Begin typing your search above and press return to search.

ఇక తేల్చాల్సింది కేసీఆరే !

ఇక తెలుగు కార్డు విషయానికి వస్తే టీడీపీ అధినాయకత్వం తేల్చేసింది. తమకు ఎన్డీయేతో మిత్ర బంధం ఉందని అందువల్ల ప్రాంతీయ సమీకరణలు కంటే అదే ముఖ్యమని పేర్కొంది.

By:  Satya P   |   24 Aug 2025 4:00 AM IST
ఇక తేల్చాల్సింది కేసీఆరే !
X

ఇపుడు అందరి చూపూ గులాబీ బాస్ మీద ఉంది. ఆయన రాజకీయ వ్యూహకర్త. అంతకు మించి అపర చాణక్యుడు. ఏ సమయానికి ఏమి చేయాలో బాగా తెలిసిన వారు. అందువల్ల ఇపుడు ఆయన ఏమి చేస్తారు అన్నదే అందరిలోనూ ఉన్న ఆసక్తి. కేసీఆర్ వైపే అందరూ దృష్టి సారిస్తున్నారు. ఇంతకీ ఎందుకు కేసీఆర్ మీద ఫోకస్ చేయాలీ అంటే ఉప రాష్ట్రపతి ఎన్నిక గురించి అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 9న దేశంలో ఉప రాష్టపతి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి తెలుగు వాడిని అందునా తెలంగాణా వారిని తమ అభ్యర్థిగా నిలబెట్టింది.

తెలుగు కార్డు అలా :

ఇక తెలుగు కార్డు విషయానికి వస్తే టీడీపీ అధినాయకత్వం తేల్చేసింది. తమకు ఎన్డీయేతో మిత్ర బంధం ఉందని అందువల్ల ప్రాంతీయ సమీకరణలు కంటే అదే ముఖ్యమని పేర్కొంది. చంద్రబాబు చెప్పినది కూడా చాలా లాజిక్ గా ఉంది. తాము ఎన్డీయేలో భాగస్వాములుగా ఉండి వేరే పార్టీ అభ్యర్ధికి ఎలా ఓటు చేస్తామని ఆయన ప్రశ్నించారు. దాంతో పాటుగా తెలుగు కార్డు సెంటిమెంట్ మీద వివరణ ఇచ్చారు ఎన్డీయే కనుక జస్టిస్ సుదర్శన్ రెడ్డిని నిలబెట్టి ఉంటే తాము తప్పనిసరిగా మద్దతు ఇచ్చేవారిమని అన్నారు. సో టీడీపీ ఫుల్ క్లారిటీతో ఉంది.

జగన్ ఎపుడో తేల్చేసారు :

వైసీపీ అధినాయకత్వం ఇలాంటి విషయాల్లో అసలు సస్పెన్స్ లో పెట్టేది ఉండదు. ఇలా ఫోన్ కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ నుంచి వచ్చిందో లేదో అలా వైసీపీ అధినాయకత్వం తమ ఓటు ఎన్డీఎయే అభ్యర్ధికే అని తేల్చేసింది. రెండవ కూటమి వైపు నుంచి ఫోన్ కాల్ కానీ అభ్యర్ధన కానీ వచ్చేంతవరకూ కూడా వేచి చూడలేదు. అలా ఎన్డీయేకే తమ ఓటు అని స్పష్టంగానే జగన్ చెప్పేశారు. దాంతో తెలుగు కార్డు అన్నది మాత్రమే కాదు ఇండియా కూటమి వ్యూహాలు కూడా పెద్దగా పనిచేయలేదని చంద్రబాబు జగన్ క్లారిటీతో అర్ధం అయిపోయింది.

తెలంగాణావాదమేనా :

దాంతో ఇక మిగిలింది తెలంగాణా వాదం. తెలంగాణా వాదంతోనే పాతికేళ్ళకు పైగా ఉద్యమాన్ని కానీ రాజకీయాన్ని కానీ చేసుకుని వస్తున్న గులాబీ బాస్ కి ఇపుడు తెలంగాణా నుంచే ఉప రాష్ట్రపతి అభ్యర్ధి కళ్ళ ముందు ఉన్నారు. నిజానికి బీఆర్ ఎస్ కి పెద్దగా మల్లగుల్లాలు పడాల్సిన అవసరం కూడా లేదని అంటున్నారు. బీఆర్ఎస్ ఏ కూటమిలోనూ చేరలేదు. న్యూట్రల్ వైఖరిని కొనసాగిస్తోంది దాంతో ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తన సొంత నిర్ణయం తీసుకునే స్వేచ్చ ఉంది. పైగా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఏ రాజకీయ రంగు రుచి వాసన అన్నవి అసలు లేవు అని అంటున్నారు. దాంతో ఆయనకు మద్దతు ఇవ్వడం వల్ల కూడా నేరుగా కాంగ్రెస్ కి సపోర్ట్ చేసినట్లు కానే కాదు, అదే సమయంలో తెలంగాణా వాదానికి కట్టుబడినట్లుగా కూడా ఉంటుంది.

ఆ ఓట్లూ కీలకం :

మొత్తం మీద చూస్తే కనుక కేసీఆర్ తీసుకునే నిర్ణయం మీదనే తెలుగు నాట ప్రాంతీయ పార్టీల నుంచి ఎన్ని ఓట్లు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి వెళ్తాయన్నది ఆధారపడి ఉంటుందని అంటున్నారు. బీఆర్ఎస్ కి చూస్తే లోక్ సభలో మెంబర్స్ లేరు. రాజ్యసభలో మాత్రం నలుగురు ఎంపీలు ఉన్నారు. దాంతో ఆ ఓట్లు కచ్చితంగా కీలకమే అవుతాయని అంటున్నారు. అదే సమయంలో వైసీపీకి లోక్ సభ ప్లస్ రాజ్యసభ కలిపి 11 ఓట్లు ఉంటే అన్నీ ఎన్డీయేకే వెళ్తాయని అంటున్నారు. టీడీపీకి 18 ఓట్లు రెండు సభలలో కలిపి ఉన్నాయి. జనసేనకు లోక్ సభలో ఇద్దరు ఎంపీలు ఉన్నారు. అలా ఏపీ నుంచి 31 ఓట్లు ఎన్డీఎ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ కి వెళ్లనున్నాయి. దీంతో ప్రాంతీయ పార్టీలలో బీఆర్ఎస్ కనుక కీలక నిర్ణయం తీసుకుంటే ఇండియా కూటమికి తెలుగు నాట ఒక ప్రాంతీయ పార్టీ మద్దతు దక్కుతుంది అని అంటున్నారు.