Begin typing your search above and press return to search.

2025 రౌండప్ : కేసీఆర్, బీఆర్ఎస్ కు గడ్డు కాలమే నడిచింది

కేసీఆర్.. తెలంగాణ సాధించిన నేతగా ప్రజల్లో ఒక మంచి పేరు ఉంది. ఈ మూడు అక్షరాలు తెలంగాణలో తెలియని వారు ఉండరు.

By:  A.N.Kumar   |   30 Dec 2025 8:15 AM IST
2025 రౌండప్ : కేసీఆర్, బీఆర్ఎస్ కు గడ్డు కాలమే నడిచింది
X

కేసీఆర్.. తెలంగాణ సాధించిన నేతగా ప్రజల్లో ఒక మంచి పేరు ఉంది. ఈ మూడు అక్షరాలు తెలంగాణలో తెలియని వారు ఉండరు. కేసీఆర్ బీఆర్ఎస్ ఈ రెండు పేర్లు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి దశాబ్ద కాలం రాజకీయ దిశా నిర్దేశం చేశాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం.. వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా అయ్యి.. తన పథకాలు, పాలనతో కేసీఆర్ ప్రజలను విపరీతంగా ప్రభావితం చేశారు.. అయితే అదే కేసీఆర్ కు.. అదే బిఆర్ఎస్ కు 2025వ సంవత్సరం మాత్రం అనుకూలంగా లేదనే అభిప్రాయం వారి ట్రాక్ రికార్డు చూస్తే అర్థమవుతోంది.

ప్రతిపక్ష నేతగా పరిమిత పాత్ర

అధికారంలో ఉన్నన్నీనాళ్లు దర్జాగా ఉన్న కేసీఆర్.. అధికారం కోల్పోగానే ప్రజలకు దూరమయ్యారని అపవాదులు మూటగట్టుకున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ నుంచి గట్టి పోరాటం ఆశించిన ఆ స్థాయిలో ఆయన కనిపించలేదని విమర్శలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు పార్టీ అంతర్గత సంక్షోభాలు ఎమ్మెల్యేల జంప్ లు కేసీఆర్ ను మరింత ఇబ్బంది పెట్టాయి. పార్టీ టికెట్ పై గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు నలుగురు 2025వ సంవత్సరంలోనే గులాబీ గూటిని వదిలి హస్తం నీడకు చేరడం బి ఆర్ ఎస్ కు పెద్ద దెబ్బగా మారింది.

న్యాయపోరాటం… కానీ ఫలితం ఆలస్యం…

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపు చట్టం కింద చర్య తీసుకోవాలని కేసిఆర్ , బీఆర్ఎస్ టీం పట్టువదలని విక్రమార్కుల్లా పోరాటం చేశారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు వరకు వెళ్లిన కేసులో ఆశించిన వేగం లేకపోవడం వల్ల కాంగ్రెస్ తనదైన శైలిలో స్పీకర్ ద్వారా చక్రం తిప్పడంతో ఈ న్యాయ పోరాటం ఫలించలేదు. దీంతో పార్టీ మారిన వారిపై చర్యలు లేక బీఆర్ఎస్ డీలా పడిపోయింది.

కవిత వ్యవహారం.. ఇంటి నుంచే షాక్

ఇక బీఆర్ఎస్ ను కుదిపేసిన మరో వివాదం కేసీఆర్ కుటుంబంలోనే కవిత వల్ల వచ్చిన సంక్షోభం. కుమార్తె కవిత పార్టీకి కుటుంబానికి దూరంగా జరగడం వేరుకుంపటి పెట్టడం.. తీవ్ర విమర్శలు చేయడం.. గులాబీ వర్గాలను కలవర పెట్టింది. ఇదే ప్రతిపక్ష కాంగ్రెస్ కు బిజెపికి ఆయుధంగా మారింది. బీఆర్ఎస్.. కేసీఆర్ ను టార్గెట్ చేయడానికి కవిత ఆస్కారం ఇచ్చింది. పదేళ్ల పాలనపై విచారణ చేయిస్తానంటూ కవిత చేసిన హెచ్చరికలు కూడా రాజకీయంగా కాకపోయినా నైతికంగా కేసీఆర్ కు షాకింగ్ గా మారాయి. లక్ష్యం వేరైనా దెబ్బ మాత్రం కేసిఆర్కే పడుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కవిత నేరుగా అన్న కేటీఆర్ , బావ హరీష్ ను విమర్శించినా కూడా అది అంతిమంగా బీఆర్ఎస్ కే నష్టం వాటిల్లినట్టయింది.

