ప్రత్యక్ష పోరు చేయండి.. వెనుకడుగు వద్దు: కేసీఆర్ దిశానిర్దేశం
ఎన్నికలకు పెద్దగా సమయం లేదని.. మరో ఏడాది గడిస్తే.. ఎన్నికల సీజన్ వచ్చేస్తుందని బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నాయకులకు తేల్చి చెప్పారు.
By: Garuda Media | 13 May 2026 7:00 AM ISTఎన్నికలకు పెద్దగా సమయం లేదని.. మరో ఏడాది గడిస్తే.. ఎన్నికల సీజన్ వచ్చేస్తుందని బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నాయకులకు తేల్చి చెప్పారు. ఇప్పటి నుంచే ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటం చేయాలనిఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీలోని కీలక నాయకులు కేటీఆర్, హరీష్‌రావు, ప్రవీణ్‌కుమార్, జీవన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిసహా పలువురు ముఖ్యులతో ఆయన సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన పరిణామాలతోపాటు.. గత రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనపైనా ఆయన చర్చించారు. ఈ క్రమంలో ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడంలో కొందరు నాయకులు వెనుకబడ్డారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
గ్యాప్ మంచిది కాదని.. కేసీఆర్ తేల్చి చెప్పినట్టు తెలిసింది. పార్టీ పరంగా బలంగా వ్యవహరిస్తూనే.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఈ విషయంలో తెలంగాణ ఉద్యమం స్థాయంలో పోరాటం చేయాలని నాయకులకు చెప్పారు. ``కొందరు ఎందుకో వెనుకాడుతున్నారు. మరో ఏడాది గడిస్తే.. మనం పోరాడినా.. ఎన్నికల మూడ్ వచ్చేస్తుంది. ఇప్పటి నుంచే మనం పోరాటాలను ప్రత్యక్ష పద్ధతిలో చేయాలి. ఎక్స్‌లు(సోషల్ మీడియా) పక్కన పెట్టి.. ప్రజలమధ్య ఉండండి.`` అని తేల్చి చెప్పారు. పార్టీలో కొందరు బాగానే పనిచేస్తున్నా.. చాలా మంది ఎన్నికల వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నారని వ్యాఖ్యానించారు.
వాటిపై ప్రచారం..
గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై కేసీఆర్ సమీక్షించారు. వీటిలో అమలు కాని.. రూ.2500 పథకంపై మరింత ఎక్కువగా స్పందించారు. దీనిపై ప్రజలు ఆశలు పెట్టుకునే కాంగ్రెస్‌కు ఓటేశారని.. కానీ.. రేవంత్ ప్రభుత్వం దీనిని గాలికి వదిలేసిందని తెలిపారు. అలివి కాని హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చారని.. తెలంగాణ సమాజాన్ని మోసం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆయా విషయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలనిసూచించారు. అదేసమయంలో హైడ్రా వ్యవస్థను ప్రజలు తిరస్కరించారని దీనిని కూడా వాడుకోవాలని తెలిపారు.
కార్యకర్తలపై..
పార్టీకి నాయకులతో పాటు.. కార్యకర్తలు కూడా అత్యంత ముఖ్యమని కేసీఆర్ చెప్పారు. వారిని కాపాడుకునేందుకు నాయకు లు ప్రయత్నించాలన్నారు. చాలా జిల్లాల్లో కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని.. వారికి అండగా ఉండాలని సూచించారు. కార్యకర్తలు లేకపోతే.. నాయకులు లేరన్న విషయాన్ని గుర్తించాలని పరోక్షంగా కొందరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక, పార్టీలో సంస్థాగత నాయకత్వ నియామకంపైనా చర్చించారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కూడా కమిటీలోకి తీసుకోవాలన్నా రు. బాగా పనిచేసేవారిని ప్రోత్సహిస్తేనే పార్టీ బలంగా ఉంటుందని తేల్చి చెప్పారు. రికమండేషన్ల రాజకీయం వద్దన్న ఆయన.. పార్టీలో జెండా పట్టేవాడికే ప్రాధాన్యం ఇవ్వాలని కేటీఆర్‌కు స్పష్టం చేశారు.
