Begin typing your search above and press return to search.

మళ్లీ సెంటిమెంట్ అస్త్రం.. కాంగ్రెస్ ను చీల్చిచెండాడిన కేసీఆర్

గులాబీ దళపతి కేసీఆర్ చాలా కాలం తర్వాత బయటకొచ్చాడు. తెలంగాణ భవన్ కు వచ్చి పార్టీపై , కాంగ్రెస్ ప్రభుత్వంపై సమీక్షించారు.

By:  A.N.Kumar   |   22 Dec 2025 12:05 AM IST
మళ్లీ సెంటిమెంట్ అస్త్రం.. కాంగ్రెస్ ను చీల్చిచెండాడిన కేసీఆర్
X

గులాబీ దళపతి కేసీఆర్ చాలా కాలం తర్వాత బయటకొచ్చాడు. తెలంగాణ భవన్ కు వచ్చి పార్టీపై , కాంగ్రెస్ ప్రభుత్వంపై సమీక్షించారు. వరుస ఎన్నికల్లో ఎదురైన పరాజయాలు,పార్టీ లోపల పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో బీఆర్ఎస్ కు మళ్లీ ఊపిరి పోయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. వ్యవసాయ క్షేత్రం నుంచి నేరుగా శనివారం రాత్రి నందినగర్ కు చేరుకున్న కేసీఆర్, ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు, సీనియర్ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముందే ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయో గులాబీ పార్టీ మీడియాకు సంకేతాలు పంపింది.

మళ్లీ సెంటిమెంట్ కార్డ్ నే..

సమావేశంలో కేసీఆర్ మరోసారి సెంటిమెంట్ రాజకీయాలనే ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటే తెలంగాణకు శాపం అంటూ వ్యాఖ్యానించడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు జిల్లా తీవ్ర వివక్షకు గురైందని పాలమూరు-రంగారెడ్డి జిల్లాలకు రావాల్సిన 174 టీఎంసీల నీరు ఇప్పటికీ అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ యాక్ట్ ను కూడా పట్టించుకోలేదని మండిపడ్డారు. వాస్తవానికి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు నీటి అన్యాయం అంశంపై మాట్లాడితే పెద్దగా వివాదం ఉండేది కాదు. కానీ ఏపీ ఏర్పాటు మొత్తాన్నే తెలంగాణకు అన్యాయంగా చిత్రీకరించడం ద్వారా కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్ రాజకీయాల దారినే ఎంచుకున్నారని అర్థమవుతోంది.

గులాబీ పార్టీ 2014, 2018 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ను బలంగా రగిలించి అధికారాన్ని దక్కించుకుంది. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అదే వ్యూహం పనిచేయలేదు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో స్వయంగా కేసీఆర్ ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. పార్టీ చరిత్రలో తొలిసారిగా బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు. ఇటీవల జూబ్లిహిల్స్, కంటోన్మెంట్ ఉప ఎన్నికలు, అలాగే పంచాయితీ ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది.

ఎన్నికల ముందు రాజకీయ వేడి

మరికొద్దిరోజుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండడంతోనే కేసీఆర్ మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఒకప్పుడు ‘యూరియా ఇంటికే వచ్చేది. ఇప్పుడు కుటుంబమంతా లైన్లో నిలబడాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శించారు. కొత్త పథకాలు లేవు, ఉన్నవాటినే ఆపేస్తున్నారు. రైతుల కోసం కట్టిన చెక్‌డ్యామ్‌లను పేల్చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పారు. అలాగే “మేము అధికారంలో ఉన్నప్పుడు అహంకారం ప్రదర్శించలేదు. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే గులాబీ పార్టీ సత్తా తెలిసేది” అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ప్రజల మనోగతం మారిందా?

చాలా రోజుల తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చిన కేసీఆర్ ఒక కొత్త రాజకీయ వ్యూహం ప్రకటించారు. మళ్లీ సెంటిమెంట్ రాజకీయాలు రాజేశారు.. ఏపీ ఏర్పాటు తెలంగాణకు శాపం అన్న కేసీఆర్ వ్యాఖ్యలను ప్రజలు ఎంతవరకూ విశ్వసిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే సెంటిమెంట్ రాజకీయాలకు ఇంకా బలం ఉందా? ప్రజలు కొత్త రాజకీయ దిశను కోరుకుంటున్నారా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకనుంది.