దేశంలో ఫస్ట్: కేసీఆర్-కవిత.. తండ్రి-కూతురు రాజకీయం!
ఒకవైపు కేసీఆర్, పోయిన తన అస్తిత్వాన్ని దక్కించుకునేందుకు, ఓటు బ్యాంకు ను తిరిగి సంపాదించుకునేందుకు కాంగ్రెస్‌పై వ్యతిరేకతను పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
By: Garuda Media | 25 April 2026 4:12 PM ISTబి ఆర్ ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పెద్ద సవాల్ ఎదురైంది. ఇప్పటివరకు ఆయన అనేకమంది నాయకులతో.. అనేక పార్టీలతో రాజకీయంగా యుద్ధం చేశారు. కేంద్రంలోని బిజెపితో కావచ్చు, గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో కావచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో కావచ్చు. లేదా ఉద్యమ సమయంలో టిడిపి తో కావచ్చు.. ఇలా పలు పార్టీలతో ఆయన విభేదించారు. రాజకీయంగా పోరాటం చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు తన జీవితంలో తన సొంత బిడ్డతోనే రాజకీయం చేయాల్సి రావడం, సమాధానం చెప్పాల్సి రావడం, వివరణ ఇవ్వాల్సి రావడం అనేది ఊహించని పరిణామం అని చెప్పాలి.
ఎందుకంటే కవిత పార్టీ పెట్టినప్పటికీ కేసీఆర్ జోలికి పోదని కేసీఆర్ను పెద్దగా విమర్శించరని అందరూ అనుకున్నారు. రాజకీయ పండితులు సైతం అంచనా వేశారు. కేసీఆర్ జోలికి వెళితే ఆమెకే నష్టమని కూడా కొన్ని విశ్లేషణలు వచ్చాయి. కానీ, అనూహ్యంగా కెసిఆర్ ను టార్గెట్ చేయడం.. కేసీఆర్‌ను `మన మనిషి కాదు, మరమనిషి` అని చెప్పడం ద్వారా కేసీఆర్ వ్యతిరేకతను భారీ స్థాయిలో పెంచే ప్రయత్నం చేయటం కవిత రాజకీయాల్లో ఇప్పుడు కీలక అంశంగా మారింది.
ఒకవైపు కేసీఆర్, పోయిన తన అస్తిత్వాన్ని దక్కించుకునేందుకు, ఓటు బ్యాంకు ను తిరిగి సంపాదించుకునేందుకు కాంగ్రెస్‌పై వ్యతిరేకతను పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన త్వరలోనే ప్రజా బాహుళ్యంలోకి వచ్చేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటువంటి సమయంలో అనూహ్యంగా కవిత రూపంలో కేసీఆర్‌ను లక్ష్యంగా పెట్టుకొని.. ఆయన పది సంవత్సరాల పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతోపాటు నీళ్లు.. నిధులు.. నియామకాలతో పాటు సామాజిక న్యాయం అనే అంశాలను ప్రధానంగా చర్చకు పెట్టడం ద్వారా కేసీఆర్ ను రాజకీయంగా ఇరుకునపెట్టిన పరిస్థితి స్పష్టంగా కనిపించింది.
ఇప్పుడు ఈ విషయాలపై బీఆర్ఎస్ తరఫున ఎవరు మాట్లాడినప్పటికీ అంతగా ప్రయోజనం కనిపించదు. కేసీఆరే స్వయంగా రావాలి. కవిత చేసిన వ్యాఖ్యలకు ఆయనే సమాధానమైనా చెప్పాలి లేదా ప్రతి విమర్శలు అయినా చేయాలి. అంటే తన బిడ్డ రాజకీయాలకు తానే ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఒకరకంగా చెప్పాలంటే కెసిఆర్ కు కొత్త చిక్కును తీసుకువచ్చిందనే చెప్పాలి. మరి దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు.. ఎలా ముందుకు సాగుతారు.. రాజకీయంగా కేసీఆర్ -కవితల మధ్య మున్ముందు ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేవి చూడాలి.
ముఖ్యంగా ఎన్నికల సమయానికి ఈ పరిణామాలు ఏ విధంగా మారుతాయి అనేవి చాలా ఆసక్తిగా కూడా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో రాజకీయం చేయడం వేరు. బిజెపితో రాజకీయం చేయడం వేరు. కానీ సొంత బిడ్డతో రాజకీయం చేయడం బహుశా ఈ దేశంలో ఇదే మొదటిసారి అయి ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అన్నా చెల్లెల మధ్య ఏపీలో గొడవ జరుగుతోంది. తెలంగాణలోను అన్న చెల్లెల మధ్య గొడవ జరుగుతోంది. అది వేరు. కానీ, కన్నతండ్రి మీద కుమార్తె... కుమార్తెకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో కన్నతండ్రి ఈరోజు రాజకీయ పరిస్థితిని ఎదుర్కొంటారు.
