కేసీఆర్ ఫ్యూచర్: విశ్రాంత వయసులో.. వివాదాల సుడులు!
ఇక, కాళేశ్వరంతో స్వర్ణ తెలంగాణ సాకారం అవుతుందని.. ఇక్కడి రైతుల దేశానికి రారాజులు అవుతారని ఘనంగా ప్రకటించుకున్న బీఆర్ఎస్ అధినేత.. అదే కాళేశ్వరం తెచ్చిన చిక్కుల్లో పీకల్లోతు మునిగిపోయారు.
By: Garuda Media | 5 Aug 2025 10:33 AM ISTతెలంగాణ సాధించిన ఘన చరిత్ర.. పదేళ్ల పాటు అధికారం కట్టబెడితే.. విశ్రాంత వయసులో వివాదాలు మూటగట్టుకున్న నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచిపోతున్నారా? ఆయన చుట్టూ పెద్ద చక్రబంధమే ఏర్పడనుందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. పార్టీ పరంగా, రాజకీయాల పరంగా.. కూడా తీవ్ర సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు కేసీఆర్. కుటుంబ కలహాలతో కుమార్తె కవిత రోడ్డెక్కి వేరు బాటతో పోరు బాటకు సిద్ధమైన దరిమిలా.. ప్రస్తుతం కాడి పడేస్తున్న ఒకప్పటి వీర విధేయులు మరింతగా కేసీఆర్‌కు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారు. 'మీరు తప్ప..' అని ఎంచుకుని మరీ టికెట్లు ఇచ్చిన నాయకులు ఒక్కొక్కరుగా దూరమయ్యారు.
ఇక, కాళేశ్వరంతో స్వర్ణ తెలంగాణ సాకారం అవుతుందని.. ఇక్కడి రైతుల దేశానికి రారాజులు అవుతారని ఘనంగా ప్రకటించుకున్న బీఆర్ఎస్ అధినేత.. అదే కాళేశ్వరం తెచ్చిన చిక్కుల్లో పీకల్లోతు మునిగిపోయారు. పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలో న మాత్రం ఎక్కడో బెడిసి కొడుతున్న పరిణామాలు.. ఆయన స్వరంలో వస్తున్న మార్పు.. వంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ జాతి ఉద్ధారకుడిగా తనను తాను పరిచయం చేసుకున్న కేసీఆర్.. దేశ వ్యాప్తంగా ఓ వెలుగు వెలగాలనే టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ చేసిన నాటి నుంచి ఆయనకు కష్టాలు రెడ్ కార్పెట్ పరిచినట్టు ఆవహించాయి. మునుపటి పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోని దైన్యాన్ని గతంలో ఎన్నడూ.. కేసీఆర్ చవిచూడలేదు.
రాజకీయ కుక్కమూతి పిందెలంటూ.. ఎద్దేవా చేసిన వారు ఏలుబడిలోకి వస్తారని కేసీఆర్ ఊహించనూలేదు. వారే నేడు తనకు సెగ పెడుతున్నారన్న వాదన వినిపిస్తున్నా.. బలమైన గళం వినిపించలేని దైన్యం.. మేడిగడ్డ రూపంలో కళ్లకు కడుతోంది. గొర్రెల పంపిణీలో 550 కోట్ల వరకు బొక్కేశారన్న ఏసీబీ వాదనను తిప్పికొట్టలేని పరిస్థితి కూడా నెలకొంది. బతుకమ్మ చీరల నుంచి గొర్రెల పంపిణీ వరకు.. నర్సింగ్ ఉద్యోగాల నుంచి నేటి సాగు ప్రాజెక్టుల వరకు.. పారిన అవినీతిని రేవంత్ రెడ్డి అనే భూతం వేధింపులకే వెలుగులోకి తెస్తోందని ఎదురు దాడి చేస్తున్నా.. తెలంగాణ సమాజం నమ్మక పోవడం మరో ప్రధాన సమస్య గా మారింది.
పార్టీ అస్థిత్వం ఎలా ఉన్నా.. వారసత్వ పోరులో కుటుంబ రాజకీయం మరింతగా ముదిమి వయసులో కేసీఆర్‌కు మరింత శాపంగా పరిణమించింది. ఒకటి కాదు.. రెండు.. అంటూ. పీఠాన్ని దక్కించుకునేందుకు కన్నబిడ్డలే.. అంతర్గత కుమ్ములాటలతో కంట్లో నలుసుల్లా మారి.. రాజకీయాలను రోడ్డుకు లాగేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఫార్ములా ఈరేసు, ఫోన్ ట్యాపింగ్ కుంభకోణాల్లో కుమారుడు, లిక్కర్ కేసులో కుమార్తె చిక్కుకుని.. ఇప్పుడు కాళేశ్వరం కుంభకోణంలో తానే స్వయంగా విచారణను ఎదుర్కొనే స్థితి వస్తుందని కానీ.. ఇలా ఎదురీతలు వస్తాయని కానీ.. కేసీఆర్ ఊహించి ఉండరు. మోడీకి ఎదురొడ్డి ఢిల్లీ పీఠంపై గులాబీ జెండాను ఎగరేయాలన్న కల ఆదిలోనే సమసిపోగా.. ఇప్పుడు విశ్రాంత వయసులో చుట్టుముట్టిన వివాదాలు.. కుటుంబ రగడ.. ఆయనకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. మరి వీటి నుంచి బయట పడతారా? లేక.. ఏం జరుగుతుంది? అనేది కాలమే నిర్ణయించాలి.
