కవిత జలక్.. ‘టీఆర్ఎస్’గా మారనున్న బీఆర్ఎస్.. మంచిర్యాల పర్యటనలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..
మంచిర్యాల పర్యటనలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.
By: Tupaki Political Desk | 13 April 2026 10:31 AM ISTఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన పార్టీ 'టీఆర్‌ఎస్' (TRS). కానీ అది బీఆర్ఎస్ గా మారిపోయింది.. అయితే ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలతో ఈ పేరులో ఉన్న సెంటిమెంట్ మళ్లీ బీఆర్‌ఎస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. జాతీయ రాజకీయాల కోసం ‘బీఆర్ఎస్’గా మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రజలు, కార్యకర్తలు ఇప్పటికీ ‘తెలంగాణ’ అనే పదంపైనే మక్కువ చూపిస్తున్నారనేది కేటీఆర్ మాటల్లో స్పష్టం అవుతోంది. మంచిర్యాల పర్యటనలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.
మళ్లీ టీఆర్ఎస్ కే పోతాం..
రాజకీయాల్లో వ్యూహాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాలంతో పాటు మారుతుంటాయి. నాడు దేశం మొత్తం ‘తెలంగాణ మోడల్’ చూపించాలనే లక్ష్యంతో కేసీఆర్ టీఆర్ఎస్ పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్-BRS) గా మార్చారు. అయితే, ప్రస్తుత పరిస్థితులు, ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి, మళ్లీ పాత పేరుకే మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. మంచిర్యాల వేదికగా కేటీఆర్ చేసిన ప్రకటనలు పార్టీ భవిష్యత్తు కార్యాచరణను సూచిస్తున్నాయి.
‘టీఆర్‌ఎస్’ సెంటిమెంట్‌కు ప్రాణం?
పార్టీ పేరును తిరిగి టీఆర్‌ఎస్‌గా మార్చాలనే డిమాండ్ ప్రజల నుంచి బలంగా వస్తోందని కేటీఆర్ అంగీకరించారు. ‘తెలంగాణ’ అనే పదం పార్టీకి ఒక రక్షణ కవచం లాంటిదని, ఆ పేరుతోనే తమకు గుర్తింపు ఉందని కార్యకర్తలు భావిస్తున్నారు. అయితే, ఈ తుది నిర్ణయం పార్టీ అధినేత కేసీఆర్ చేతుల్లోనే ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఏది చెబితే అదే ఫైనల్! అని చెప్పడం విశేషం.
2027 నుంచి కేటీఆర్ పాదయాత్ర!
పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కేటీఆర్ ఒక భారీ ప్లాన్ సిద్ధం చేసింది. 2027 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ప్రజలతో నేరుగా మమేకమై, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగనుంది. ఇది రాబోయే ఎన్నికల నాటికి పార్టీలో కొత్త జోష్ నింపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నో పొత్తు.. సోలో ఫైట్!
భవిష్యత్తులో ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ప్రసక్తే లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. గతంలో జరిగిన పొత్తులు పార్టీకి పెద్దగా కలిసి రాలేదని, అందుకే ఇకపై ఒంటరిగానే పోరాడతామని స్పష్టం చేశారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వడమే లక్ష్యంగా తమ వ్యూహాలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు.
డీలిమిటేషన్ ప్రభావంతో పెరగనున్న సీట్లు
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179 కి, పార్లమెంట్ స్థానాలు 17 నుంచి 28 కి పెరుగుతాయని కేటీఆర్ అంచాన వేస్తున్నారు. ఈ మార్పు వల్ల రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారుతాయని, దానికి అనుగుణంగా పార్టీని సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
నలుగురు సీఎంల ప్రస్తావన
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వత ముద్ర వేసిన నలుగురు ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్సార్, చంద్రబాబు తర్వాత కేసీఆర్ మాత్రమే అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో డబ్బు ప్రాధాన్యత పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, మేధావులు మౌనం వీడాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శిస్తూ, ప్రజల పక్షాన నిలబడతామని బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. పేరు మార్పు జరిగితే అది కేవలం పేరు మాత్రమే కాదు.., అది మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నం కావచ్చు. 2027 పాదయాత్ర, పేరు మార్పు చర్చలు చూస్తుంటే గులాబీ పార్టీ మళ్లీ పునర్ వైభవం కోసం గట్టిగానే ప్రయత్నిస్తోందనిపిస్తోంది.
