సహకరిద్దామా.. సమరం చేద్దామా? : కేసీఆర్ మంతనాలు
ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరకు చేరిన విషయం తెలిసిందే. ఇప్పటి రెండు సార్లు ఆయనకు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు నోటీసులు ఇచ్చారు.
By: Garuda Media | 31 Jan 2026 7:43 PM ISTఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరకు చేరిన విషయం తెలిసిందే. ఇప్పటి రెండు సార్లు ఆయనకు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు నోటీసులు ఇచ్చారు. తొలుత విచారణకు సహకరిస్తానని పేర్కొన్న కేసీఆర్.. అయితే.. ఈ విచారణ తన ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లోనే జరగాలన్నారు. అక్కడకే రావాలని అధికారులను కోరారు. అయితే.. దీనిపై వెంటనే స్పందించిన సిట్.. అలా కుదరదని తేల్చి చెప్పింది.
అంతేకాదు.. ఫిబ్రవరి 1(ఆదివారం) సాయంత్రం 3-4 గంటల మధ్యలో నాంపల్లిలోని తమ కార్యాలయానికే రావాలని కేసీఆర్‌కు విన్నవించింది. ఈ మేరకు రెండో దఫా నోటీసులను ఎవరూ తీసుకోకపోవడంతో ఆయన నివాసానికి అంటించారు. దీంతో ఈ వ్యవహారంపై మాజీ సీఎం కూడా సీరియస్‌గానే తీసుకున్నారు. సహకరించడమా- సమరం చేయడమా.. అనే అంశంపై తన నివాసంలో శనివారం మూడు గంటలకు పైగా ఆయన సమాలోచనలు జరిపారు.
విచారణకు సహకరించకపోవడం అనేది లేదని.. చెబుతూనే తన నివాసంలోనే విచారణ కోరుతున్న ఆయన.. తాజాగా పలువురు న్యాయవాదులు, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌తోనూ భేటీ అయ్యారు. దీనికి సంబంధించి.. వారి నుంచి వివరణలు, సలహాలు తీసుకున్నారు. సిట్ వ్యవహారం.. రాజకీయ వేధింపుల మాదిరిగానే ఉందని కేసీఆర్ ఈ సందర్భంగా వాదించారు. అయితే.. చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి.. సహకరించేందుకు అభ్యంతరం లేదన్నారు.
కానీ, సిట్ వ్యవహారం చూస్తే.. దీనికి భిన్నంగా ఉందని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత అని చెబుతున్నారు. కక్ష పూరితంగానే విచారణల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో విచారణకు సహకరించడం అనే విషయాన్ని పక్కన పెట్టి.. న్యాయ వేదికగా.. సిట్‌పై పోరు సాగిద్దామని, ఇలా.. విచారణకు హాజరైతే.. పార్టీ అధినేతగా కేసీఆర్‌కు ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్.. ఇప్పుడు సిట్ విచారణకు సహకరిస్తారా? లేక న్యాయ పోరాటం చేస్తారన్నది చూడాలి.
