Begin typing your search above and press return to search.

ఇక నుంచి కధ వేరేనట ...కేసీఅర్ సడెన్ ఎంట్రీ వెనక ?

అసలు ఇంతకీ కేసీఆర్ ఇపుడు సడెన్ గా రావడమేంటి, ఈ రెండేళ్ళ ముహూర్తమేంటి, ఇక సమయం లేదు మిత్రమా అంటూ ఈ గర్జించడమేంటి, దీని వెనక రీజన్ ఏంటి అని తరచి చూస్తే కనుక చాలా విషయాలే కనిపిస్తాయి.

By:  Satya P   |   22 Dec 2025 11:28 AM IST
ఇక నుంచి కధ వేరేనట ...కేసీఅర్ సడెన్ ఎంట్రీ వెనక ?
X

కేసీఆర్ ఈ మూడు అక్షరాలు తెలంగాణ ఉద్యమ కాలంలో ఎంతగా ప్రభావితం చేశాయో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇక రాదు అనుకున్న తెలంగాణా రాష్ట్రం కలను కేసీఆర్ సాకారం చేశారు. దాని వెనక ఆయన వ్యూహాలు రాజకీయ ఎత్తుగడలు ముఖ్య పాత్ర పోషించాయన్నది అందరికీ తెలిసిందే. కేసీఆర్ తెలంగాణా రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కూడా చరిత్ర సృష్టించారు. అంతే కాదు వరుసగా రెండోసారి గెలిచి మరీ తన సత్తా చాటారు. అయితే హ్యాట్రిక్ సీఎం తానే అని భ్రమలో పడి 2023లో అధికారం పూర్తిగా పోగొట్టుకున్నారు. కట్ చేస్తే రెండేళ్ళ తరువాత మీడియా ముందుకు కేసీఆర్ వచ్చారు. అదే స్ట్రాంగ్ వాయిస్, అదే బిగ్ సౌండ్, అవే పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఆయన మీడియా ముందు తనదైన ఒరిజినల్ స్టైల్ ని ప్రదర్శించారు. ఇక తగ్గేదే లేదంటూ రేవంత్ రెడ్డి సర్కార్ మీద నిప్పులే చెరిగారు. అసలు ఇంతకీ కేసీఆర్ ఇపుడు సడెన్ గా రావడమేంటి, ఈ రెండేళ్ళ ముహూర్తమేంటి, ఇక సమయం లేదు మిత్రమా అంటూ ఈ గర్జించడమేంటి, దీని వెనక రీజన్ ఏంటి అని తరచి చూస్తే కనుక చాలా విషయాలే కనిపిస్తాయి.

పంచాయతీ ఫలితాలు :

ఇటీవల మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ కి గెలుపు దక్కింది కానీ డిస్టిక్షన్ మాత్రం రాలేదు. మొత్తం ఫలితాలలో 56 శాతమే ఆ పార్టీకి సీట్లుగా వచ్చాయి. అంటే అక్కడికి 44 శాతం ఫలితాలు విపక్షాలకు వెళ్ళిపోయాయి. అందులో కూడా 40 శాతం ఫలితాలు బీఆర్ఎస్ కి అనుకూలంగా వచ్చాయి. ఏకంగా 3700 పై దాటి సర్పంచ్ పదవులు గెలుచుకోవడం అంటే మామూలు విషయం కాదు, ఇక ఇతరుల కోటాలో మరో 1500 మంది గెలిచారు. అందులో కూడా విపక్షాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. దాంతో చూస్తే సగానికి సగం ప్రభుత్వం మీద వ్యతిరేకత పల్లెలలో ఉందని రాజకీయ చాణక్యుడు అయిన కేసీఆర్ గ్రహించారు. దాంతోనే ఆయన ఇక ఇదే అసలైన టైం అని భావించే రంగంలోకి దూకారు అని అంటున్నారు.

స్థానికంగా స్ట్రాంగ్ :

ఇక తొందరలో జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు కానీ అన్నీ గుర్తుల మీదనే జరుగుతాయి. గుర్తులు లేకపోవడం వల్లనే తాము పూర్తి స్థాయిలో ఆధిక్యం ప్రదర్శించలేకపోయామని కేసీఆర్ తాజా మీడియా మీట్ లో చెప్పడం ఇక్కడ గమనార్హం. అంటే కారు గుర్తు ఉంటే కచ్చితంగా జోరు చేసే వాళ్ళమని ఆయన మాటలలో వచ్చిన సౌండ్ గా చూడాలి. దాంతో రాబోయే ఎన్నికల్లో అన్నీ పార్టీ గుర్తు మీద ఉంటాయి కాబట్టి గట్టిగా చెలరేగిపోవడానికి బీఆర్ఎస్ కి ఇదే తగిన చాన్స్ అని కేసీఆర్ అంచనా వేసుకునే గులాబీ శ్రేణులకు ఉత్సాహం ఇచ్చేలా తాను జనంలోకి అంటున్నారు.

