్తున్న వికృత ధోరణులపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలన్నారు. దీనికి స్పందించిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్.. ‘భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎప్పుడూ సంపూర్ణమైనది కాదు.అది సమాజం, సంస్కత్రికి అనుగుణంగా ఉండాలి. సమాజానికి.. పిల్లలు.. మహిళలకు హాని కలిగించే ఇలాంటి అశ్లీల కంటెంట్ పై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ పాటను బ్యాన్ చేశాం. 2021 ఐటీ నిబంధనలకు అనుగుణంగా డిజిటల్ ప్లాట్ ఫారమ్ లకు నోటీసులు పంపాం. పలు అశ్లీల ఓటీటీ ప్లాట్ ఫారమ్ లను గతంలోనే బ్లాక్ చేశాం. ఈ తరహా అంశాలపై కఠినంగా వ్యవహరిస్తాం’’ అని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు సహేతుకమైన పరిమితులు ఉంటాయన్న విషయాన్ని ఎవరూ మర్చిపోకూడదని స్పష్టం చేశారు.

ఈ పాట మీద నెలకొన్న వివాదం నేపథ్యంలో చిత్ర నిర్మాతలు ఈ పాటను యూట్యూబ్ నుంచి హిందీ వెర్షన్ ను తొలగించారు. నిజానికి హిందీ వెర్షన్ లోని పదాలే తీవ్ర అభ్యంతరానికి దారి తీశాయని చెబుతున్నారు. ఈ పాటపై పార్లమెంట్ లో జరిగిన చర్చలో బీజేపీ ఎంపీ కం నటి కంగనా రౌనత్ స్పందించారు. బాలీవుడ్ పాటల్లో అశ్లీలత గీత దాటుతోందన్న ఆమె.. ‘న్యూ లో’గా అభివర్ణించారు. సినిమాలలో అశ్లీలతను అరికట్టేందుకు కఠినమైన నిబంధనలు అవసరమని ఆమె డిమాండ్ చేశారు. ఇదే అంశంపై గోరఖ్ పూర్ ఎంపీ రవి కిషన్ సైతం స్పందించారు. విలువల్ని దెబ్బ తీసే ఈ తరహా అశ్లీలతను ప్రోత్సహించకూడదన్నారు. వ్యాపారం కోసం.. సినిమాకు హైప్ తీసుకురావటం కోసం ఇలాంటి పనులు చేయటం మంచిది కాదన్నారు. పార్లమెంటుకు ఈ వివాదం చేరటానికి ముందే కర్ణాటక మహిళా కమిషన్ జోక్ం చేసుకొని.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కు సైతం తన అభ్యంతరాన్ని తెలియజేస్తూ లేఖ రాయటం తెలిసిందే.