కేసీఆర్ కు ఏమైంది.. ఏంటి పరిస్థితి.. అభిమానుల్లో ఆందోళన?
తాజాగా కర్రసాయంతో నడిచారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పై అధికారిక ప్రకటన ఏదీ వెలువడనప్పటికీ, పార్టీ నాయకులు ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
By: A.N.Kumar | 29 Oct 2025 9:44 PM ISTతెలంగాణ రాజకీయాల్లో కీలక నాయకుడిగా, ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆయన కర్రకు ఆధారపడి నడుస్తూ కనిపించడంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిన్న మాజీ మంత్రి హరీశ్‌రావు తండ్రి శంకర్‌రావు భౌతికకాయానికి కేసీఆర్ హాజరయ్యారు. అయితే ఆ సందర్భంలో ఆయన కర్ర పట్టుకుని నడవడం, కొంత బలహీనంగా కనిపించడం గమనించిన వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎప్పుడూ ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో కనిపించే కేసీఆర్ ఈసారి అలసటతో, నిదానంగా నడవడం చూసి అభిమానులు విచారంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
“మన నాయకుడు త్వరగా కోలుకోవాలి”, “కేసీఆర్ మళ్లీ పాత ఉత్సాహంతో ప్రజల్లోకి రావాలి”, “రాష్ట్రానికి ఆయన అవసరం ఉంది” అంటూ ట్వీట్లు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
గత కొద్ది నెలలుగా కేసీఆర్ ఆరోగ్య కారణాల వల్ల ప్రజా కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఎన్నికల తర్వాత ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని, వైద్యుల సలహాప్రకారం పబ్లిక్ కార్యక్రమాలు తగ్గించుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ఆయన తాజా ఫోటోలు, వీడియోలు చూసి అనుచరులు మరింత ఆందోళన చెందుతున్నారు.
గత ఆరోగ్య సమస్యలు
గత కొన్ని నెలలుగా కేసీఆర్ అస్వస్థత కారణంగా ప్రజా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తుంటి ఆపరేషన్ కేసీఆర్ కు జరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇంటి వద్ద పడిపోవడంతో ఆయన తుంటికి గాయమైంది. దీనికిగాను ఆయనకు శస్త్రచికిత్స జరిగింది.
కొద్ది నెలల క్రితం (జూలై 2025లో) నీరసంగా ఉండటంతో ఆసుపత్రిలో చేరారు. అప్పుడు బ్లడ్ షుగర్, సోడియం లెవెల్స్‌లో తేడాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు.
తాజాగా కర్రసాయంతో నడిచారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పై అధికారిక ప్రకటన ఏదీ వెలువడనప్పటికీ, పార్టీ నాయకులు ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
రాష్ట్ర ప్రజలకూ, బీఆర్‌ఎస్ కార్యకర్తలకూ ఆయన ఆరోగ్యం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని భావిస్తున్నారు. రాజకీయ వర్గాలు కూడా కేసీఆర్ త్వరగా కోలుకుని మళ్లీ చురుకుగా కార్యకలాపాలు ప్రారంభిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
