కేసీఅర్ బెంగ అదేనా...ఎంత తేడా ?
ఇక కేసీఆర్ నాటి నుంచి కేరాఫ్ ఎర్రవెల్లిగానే అంతా పేర్కొంటున్నారు. పార్టీ అగ్ర నాయకులు అంతా అక్కడికే వెళ్ళి వస్తున్నారు అయితే ఇటీవల కాలంలో కేసీఆర్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
By: Satya P | 31 Oct 2025 6:00 AM ISTబీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఅర్ తాజాగా కనిపించిన తీరుతో అభిమానులు పార్టీ నేతలలో కొత్త చర్చ మొదలైంది. పెద్దాయనకు ఏమైంది అని అంతా కలవరపడుతున్నారు. కేసీఆర్ అంటే ఎపుడూ బక్క పలచగా ఉన్నా ఆయన ముఖంలో కొత్త కాంతులు కనిపిస్తాయి. ఆయనలో ఒక రకమైన రాచ ఠీవి, గంభీరత, ధీమా అన్నీ కలబోసినట్లుగా ఉంటాయి. అటువంటి గులాబీ బాస్ తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి మృతి చెందారని వార్త తెలిసి ఆయన నివాసానికి చేరుకుని పరామర్శించారు. ఈ సందర్భంగా కేసీఅర్ కర్ర ఆసరాతో నడవడం మాసిన గడ్డం ముఖంలో మార్పు అంతా చూసిన వారు కేసీఆర్ సింహం లాంటి వారని ఆయన ఎందుకు ఇలా డీలాగా కనిపించారు అని చర్చించుకుంటున్నారు.
రెండేళ్ళలో అలా :
కేసీఆర్ సీఎం గా ఉన్నా కూడా పెద్దగా బయట కనిపించేవారు కాదు, కానీ ముఖ్యమైన సందర్భాలలో సభలలో పాల్గొనేవారు. అలాగే తాను చెప్పాలనుకుంటున్న విషయాల మీద మీడియా సమావేశం పెట్టి మరీ గంటల తరబడి అనర్గళంగా మాట్లాడేవారు. ఆయన మాటలలో ధాటీ ఆయనలో కనిపించే డేరింగ్ నేచర్ అన్నీ కలసి కేసీఆర్ ఈజ్ గ్రేట్ అని క్యాడర్ అనుకునేవారు. అయితే 2023 చివరిలో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాత ఆయన పెద్దగా బయట కనిపించడం లేదు అసెంబ్లీకి కూడా రావడం లేదు. 2024 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రచారానికి వచ్చారు. అప్పట్లో బాగానే హుషారుగా ఉన్నారు. ఇక ఈ ఏడాది ఏప్రిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో కూడా ఆయన కనిపించి జనాలని మెప్పించేలా మాట్లాడారు.
కేరాఫ్ ఎర్రవెల్లిగానే :
ఇక కేసీఆర్ నాటి నుంచి కేరాఫ్ ఎర్రవెల్లిగానే అంతా పేర్కొంటున్నారు. పార్టీ అగ్ర నాయకులు అంతా అక్కడికే వెళ్ళి వస్తున్నారు అయితే ఇటీవల కాలంలో కేసీఆర్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దాంతో ఆయన ఇపుడు ఈ తీరున కనిపించడంతో తెలంగాణా ప్రజానీకం కూడా చర్చించుకుంటున్నారు. కేసీఆర్ అంటేనే పేరులో చంద్రుడు ఉన్నా సూర్యుడిగా వెలిగే రూపమని ఆయనలో ఎందుకో కళ తగ్గిందని అంతా అనుకుంటున్న మాటగా ఉంది.
ఆమె మీదనే బెంగ :
ఇక కేసీఆర్ విషయానికి వస్తే పార్టీ ఓటమి తరువాత కొంత కృంగిపోయారు అన్నది వాస్తవం అంటున్నారు. ఎందుకంటే అది ఊహించని ఓటమిగా చెబుతారు. అదే సమయంలో తిరిగి పుంజుకోవచ్చు అనుకున్న సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కలేదు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకే దిగలేదు. పార్టీ పరిస్థితి అలా ఉంటే సొంత కుటుంబంలోనే ఇబ్బందులు తలెత్తడం కూడా ఆయనలో కలవరం కలిగించాయని అంటున్నారు. ఏకైక కుమార్తె కవిత అంటే కేసీఆర్ కి ఎంతో ఇష్టమని చెబుతారు. ఆమె ఎపుడూ పార్టీని వీడుతుందని అనుకోలేదు అంతే కాదు పార్టీ అధినేతగా ఆమె మీద సస్పెన్షన్ వేటు వేస్తామని ఆయన ఊహించలేకపోయారు అని అంటున్నారు.
కాల మహిమ అనాలా :
ఆ విధంగా కవిత దూరం కావడంతో పెద్దాయన తట్టుకోలేకపోతున్నారు అని అంటున్నారు. ఆనాటి టీఆర్ఎస్ అయినా ఈనాటి బీఆర్ఎస్ అయినా కేసీఆర్ కష్ట ఫలితం. అలాంటిది తాను ఉండగానే తన వాళ్ళే ఇలా వేరు పడడం పార్టీలో పోరు పెరగడంతో పెద్దాయన కలత చెందుతున్నారని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కనుక కేసీఆర్ ఎలా ఉండేవారు ఎలా అయిపోయారు అంటే కాల మహిమ అనాలా లేక రాజకీయం అనాలా తెలియడం లేదు అన్నదే పార్టీ లో వేదనగా ఉంది.
