కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్.. ఫామ్‌హౌస్ నుంచి ప్రజల్లోకి కేసీఆర్.. త్వరలో పాదయాత్రకు రెడీ
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు.
By: A.N.Kumar | 6 Sept 2026 10:49 PM ISTతెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు. సీఎం రేవంత్‌వి చిల్లర మాటలని, పాలన చేతకాక వ్యక్తిగత విమర్శలు, బూతులు మాట్లాడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. రాష్ట్రంలో కొనసాగుతున్నది థర్డ్ క్లాస్ పాలన అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో జరిగిన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా నకిరేకల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన సవాళ్లు, విమర్శలకు కేసీఆర్ ఈ సమావేశం వేదికగా గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, యువత, మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతు భరోసా, రుణమాఫీతో పాటు వివిధ సంక్షేమ పథకాల అమలులో జాప్యం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని కేసీఆర్ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా కక్ష సాధింపు రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు.
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలి
సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా హాజరుకావాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రజా సమస్యలను అసెంబ్లీ వేదికగా బలంగా ప్రస్తావించాలని సూచించారు. పెండింగ్ సంక్షేమ పథకాలు, రైతు భరోసా, రుణమాఫీ అమలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు.
అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలకు మరోసారి గుర్తు చేస్తూ ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కేసీఆర్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోలేదని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే ప్రభుత్వం దోపిడీలకు పాల్పడుతోందని కేసీఆర్ ఆరోపించారు.
త్వరలో ప్రజల్లోకి కేసీఆర్
ఈ సమావేశంలో కేసీఆర్ చేసిన మరో కీలక ప్రకటన బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. త్వరలో తాను పాదయాత్ర చేపట్టి నేరుగా ప్రజల్లోకి వెళ్లనున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు.
ఇటీవల కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారంటూ ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలకు ఈ ప్రకటన సమాధానంగా మారింది. కేసీఆర్ పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్, తేదీలు, ఇతర వివరాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
మొత్తంగా రేవంత్ రెడ్డి–కేసీఆర్ మధ్య మాటల యుద్ధం మరోసారి తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తన పాలనను ప్రజలకు వివరిస్తుండగా.. మరోవైపు బీఆర్ఎస్ గత పాలనతో పోల్చుతూ ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచుతోంది. రాబోయే అసెంబ్లీ సమావేశాలు ఈ రాజకీయ పోరుకు మరింత వేదికగా మారే అవకాశం కనిపిస్తోంది.
