Begin typing your search above and press return to search.

కేసీఆర్ భూముల లెక్కలు విప్పి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పొంగులేటి?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి.. గులాబీ బాస్ కేసీఆర్ భూములపై సాగుతున్న చర్చను కొత్త దిశలోకి తీసుకెళ్లేలా చేశారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

By:  Garuda Media   |   18 Sept 2026 10:04 AM IST
కేసీఆర్ భూముల లెక్కలు విప్పి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పొంగులేటి?
X

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి.. గులాబీ బాస్ కేసీఆర్ భూములపై సాగుతున్న చర్చను కొత్త దిశలోకి తీసుకెళ్లేలా చేశారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ కుటుంబానికి భారీ ఎత్తున భూములు ఉన్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. వెల్లడించిన వివరాలు సంచలనంగా మారిన వేళ.. దానికి కౌంటర్ గా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. అయితే.. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ అన్నట్లుగా పొంగులేటి తాజా వ్యాఖ్యలు ఉన్నాయి. 1954లోనే తమకు వందల ఎకరాల భూములు ఉన్నట్లుగా కేటీఆర్ చెప్పటం.. చింతమడకలో రెండు ఎకరాల్లో ఇల్లు ఉండేదన్న ఆయన.. ఎగువ మానేరులో కోల్పోయిన భూములకు వచ్చిన పరిహారంతోనే తమ తాత భూమి కొన్నారని చెప్పటం వరకు బాగానే ఉన్నా.. అలా అయితే 2004 వరకు ఒక్క ఎకరం భూమి కేసీఆర్ అండ్ కోకు లేదంటూ పొంగులేటి చెప్పిన మాట ఇప్పుడు సంచలనంగా మారింది.

తానేదో నోటికి వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయటం లేదని.. 2004లో జరిగిన కరీంనగర్ లోక్ సభ ఎన్నికల అఫిడవిట్ లో కేసీఆర్ తనకున్న భూముల వివరాల విషయానికి.. సున్నా భూములు అని పేర్కొన్నారు కదా? మరి.. దానికి ఏమంటారు? అన్నట్లుగా వేసిన ప్రశ్న ఇప్పుడు గులాబీ తోటను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి. అంతేకాదు.. సున్నా ఎకరాల నుంచి వందల ఎకరాల భూములు ఎలా సాధ్యమైంది? అన్న సూటిప్రశ్న ఇప్పుడు కొత్త ప్రశ్నలకు కారణమవుతోంది.

తెలంగాణ ఉద్యమ సమయంలోనూ.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పదేళ్ల పాలనలో కేసీఆర్ భూములు భారీగా పెరిగాయని.. 2004 నాటి ఆయన ఎన్నికల అఫిడవిట్ ఆ విషయాన్ని స్పష్టం చేస్తుందన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన పొంగులేటి.. ‘‘పుట్టకతోనే కేసీఆర్ కు వందల ఎకరాలు ఉన్నాయని బొంకుతున్న కేటీఆర్.. 2004 ఎన్నికల అఫిడవిట్ లో వాటిని ఎందుకు చూపలేదు? అంటే.. ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇచ్చారా? ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారా?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

అంతేకాదు.. కేసీఆర్ కుటుంబానికి ఉన్న ఆస్తుల లెక్కలతో పాటు.. 2009 ఎన్నికల వేళ కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్ లోని అంశాల్ని ప్రశ్నిస్తూ.. ఆయన్ను ఇరుకున పడేలా చేశారు పొంగులేటి. ‘‘కేసీఆర్ కుటుంబానికి 9 జిల్లాల్లో 24 మండలాల్లో.. 31 గ్రామాల్లో 440 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి మొత్తం ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే విషయాన్ని సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రశ్నించారు. కేటీఆర్.. ఆయన భార్య.. పిల్లల పేరుతో ఎర్రవల్లి.. జన్వాడ.. మర్కూక్.. వెంకటాపూర్ పరిధిలో 123.19 ఎకరాలు ఉంది. 2009 ఎన్నికల వేళ కేటీఆర్ ఇచ్చిన అఫిడవిట్ లో రంగారెడ్డి జిల్లా శామీర్ పేట మండలం దేవరయాంజల్ సర్వే నంబరు 437లో ఎకరం వ్యవసాయ భూమి మాత్రమే ఉంది’’ అంటూ కేటీఆర్ లెక్కల్ని విప్పారు పొంగులేటి.

2009 ఎన్నికల అఫిడవిట్ లో కేటీఆర్ పేర్కొన్న భూమి విలువ రూ.50 లక్షలుగా చూపారన్న పొంగులేటి.. ఇప్పుడు వారికి ఉన్న ఆస్తులు ఎలా వచ్చాయి? అంటూ సూటిగా సంధించారు. ‘‘వివిధ ప్రాంతాల్లో 123 ఎకరాలు ఎలా వచ్చింది? తాతాల కాలం నుంచి భూస్వాములం.. దొరలమని చెబుతున్న కేటీఆర్ 2009 అఫిడవిట్ లో ఆ భూముల వివరాలు ఎందుకు చూపించలేదు?’ అంటూ ప్రశ్నించారు. గణాంకాలను చూపిస్తూ కేసీఆర్ పరివారం ఆస్తులపై పొంగులేటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అదే సమయంలో గులాబీ పరివారాన్ని ఈ లెక్కలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లుగా తెలుస్తోంది.