మోడీ రాక.. కేసీఆర్ సైలెంట్.. కవిత ఓపెన్ లెటర్!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
By: Garuda Media | 10 May 2026 2:11 PM ISTప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలానే సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్‌లో జరిగే భారీ బహిరంగ సభలో కూడా పాల్గొననున్నారు. అయితే.. ఇది అధికారిక కార్యక్రమం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారా? లేదా? అనేది ప్రశ్నగా మారింది. మరోవైపు.. మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్.. ప్రధానికి శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలుకుతారని.. కార్యక్రమంలో పాల్గొంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిని బట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుపై సందేహాలు ముసురుకున్నాయి.
ఇదిలావుంటే.. మాజీ సీఎం కేసీఆర్.. తాజాగా మోడీ పర్యటనపై ఎలాంటి కామెంట్ చేయలేదు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి నరేంద్ర మోడీ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన స్పందన ఎలా ఉంటుందన్న విషయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరిగింది. కానీ.. కేసీఆర్ సైలెంట్ అయిపోయారు. ఆయన అధికారంలో ఉన్నప్పు డు కూడా ప్రధాని పలు మార్లు వచ్చినా.. ఎన్నికలకు ఏడాది ముందు ప్రధానితో వైరం పెట్టుకున్న కేసీఆర్.. ఆయన పర్యటన లను లైట్‌తీసుకున్నారు. వివిధ కారణాలతో ప్రధాని పర్యటనలకు డుమ్మా కొట్టారు.
మరోవైపు.. తెలంగాణ రక్షణ సేన(టీఆర్ ఎస్)పేరుతో పార్టీ పెట్టిన కవిత మాత్రం ప్రధానికి బహిరంగ లేఖ సంధించారు. తెలంగాణ కు వస్తున్న ప్రధాని రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని కోరారు. ఈ సందర్భంగా ప్రధాన అంశాలను ప్రస్తావించిన ఆమె.. వాటి పరిష్కారానికి డిమాండ్ చేశారు. కీలకమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నీటి పారుదల పథకానికి జాతీయహోదా కల్పించాలని కవిత విన్నవించారు. అలానే.. 2027 జనాభా లెక్కలు జరుగుతున్న నేపథ్యంలో జాబితాలో `ప్రత్యేక ఓబీసీ` కాలమ్‌ను చేర్చాలని సూచించారు. ఇక, `ఓబీసీ ఉప కోటా`తో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో తిరిగి ప్రవేశపెట్టాలన్నారు.
తెలంగాణలో వెనుకబడిన తరగతుల(బీసీ)కు 43 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లులకు రాష్ట్రపతి ఆమోద ప్రక్రియను వేగవంతం చేసేలా చూడాలని ప్రధానిని కవిత కోరారు. తెలంగాణ రాష్ట్రం, ప్రజల ప్రయోజనాలు, దేశంలో సామాజిక న్యాయ సాధనకు సంబంధించి కేంద్రం చొరవ తీసుకోవాలని తన లేఖలో విన్నవించారు. ఆయాఅంశాలను పరిష్కరించడం ద్వారా.. దేశంలో సమాఖ్య స్ఫూర్తికి ప్రధాని మరింత దన్నుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు కవిత బహిరంగ లేఖ సంధించారు. ఇదిలావుంటే.. బీజేపీ కేంద్ర మంత్రులు, పార్టీ నాయకులు ప్రధాని మోడీ పర్యటనకు దాదాపు లక్ష మందిని తరలించే పనిలో బిజీగా ఉన్నారు.
