కేసీఅర్ లెక్క పక్కాగా చెప్పిన రేవంత్...ఆలోచించాల్సిందే !
ఒక ప్రతిపక్ష నాయకుడు. ప్రజాస్వామ్యం అనే రధానికి మరో చక్రం అన్న మాట. ప్రభుత్వం ఒక వైపు ఉంటే ప్రతిపక్షం మరో వైపు ఉంటుంది.
By: Satya P | 1 Sept 2026 12:00 AM ISTఒక ప్రతిపక్ష నాయకుడు. ప్రజాస్వామ్యం అనే రధానికి మరో చక్రం అన్న మాట. ప్రభుత్వం ఒక వైపు ఉంటే ప్రతిపక్షం మరో వైపు ఉంటుంది. ఈ రెండూ ఉంటేనే ప్రజాస్వామ్యానికి నిండు తనం వస్తుంది. అయితే అధికారంలో ఉంటేనే సభ. లేకపోతే సభకు నమస్కారం అంటున్న రాజకీయం సాగుతున్న రోజులు ఇవి. తెలంగాణాలో చూస్తే బీఆర్ఎస్ 2023 ఎన్నికల్లో ఓటమి పాలు అయింది. అయితే ప్రజలు ఆ పార్టీని కరుణించి 40 సీట్ల దాకా కట్టబెట్టి ప్రధాన ప్రతిపక్ష హోదాను ఇచ్చారు. అలా కేసీఆర్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అయ్యారు. మరి ఆయన తెలంగాణా అసెంబ్లీ కి ఎన్ని సార్లు వెళ్లారు అంటే ఒకటి రెండు సందర్భాలు అని అంటున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వేయి రోజులు అయింది. కాంగ్రెస్ ఫెయిల్యూర్ అని బీఆర్ఎస్ ఒక వైపు ఆందోళన పర్వానికే తెర తీసింది.
ఆయన్ని ఏమి చేయాలి :
దానికి ధీటుగా కూసాలు కదిలిపోయేలా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ షాక్ ఇచ్చారు. ఆయన ఏకంగా వేయి రోజుల్లో కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఏమి చేశారు అని ప్రశ్నించడమే కాదు ప్రభుత్వం జీతభత్యాలు సదుపాయాలు ఆయన ఈ వేయి రోజులలో ఎంత పొందారు అన్నది పక్కా లెక్కలతో సహా జనం ముందు ఉంచారు. కేసీఆర్ విపక్ష నేతగా ఫెయిల్యూర్ మైర్ ఆయన్ని ఏమి చేయాలి అని రేవంత్ రెడ్డి చేసిన బిగ్ సౌండ్ తో ప్రతిపక్షానికి దిమ్మ దిరిగేలాగానే ఉంది అని అంటున్నారు. ప్రభుత్వం ఈ వేయి రోజులలో కేసీఆర్ కోసం పెట్టిన ఖర్చును ప్రజల ముందు సీఎం రేవంత్ రెడ్డి పెట్టి మరీ కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
వామ్మో ఇంత ఖర్చా :
ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే కేబినెట్ ర్యాంక్ హోదా ఉంటుంది. దాంతో జీతభత్యాలు బులెట్ ప్రూఫ్ వాహనాలు సెక్యూరిటీ ఇలా భారీగానే ప్రభుత్వం నుంచి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ లెక్కలు గురించి సగటు జనాలకు ఎపుడూ తెలియవు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం వాటిని మొత్తంగా గటగటా ఒక సభలో అప్పచెప్పారు. కేసీఆర్ కి ఈ వేయి రోజులకు గానూ జీతం కింద అక్షరాలా ఒక కోటీ 24 లక్షల రూపాయలను ప్రభుత్వం చెల్లించింది అని చెప్పారు. అలాగే ఆయన సెక్యూరిటీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కోసం మొత్తం 21 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం పహారాతో నిఘాతో ఒక రక్షణలో భద్రతలో ఉంచింది అని చెప్పారు. ఈ రెండూ కలిపితే 22 కోట్ల 24 లక్షల పై చిలుకు మొత్తం కేసీఆర్ కి తెలంగాణా ప్రభుత్వం వేయి రోజులలో ఖర్చు చేసినదని రేవంత్ రెడ్డి లెక్క తేల్చారు.
అలా చేస్తే డిస్మిస్ చేస్తారు :
ఒక ప్రభుత్వ ఉద్యోగి మూడు వందల అరవై అయిదు రోజుల పాటు ఉద్యోగానికి వెళ్లకపోతే ఆయన్ని డిస్మిస్ చేస్తారని రేవంత్ రెడ్డి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చెప్పారు. మరి ఏకంగా మూడేళ్ల పాటు సభ ముఖం చూడని కేసీఆర్ ని ఏమి చేయాలో జనాలే చెప్పాలని అన్నారు. ఆయనకు ఈ సమయంలో ప్రజల గురించి ఆలోచించేందుకు మాట్లాడేందుకు ప్రజా సమస్యల పట్ల చర్చించేందుకు తీరిక లేదా అని కూడా నిలదీశారు. తన బంధువుల ఇళ్ళలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్న కేసీఆర్ ప్రజా సమస్యల మీద మాత్రం చర్చకు రావడం లేదని అన్నారు.
విపక్ష నేత ఫెయిల్యూర్ :
ఈ వేయి రోజులు ఎక్కడ ఉన్నావని కేసీఆర్ ని సూటిగానే రేవంత్ రెడ్డి నిలదీశారు. నిజంగా దేశంలో ఎక్కడైనా ఇలా జరిగిందా లేదా అన్నది పక్కన పెడితే ఒక విపక్ష నేత ఫెయిల్యూర్ ఇదీ అని ముఖ్యమంత్రి బయట పెట్టడం మాత్రం ఒక సంచలనమే అని అంటున్నారు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలకే యాంటీ ఇంకెంబెన్సీ అని వాడుతారు. ఈ విధంగా చేసే ప్రతిపక్షాలకు కూడా యాంటీ ఇంకెంబెన్సీ ఉందని ఉండాలని కూడా రేవంత్ రెడ్డి చేస్తున్న డిమాండ్లు పెడుతున్న చర్చను బట్టి అర్థం అవుతోంది అంటున్నారు. మొత్తానికి వేయి రోజులు కాంగ్రెస్ ఫెయిల్యూర్ అంటూ బీఆర్ఎస్ విమర్శలు చేస్తే రేవంత్ రెడ్డి ధీటుగానే బదులిచ్చారు అని అంటున్నారు.
