బీఆర్ఎస్ ఇక శాశ్వతం !
అయితే అది పరాయి వారి పార్టీ కానే కాదు, కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత పెట్టిన కొత్త పార్టీకే ఆ పేరు దక్కింది.
By: Satya P | 30 April 2026 11:58 PM ISTవిధి బలీయం అని అంటారు. అది మామూలుగా అంతా జరిగినపుడు ఎవరూ అనరు. కానీ తేడా వస్తేనే గుర్తు చేసుకుంటారు. ఇపుడు బీఆర్ఎస్ నేతలది అదే పరిస్థితి అని అంటున్నారు. పేరులో ఏముంది అని అనుకోవచ్చు. మన పెద్దలు చెప్పినట్లుగా పెన్నిధి ఉంటుంది. పేరు వెనకాల కూడా బలం ఉంటుంది. ఆ బలం కలిసి వస్తే విజయాలు దక్కుతాయి. ఒక్క అక్షరం తేడా వచ్చినా ఫేట్ తిరగబడుతుంది. దానికి ఉదాహరణ కావాల్సి వస్తే బీఆర్ఎస్ నే తీసుకోవాల్సి ఉంటుంది. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ని ఏ ముహూర్తాన కేసీఆర్ గర్జించారో కానీ అది ఏకంగా రెండు దశాబ్దాల పాటు రక్షణ కవచంగా మారి కాపాడింది.
కారు జోరుకు బ్రేకులు :
కానీ 2022 లో కేసీఅర్ అతి ఉత్సాహంతో చేశారో లేక ఇక తెలంగాణాలో తిరుగులేదని భావించారో తెలియదు కానీ జాతీయ రాజకీయాల మీద మోజుతో టీఆర్ఎస్ ని కాస్తా బీఆర్ఎస్ గా మార్చేశారు. దాంతో జాతీయ రాజకీయాల ముచ్చట సంగతి పక్కన పెడితే ఉన్నదే ఊడ్చుకు పోయింది అన్న సామెత చందంగా 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఘోర ఓటమి దక్కింది. అది ఆ ఎన్నికలకే పరిమితం కాలేదు, పార్లమెంట్ లో అయితే జీరో నంబర్ దక్కింది. అది ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు లోకల్ బాడీ ఎన్నికలు ఇలా చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ కి అడుగడుగునా బ్రేకులు పడుతూనే ఉన్నాయి.
యాంటీ సెంటిమెంట్ :
దీంతో తత్వం బోధపడింది అన్నట్లుగా బీఆర్ఎస్ శ్రేణులు అంతర్మధనం చెందాయి. టీఆర్ఎస్ అన్న పేరుతో అజేయంగా నిలిచాం, గెలిచాం, కానీ ఈ కొత్త పేరు అచ్చి రావడం లేదని తలచారు. మెల్లగా ఆ విషయం అధినేతలకూ చెప్పుకొచ్చారు. దాంతో పాటు పార్టీ పెద్దలూ దాదాపుగా ఇదే రకమైన ఆలోచనతో ఉన్నారు. తమ పార్టీ పూర్వ నామధేయమే కదా ఏ రోజు అయినా తెచ్చుకోవచ్చు అని కాస్తా నిబ్బరం ప్రదర్శించారు. ఇటీవలనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే బీఆర్ఎస్ పేరుని టీఆర్ఎస్ గా మారుస్తామని కూడా చెప్పారు. కేసీఆర్ తో దీని మీద చర్చించి ఆ సెంటిమెంట్ ని నిలబెట్టుకుంటామని కూడా అన్నారు. కానీ ఇంతలోనే తెలంగాణాలో టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ వచ్చేసింది.
చెల్లెలకు చేరింది :
అయితే అది పరాయి వారి పార్టీ కానే కాదు, కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత పెట్టిన కొత్త పార్టీకే ఆ పేరు దక్కింది. షార్ట్ ఫార్మ్ లో చూస్తే టీఆర్ఎస్ అయినా అసలు పేరు తెలంగాణా రక్షణ సేన. మరి ఎవరూ ఆ ఫుల్ ఫార్మ్ లో పేరు చదవరు, టీఆర్ఎస్ అనే అంటారు. అందునా అచ్చి వచ్చిన సెంటిమెంట్ కాబట్టి ఆ పేరుతోనే పోతారు. రాజకీయాల్లో ఇలాంటి సెంటిమెంట్లు ఎక్కువ పైగా ఎన్నో విజయాలు అందించిన పేరు అది. అందుకే కవిత నా కోసం రాసి పెట్టి ఉన్న పేరు ఇది అని ఎమోషన్ అయ్యారు. మొత్తానికి టీఆర్ఎస్ అన్నది ఒక పవర్ ఫుల్ నేమ్. వైబ్రేషన్స్ ఎన్నో ఉన్న స్ట్రాంగ్ నేమ్. దాంతో కవిత సంతోషంగానే ఉన్నారు. పేరుతో ఆమె తొలి సక్సెస్ అందుకున్నారు. ఇక ముందు ఏమి జరుగుతుంది అన్నది పక్కన పెడితే ఆమె బీఆర్ఎస్ నేతల ఆశలకు ఒక పెద్ద దెబ్బ కొట్టేశారు అని అంటున్నారు.
కొనసాగాల్సిందే :
దీంతో బీఆర్ఎస్ ఇక ఆ పేరుతోనే కొనసాగాల్సిన అనివార్యత అయితే వచ్చింది. యాంటీ సెంటిమెంట్ ని కాస్తా పాజిటివ్ గా మార్చుకోవాల్సి ఉంది. 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ తోనే పోటీకి దిగాలి మరి. అయితే ఈసారి గెలుపు కనుక దక్కితే ఆ యాంటీ సెంటిమెంట్ కి చెక్ పడుతుంది. ఆ విధంగా చేయడానికి ఇప్పటి నుంచి బీఆర్ఎస్ శ్రేణులు రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఏది ఏమైనా కవితమ్మ ఏమి చేస్తుంది అనుకుంటే పేరులోనే పెన్నిధిని కొట్టేసింది అని కామెంట్స్ పడుతున్నాయి. అందుకే అంటారు విధి బలీయం అని.
