కేటీఆర్ అవకాశాలకి రేవంత్ గట్టి దెబ్బ కొట్టారు ?
తెలంగాణాలో బలమైన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఉంది. ఆ పార్టీ 2014 లో అధికారంలోకి వచ్చి దాదాపుగా పదేళ్ల పాటు కొనసాగింది. 2023లో ముచ్చటగా మూడోసారి గెలవాలని అనుకుంది.
By: Satya P | 8 Sept 2026 5:00 AM ISTతెలంగాణాలో బలమైన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఉంది. ఆ పార్టీ 2014 లో అధికారంలోకి వచ్చి దాదాపుగా పదేళ్ల పాటు కొనసాగింది. 2023లో ముచ్చటగా మూడోసారి గెలవాలని అనుకుంది. కానీ హ్యాట్రిక్ సక్సెస్ దక్కలేదు కానీ ప్రతిపక్ష హోదా ఇచ్చారు జనాలు. దాంతో అసెంబ్లీకి కేసీఆర్ దూరం అయ్యారు. ఇప్పటికి మూడేళ్ళ కాలం అయిపోతోంది. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయి. ఈ సమయంలో కేసీఆర్ అసెంబ్లీకి గైర్ హాజరు అన్నది అతి పెద్ద చర్చగా రాజకీయ రచ్చగా మారుతోంది. కేసీఆర్ విపక్ష నేతగా జీతభత్యాలు తీసుకుంటూ సభకు రాకపోతే ఎలా అని కాంగ్రెస్ నిలదీస్తోంది. ఆయనకు అన్ని విధాలుగా మూడేళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన ఖర్చు అక్షరాలా 122 కోట్ల రూపాయలు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనంలోనే విస్తృత చర్చకు పెట్టి ఉంచారు. ప్రజలు ఇచ్చే పన్నుతో జీతాలు పుచ్చుకుంటూ ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్థావించరా అన్నది కాంగ్రెస్ వాదన. ఇదే జనంలో పెట్టి కేసీఆర్ ని బీఆర్ఎస్ ని కార్నర్ చేయాలని ఎత్తుగడ వేస్తోంది.
రెట్టించిన రేవంత్ :
కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు అని ప్రతీ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెట్టిస్తూ వస్తున్నారు. దాంతో ఇది బీఅర్ఎస్ కి చాలా ఇబ్బందికరంగా తయారైంది. దీంతో కాంగ్రెస్ వ్యూహంలో చిక్కుకుందా లేదా ఎత్తుకు పై ఎత్తు వేసిందా అన్నది తెలియదు కానీ కేసీఆర్ అసెంబ్లీకి ముఖ్యమంత్రి గానే వస్తారు అని కొత్త ప్రకటన చేస్తోంది. ఆ విధంగా ఆయన్ని కాబోయే ముఖ్యమంత్రి అని జనం ముందు పెడుతోంది. ప్రజలు కచ్చితంగా మరో రెండేళ్ల తరువాత కేసీఆర్ పాలనను కోరుకుంటారని ముందే జోస్యం చెబుతోంది. అందుకే కేసీఆర్ సీఎం గానే సభకు వస్తారు కానీ దుశ్శాసన సభకు రానే రారు అని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. సరిగ్గా ఇక్కడే బీఆర్ ఎస్ కాంగ్రెస్ ట్రాప్ లో పడిందా అన్న డౌట్ కూడా వస్తోంది అంటున్నారు.
కేటీఆర్ కదా సీఎం :
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అని ఇప్పటిదాకా గులాబీ పార్టీలో చర్చ సాగుతూ వచ్చింది. ఆ విధంగానే ప్రచారమూ సాగింది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకే సర్వ బాధ్యతలు అప్పగించారు. అది నచ్చని చెల్లెలు కవిత కూడా పార్టీకి దూరం అయ్యారని అంటారు. ఇక 2023 లో మరోసారి బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ నే సీఎం అన్నది కూడా అప్పట్లో వినిపించింది. అలాంటిది ఇపుడు అయిదేళ్ళు ఆలస్యంగా 2028లో కూడా కేటీఆర్ సీఎం అయ్యేది ఉండదా అని ఆయన అనుచరులు పార్టీలో కొత్త తరంలోనూ చర్చ సాగుతోంది. అసలు ఈ తేడా ఎక్కడ వచ్చింది అన్నదే ఇపుడు బీఆర్ఎస్ లో అంతర్మధనంగా సాగుతోంది.
రేవంత్ వర్సెస్ కేసీఆర్ :
రేవంత్ రెడ్డిని ఢీ కొట్టాలీ అంటే కేసీఆర్ లాంటి పవర్ ఫుల్ ఇమేజ్ ఉన్న స్ట్రాంగ్ లీడర్ నే బీఆర్ఎస్ వైపు నుంచి ఉండాలా అన్నది కూడా మరో చర్చ. అలా అయితేనే జనాల మొగ్గు గులాబీ పార్టీ వైపు ఉంటుందని వ్యూహం కూడా ఉందని అంటున్నారు. అంటే గడచిన మూడేళ్ల కాలంలో అసెంబ్లీ లోపల బయటా కేటీఆర్ చేసిన పోరాటాలు రేవంత్ రెడ్డి మీద ఎక్కుబెట్టిన విమర్శలు అన్నీ కూడా తేలిపోతున్నట్లేనా అన్నది కూడా విశ్లేషిస్తున్నారు. అదే కనుక జరిగితే రేవంత్ రెడ్డి ఆ విధంగా కూడా సక్సెస్ అయినట్లే అంటున్నారు. అంతే కాదు ఆయన కేసీఅర్ నే సభకు రావాలని పిలవడం వెనక ఆయననే అపోజిషన్ లీడర్ గా గుర్తిస్తాను అన్నట్లుగానే ఉందని చెబుతున్నారు. ఇక ఇపుడు బీఆర్ఎస్ కూడా కేసీఆర్ కాబోయే సీఎం అని ఆయన అలాగే సభకు వస్తారని ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ ట్రాప్ లో చిక్కుకుందా అన్న చర్చ వస్తోంది. 2028లో కేసీఆర్ సీఎం అంటే కేటీఆర్ కి ఆ మేరకు అవకాశం లేదని కదా అని అంటున్నారు. మరి బీఆర్ఎస్ గెలిచిన తరువాత మళ్ళీ కేటీఆర్ సీఎం ప్రస్తావన వస్తుందేమో. ఏది ఏమైనా బీఆర్ఎస్ జనాలకు కేసీఆర్ ఫేస్ నే చూపించి ముందుకు వస్తుందన్నది అయితే స్పష్టం అవుతున్న విషయం.
