జూబ్లీహిల్స్‌లో రౌడీషీటర్‌ను ఓడించండి
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.
By: A.N.Kumar | 23 Oct 2025 9:00 PM ISTజూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పార్టీ నేతలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
మాగంటి సునీత గెలుపు ఖాయం: KCR ధీమా
జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత విజయం ఇప్పటికే ఖాయమైందని కేసీఆర్ గట్టి ధీమా వ్యక్తం చేశారు. "ప్రజలు ఇప్పటికే మాగంటి సునీతని గెలిపించాలని నిర్ణయించుకున్నారు," అని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఈ విజయాన్ని భారీ మెజారిటీతో సాధించేందుకు పార్టీ శ్రేణులు గట్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రౌడీషీటర్ కుటుంబానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలి
కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో అత్యంత కీలకం కాంగ్రెస్ అభ్యర్థిపై ఆయన సంధించిన అస్త్రం. "రౌడీషీటర్ కుటుంబానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థిని ప్రజలు చిత్తుగా ఓడించాలి," అని ఆయన పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ వంటి ప్రాధాన్యమైన నియోజకవర్గంలో శాంతి భద్రతలు, అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్‌ఎస్ గెలవాలని ఆయన నొక్కి చెప్పారు. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను కాపాడుకోవాలంటే రౌడీషీటర్ కుటుంబం నుంచి వచ్చిన అభ్యర్థిని ప్రజలు ఓడించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
బూత్ స్థాయి వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్దేశం
ఎన్నికల్లో భారీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. "ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలవండి" అని ఆయన సూచించారు. బీఆర్‌ఎస్ పాలనలో అమలైన సంక్షేమ కార్యక్రమాలు.. అభివృద్ధి పనులను ప్రజలకు గుర్తు చేయాలని తెలిపారు. ముఖ్యంగా బూత్ స్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు, ఇచ్చిన దిశానిర్దేశంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం, గెలుపుపై మరింత పట్టుదల పెరిగింది. ఈ ఎన్నిక రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.
