పండుగ పూట కేసీఅర్ కవితల మధ్యన ?
తాజాగా జరిగిన దసరా వేడుకల వేళ ఎర్రవెల్లి ఫాం హౌస్ లో జరిగిన వేడుకలకు కుటుంబం మొత్తం హాజరైంది.
By: Satya P | 4 Oct 2025 6:00 AM ISTరాజకీయాలు భావోద్వేగాల మధ్య ఎపుడూ సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఈ రెండింటినీ ఎంత బాలెన్స్ చేయాలనుకున్నా ఎంతటి వారికి అయినా కుదిరే వ్యవహారం కాదు అనిపిస్తుంది. దీనిని ఎంతటి మహామహులు అయినా అతీతులు అయితే కారు. తెలంగాణాను తెచ్చిన నేతగా అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ సైతం ఇపుడు రాజకీయాలకు రక్త సంబంధాల మధ్య నలిగిపోతున్నారు అని అంటున్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం అయిన కేసీఅర్ కి పేగు బంధంతో పేచీలు తప్పడం లేదు. తన ఏకైక కుమార్తె కవిత ఆయనకు ఎదురు నిలిచిన సందర్భం అయితే పెద్దాయన కలలో సైతం ఊహించి ఉండరు అని అంటున్నారు. అయితే అది అలా జరిగిపోయింది. ఎందుకు అంటే ఇది రాజకీయం కాబట్టి.
గులాబీ పార్టీకి దూరం :
దాదాపుగా నెల రోజుల క్రితం కవితను బీఆర్ ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఆ మీదట ఆమె ప్రెస్ మీట్ పెట్టి మరీ కేసీఅర్ ని కేటీఆర్ ని ఏమి అనలేదు కానీ కేసీఆర్ వెనక ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు ని మాజీ ఎంపీ సంతోష్ రావుని గట్టిగానే టార్గెట్ చేశారు. కేసీఆర్ ని వీరే తప్పుదోవ పట్టిస్తున్నారని పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు అని కూడా ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. అదే సమయంలో తన తండ్రి కేసీఆర్ ని పల్లెత్తు మాట అనలేదు. కేటీఆర్ ని రామన్న అని ఎంతో ప్రేమగానే సంభోదించారు. అయితే అంతకు ముందు కవిత చాలా కాలంగా పార్టీ మీద చేసిన విమర్శలు ఆమె కేసీఆర్ కి రాసిన లేఖ బహిర్గతం కావడం ఇవన్నీ కూడా కేసీఆర్ తో దూరం పెంచేశాయని అంటున్నారు.
ఆగ్రహంగానే కేసీఅర్ :
ఇక బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కానపుడు కూడా ఎర్రవెల్లి ఫాం హౌస్ కి కవిత తన కుమారుడితో వెళ్ళినా పెద్దాయన మనవడినే పిలిపించుకుని మాట్లాడారు అని ప్రచారం సాగింది ఇక ఆ తరువాత అమెరికా నుంచి వచ్చిన కవిత వస్తూనే బీఆర్ ఎస్ మీద విమర్శలు చేయడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినట్లుగానే చేసిన ఆరోపణలు అన్నీ కూడా బీఆర్ఎస్ లో తీవ్ర అలజడి రేపాయి. ఆ తదనంతర పరిణామాల భాగమే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అని అంటున్నారు
దసరా నాడు సైతం :
ఇదిలా ఉంటే రాజకీయాలు వేరు కుటుంబాలు పేగు బంధాలు వేరు అని అంటారు కానీ కేసీఆర్ మాత్రం తన కుమార్తె మీద ఇంకా కోపంగానే ఉన్నారు అని అంటున్నారు. దానికి ఉదాహరణలు చెబుతున్నారు. తాజాగా జరిగిన దసరా వేడుకల వేళ ఎర్రవెల్లి ఫాం హౌస్ లో జరిగిన వేడుకలకు కుటుంబం మొత్తం హాజరైంది. కానీ కవిత అక్కడ కనిపించలేదు అని గుర్తు చేస్తున్నారు. పూజలలో చూస్తే కనుక కేసీఆర్ దంపతులు కేటీఆర్ దంపతులు ఇతర కుటుంబ సభ్యులు మాత్రమే కనిపించారు అని అంటున్నారు. కుమార్తె కవితను మాత్రం ఆహ్వానించలేదని అంటున్నారు.
ఆమె విషయంలో ఎందుకలా :
నిజానికి చూస్తే కవిత తానుగా బీఆర్ఎస్ పార్టీని వీడిపోలేదు. ఆమెని పార్టీ పెద్దలే బయటకు పంపించారు. అయితే రాజకీయాలను అలా పక్కన పెట్టి కుటుంబం అంతా హాజరయ్యే వేడుకలకు పండుగలకు కూడా ఆహ్వానించకపోవడం మీద చర్చ సాగుతోంది. అంతకు ముందు కేసీఆర్ ఇదే ఫాం హౌస్ లో హోమం నిర్వహించారు అని వార్తలు వచ్చాయి. దానికి కూడా కవితను ఆహ్వానించలేదని చెబుతున్నారు. దీంతో పూర్తిగా దూరం పెట్టేసారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే కవిత తన అభిమానులు అనుచరులతో పాలపిట్టను గాలిలో ఎగరేసి తెలంగాణాలో దసరా పండుగ సంప్రదాయాలను పాటిస్తూ వేడుకలు జరుపుకున్నారు అని అంటున్నారు. మొత్తానికి కేసీఆర్ పండుగ వేళ కూడా కవిత విషయంలో ఆగ్రహంగా ఉన్నారా అన్నదే చర్చగా సాగుతోంది అంటున్నారు.