అసంతృప్తి ఉందా :

సాధారణంగా ఒక ప్రభుత్వం మీద జనంలో అభిప్రాయం మారాలి అంటే కనీసంగా రెండేళ్ళ సమయం పడుతుంది. దాంతో జనం నాడి ఏమిటో కూడా తెలుస్తుంది. ఇపుడు అదే జరిగింది. జనంలో అసంతృప్తి ఉందని కేసీఆర్ బాగానే పసిగట్టారు అని అంటున్నారు. దానికి కారణం చెప్పిన మేరకు హామీలు అమలు చేయకపోవడం ఒకటి అయితే గతంలో బీఆర్ఎస్ ఉండగా చేసిన కార్యక్రమాలు కొన్ని నీరు కారడం మరో ఎత్తు. అంతే కాకుండా కాంగ్రెస్ మార్క్ పాలన వల్ల కూడా జనాలకు ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కడం లేదు అన్నది ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అసంతృప్తి ఉందని రాజకీయంగా ఒక అంచనాకు వచ్చిన కేసీఅర్ తాము కనుక గట్టిగా ఉంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఇటు ప్రజలలో అటు ప్రభుత్వంలో కూడా కదలిక తేవచ్చు అని భావించే సింహగర్జన చేశారు అని అంటున్నారు.

పడికట్టు డైలాగులతో :

కేసీఆర్ అంటేనే కొన్ని పడిగట్టు డైలాగులు ఉంటాయి. వాటిని అచ్చంగా ఆయనే మీడియా ముందు వాడారు ఇక ఆగేది లేదు, తోలు తీస్తామంటూ ఆయన చేసిన బిగ్ సౌండ్ ఎవరికి నచ్చాలో వారికి నచ్చుతుంది, ఎవరికి గట్టుగా గుచ్చుకోవాలో వారికి గుచ్చుతుంది. ఆయన తనదైన స్టైల్ తో మీడియా ముందుకు వచ్చారు అని అంటున్నారు. అంతే కాదు ఆయన నీటి సెంటిమెంట్ నే ఇపుడు ఒక ఇష్యూగా ఎంచుకున్నారు. కృష్ణా జలాల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తూంటే రేవంత్ రెడ్డి సర్కార్ కిక్కురుమనని తీరుని కూడా ఆయన ఎండగట్టారు. మీరు ఊరుకుంటే తెలంగాణా దారుణంగా నష్టపోతుందని ఒక పవర్ ఫుల్ ఆయుధంతోనే జనంలోకి వెళ్ళడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. నీటితోనే నిప్పులు పుట్టించాలని పెద్దాయన అలా డిసైడ్ అయిపోయారు.

స్వయంగా తాను సైతం :

గడచిన రెండేళ్ళ కాలంలో బీఆర్ఎస్ కి ఎక్కడా పట్టు చిక్కలేదు, 2024లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు రాలేదు, ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు, అయితే తాజాగా జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓడినా తమ ఓటు షేర్ ని బీఆర్ఎస్ నిలబెట్టుకోవడం కొంత బలాన్ని ఇస్తే పంచాయతీ ఫలితాలు ఇపుడు కొత్తగా బూస్టింగ్ ఇచ్చాయి. దాంతో కేసీఆర్ ఇక బస్తీ మే సవాల్ అని అంటున్నారు. అంతే కాదు పల్లెలు మన వైపే అన్న ధీమాతోనే ఆయన తాను సైతం రంగంలోకి దిగుతాను ప్రత్యక్ష పోరాటం చేస్తాను అంటూ గులాబీ శ్రేణులను మొత్తం కదిలించేందుకు సిద్ధం అయ్యారని అంటున్నారు.

కొత్త లెక్కలేనా :

ఇక కేసీఆర్ అంటున్నది చూస్తే ఇప్పటిదాకా ఒక లెక్క అని ఇక డిఫరెంట్ స్టోరీ అని చెబుతున్నారు. అంటే కొత్త లెక్కలను ఆయన రెడీ చేసి ఉంచారా అన్నది కూడా విశ్లేషించుకుంటున్నారు. ప్రజా సమస్యలు కాంగ్రెస్ కి పట్టవని ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందా మాత్రమే చేస్తున్నారని కేసీఆర్ తీవ్ర విమర్శలు చేయడం వెనక అన్ని వర్గాలను ఆకట్టుకునే వ్యూహం ఉంది. అంతే కాదు తాను రెండేండ్లు ఓపిక పట్టానని ఇక అసలు ఊరుకునేది లేదని చెప్పడం కూడా జనాలను కన్వీన్స్ చేసే ప్రయత్నమే అంటున్నారు. తోలు తీస్తాం అంటూ తన స్టైల్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ అయితే చలితో వణుకుతున్న తెలంగాణాలో కొత్త రాజకీయ వేడిని పుట్టించినట్లే అని అంతా భావిస్తున్నారు. మొత్తానికి రేవంత్ సర్కార్ ని నిలదీసి నిగ్గదీయడానికి ఇదే కరెక్ట్ టైం అని గులాబీ బాస్ ఫిక్స్ అయినట్లే.