Begin typing your search above and press return to search.

కేసీఆర్ కి ఈ సవాల్ కొత్తది !

కేసీఆర్ రాజకీయంగా ఢక్కా ముక్కలు తిన్న నాయకుడు. ఆయనది నాలుగు దశాబ్దాలకు పైబడిన జీవితం. తెలుగుదేశంలో ఎన్నో చూసారు.

By:  Satya P   |   2 Sept 2025 10:00 PM IST
కేసీఆర్ కి ఈ సవాల్ కొత్తది !
X

కేసీఆర్ రాజకీయంగా ఢక్కా ముక్కలు తిన్న నాయకుడు. ఆయనది నాలుగు దశాబ్దాలకు పైబడిన జీవితం. తెలుగుదేశంలో ఎన్నో చూసారు. ఇక తెలంగాణా ఉద్యమంలో కూడా ఆయన ఎన్నో రకాలుగా ఒత్తిళ్ళు ఎదుర్కొన్నారు. తెలంగాణా ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి నడచిన వారు ఆ తరువాత వేరు పడ్డారు. అలా వారి నుంచి వచ్చిన సవాళ్ళను కేసీఆర్ ధీటుగానే ఎదుర్కొన్నారు. బీజేపీ అగ్రనేత ఆలె నరేంద్ర టీఆర్ఎస్ లో మొదట ఉండేవారు. ఆ తరువాత విభేదాలతో పార్టీని వీడారు. వేరే పార్టీని స్థాపించారు. అలాగే విజయశాంతి కూడా పార్టీ నుంచి బయటకు వెళ్లారు. ఈ మధ్య కాలంలో చూస్తే ఈటెల రాజేందర్ కూడా కేసీఆర్ ని సవాల్ చేస్తూ బయటకు వచ్చారు.

సొంత బిడ్డతోనే :

వీరే కాదు చాలా మంది కీలక నేతలు బీఆర్ఎస్ బహిష్కరణ అస్త్రానికి గురి అయ్యారు. వారిలో కొందరు తమ రాజకీయాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు కానీ బీఆర్ఎస్ కి కేసీఆర్ కి సవాల్ చేసే స్థితి అయితే లేకుండా పోయింది అన్నది ఒక విశ్లేషణ. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇపుడు సొంత బిడ్డతోనే కేసీఆర్ కి రాజకీయ వైరం వచ్చింది. కవిత అంటే అవ్యాజమైన ప్రేమ కలిగిన కేసీఅర్ కి రాజకీయంగా మాత్రం ఆమె ప్రత్యర్ధిగా నిలవడం నిజంగా ఊహించలేనిదే అని అంటున్నారు.

రాజకీయ చాణక్యుడితోనే :

ఇదిలా ఉంటే కవిత వైపు నుంచి చూస్తే ఇప్పటిదాకా కేసీఆర్ ని సవాల్ చేసిన వారు అంతా బయట వారు. ఇపుడు ఆమె ఆయన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డగా ఉంటూ ఎదిరిస్తున్నారు. కేసీఆర్ తో ఎంతో సాన్నిహిత్యం ఉన్నా వారందరికీ కేసీఆర్ గురించి తెలిసిన దాని కంటే చాలా ఎక్కువే కవితకు తెలుసు అని చెప్పాల్సి ఉంటుంది. కేసీఆర్ బలాలు బలహీనతలు ఇతర ప్రత్యర్ధులు అంచనా వేయడం వేరు, కవిత అంచనా వేయడం వేరు అని అంటున్నారు. అదే సమయంలో తండ్రికీ ఎదురుగా నిలిచి రాజకీయం చేయడం కూడా కవితకు కష్టమే అవుతుంది అన్నది కూడా ఉంది.

పట్టుదల సరిపోతుందా :

కవిత తాను కేసీఆర్ బిడ్డగా జనంలో క్లెయిం చేసుకోగలరు, అదే సమయంలో ఆయన పట్టుదల పుణికి పుచ్చుకుని ఉండవచ్చు. కానీ అది ఒక్కటీ సరిపోతుందా అన్న చర్చ సాగుతోంది. ఆమె రాజకీయంగా అతి పెద్ద కొండనే ఎదురుగా ప్రత్యర్థిగా పెట్టుకుని కవిత ఏ మేరకు తాను అనుకున్న రాజకీయ లక్ష్యాన్ని చేరుకోగలదు అన్నది చర్చగా ఉంది. కేసీఆర్ చరిష్మాటిక్ ఫిగర్, డైనమిక్ లీడర్ షిప్ రాజకీయ వ్యూహాలు ఆయన పట్టుదల ఇవన్నీ అనేక సవాళ్ళను ధీటుగా ఎదుర్కొనేలా చేశాయని చెబుతారు

సెంటిమెంట్ తోనూ పోరాటం :

ఇక చూస్తే అటు కవిత అయినా ఇటు కేసీఆర్ అయినా సెంటిమెంట్ ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆమెకు ఆయన తండ్రి. అలాగే కవిత కేసీఆర్ కి కుమార్తె. ఈ విధంగా చూస్తే సెంటిమెంట్ పాలిటిక్స్ ఓవర్ టేక్ చేయకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా చూస్తే తెలుగు నాట కుటుంబ బంధాలు రాజకీయ పోరాటాలు ఒక ఎత్తున సాగాయి. ఇపుడు మరో సరికొత్త అంకంగా చెప్పాల్సి ఉంటుంది. ఏది ఏమైనా బీఆర్ఎస్ లో కవిత ఎపిసోడ్ ఒక భారీ కుదుపుగానే ఉంటుందని విశ్లేషణలు ఉన్నాయి. చూడాలి మరి ముందు ముందు ఏమి జరుగుతుందో. ఏ విధంగా గులాబీ పార్టీలో రాజకీయ పోరు సాగుతుందో.