అనారోగ్యం.. ఫామ్ హౌస్ రాజకీయాలతో కేసీఆర్

కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అన్నమాట బీఆర్ఎస్ వర్గాల్లోనే ఎక్కువగా వినిపిస్తోంది. అందుకే కేసిఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి పరిమితమై అవసరమైనప్పుడు మాత్రమే బయటకు వస్తున్నారని సమాచారం. బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలను ఫామ్ హౌస్ నుంచే నడిపిస్తూ బాధ్యతలను కుమారుడు కేటీఆర్ కు అప్పగించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడు. అయితే అదే సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం.. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ల ఆరోపణలు.. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో అక్రమాలు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణలు చేయడం కేసుల హెచ్చరికలు చేయడంతో గులాబీ పార్టీపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఇదే పార్టీపై ప్రజల్లో కొంత డ్యామేజ్ జరగడానికి అవకాశం కల్పించింది.

అసెంబ్లీలో అరుదైన హాజరు

2025–26 బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఒక్కసారి మాత్రమే అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ చాలా తక్కువ సమయంలోనే సభను వీడారు. ఆ తర్వాత దాదాపు కనిపించలేదు. తాజాగా శీతాకాల సమావేశాల మొదటి రోజు అసెంబ్లీకి హాజరుకాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి షేక్ హ్యాండ్ చేసి వెళ్లిన దృశ్యం వైరల్‌గా మారింది. అయినా కొద్దిసేపు మాత్రమే కేసీఆర్ సభలో ఉండి వెళ్లిపోవడంతో ఆయన ప్రతిపక్షనేత పాత్ర పరిమితంగానే కనిపించింది.

ఒక్క బహిరంగ సభ… ఒక్క ప్రెస్‌మీట్

జల వివాదాల నేపథ్యంలో నల్లగొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభ తప్ప 2025లో కేసీఆర్ పెద్దగా ప్రజల్లో కనిపించలేదు. రెండేళ్ల తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో ‘కేసీఆర్ ఈజ్ బ్యాక్’ అన్న భావన కలిగించినా ఆ తర్వాత మళ్లీ సైలెంట్ కావడం పార్టీ శ్రేణులను నిరాశపరిచింది.

ఎన్నికల ఫలితాలు

ఈ ఏడాది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. తిరిగి గెలుచుకోవాలన్న ప్రయత్నం ఫలించలేదు. పంచాయతీ ఎన్నికల్లో మాత్రం కొంత పరువు నిలబెట్టుకున్నా మొత్తం మీద రాజకీయంగా అది సరిపోలేదనే విశ్లేషణలు ఉన్నాయి.

మొత్తం చిత్రమేమిటంటే…

ఇంటా, బయట ప్రతికూల పరిస్థితులు, న్యాయపోరాటాలు, కుటుంబ సంక్షోభాలు, ఆరోగ్య సమస్యలు.. ఇవన్నీ కలిపి చూస్తే 2025 సంవత్సరం కేసీఆర్‌కు, బీఆర్ఎస్‌కు భంగపాటే మిగిల్చిందనే మాట రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. రాబోయే కాలంలో గులాబీ పార్టీ మళ్లీ పుంజుకుంటుందా? లేక ఈ సంక్షోభం మరింత ముదురుతుందా? అన్నది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.