Begin typing your search above and press return to search.

కేసీఆర్ జగన్ స్టాలిన్...ఇండీ కూటమి టార్గెట్ !

డీలిమిటేషన్ బిల్లును గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన స్టాలిన్, కేసీఆర్, జగన్ ఇప్పుడు మద్దతు తెలపడంతో రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదన్న హామీతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీలు చెబుతున్నాయి. అయితే సీట్ల పెంపులో పెద్ద రాష్ట్రాలకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని శశిథరూర్ విమర్శించారు. దీంతో ఈ మూడు పార్టీలు ఇండియా కూటమి నేతల టార్గెట్‌గా మారాయి.

By:  Satya P   |   29 Nov 2026 9:24 AM IST
కేసీఆర్ జగన్ స్టాలిన్...ఇండీ కూటమి టార్గెట్ !
X

డీలిమిటేషన్ బిల్లు అని ఎపుడైతే బీజేపీ తెర మీదకు తెచ్చిందో ఆనాటి నుంచి ఒక నిరసన అయితే మొదలైంది. అదేంటి అంటే దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద ఎత్తున సీట్ల కోత పడబోతోంది అని. నిజానికి జనాభా లెక్కల ఆధారంగా చేసి ఉంటే అదే జరిగేది. అందుకే దక్షిణాది రాష్ట్రాలు ఈ అంశం మీద గట్టిగానే తమ గళం వినిపించాయి. అప్పట్లో డీఎంకే అధికారంలో ఉన్నపుడు ముఖ్యమంత్రి స్టాలిన్ చొరవ తీసుకుని దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీలను ముఖ్యమంత్రులను తమిళనాడుకు పిలిచి మరీ రౌండ్ టేబిల్ మీట్ నిర్వహించారు. డీలిమిటేషన్ ని అడ్డుకుంటామని కూడా భారీ ప్రకటనలు చేశారు. అదే మీటింగ్ కి బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ హాజరయ్యారు. వైసీపీ నుంచి అయితే ఎవరూ వెళ్ళలేదు. అయినా ఈ మూడు పార్టీలూ డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని గట్టిగా వాదించాయి.

కట్ చేస్తే ఓకే :

మరి ఆ పోరాటాలు అన్నీ పక్కన పెడితే కట్ చేస్తే ఇపుడు ఈ మూడు పార్టీలు డీలిమిటేషన్ కి ఓకే చెప్పడం అన్నది విశేషం. దానికి ఈ పార్టీలు చెప్పే కారణాలు ఏమైనప్పటికీ బీజేపీకి బీ టీం అంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. ప్రత్యేకించి ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నుంచే వీరికి ఈ వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. వీరు టార్గెట్ అవుతున్నారు. బీఆర్ఎస్ ని అయితే బీ ఆర్ఎస్ఎస్ అని అంటున్నారు. స్టాలిన్ కి అయితే ఆర్ఎస్ఎస్ ముద్ర వేశారు. జగన్ సంగతి ఎటూ చెప్పాల్సింది లేదు, ఆయన బీజేపీకి మద్దతు ఇస్తూనే ఉంటారు అని విమర్శలు మళ్లీ మొదలెట్టారు. ఇలా ఈ మూడు పార్టీలను ఎందుకు ట్రోల్స్ చేస్తునారు అంటే దక్షిణాదిన కీలక ప్రాంతీయ పార్టీలుగా ఉన్నారు కాబట్టి. వీరు తప్పించి మిగిలిన పార్టీలలో రెండు ప్రాంతీయ పార్టీలు టీడీపీ జనసేన ఎన్డీయేతో కలసి ఉన్నాయి. అలాగే కర్ణాటకలో జేడీ ఎస్ పార్టీ కూడా ఎన్డీయేలో ఉంది. మిగిలినవి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కొత్తగా పుట్టిన టీవీకే తదితర పార్టీలు.

లెక్క కరెక్టే అయినా :

దక్షిణాది రాష్ట్రాలకు లోక్ సభలో సీటు షేరింగ్ లో వాటా గతంలో మాదిరిగానే ఉందని ఎక్కడా తగ్గలేదని అందుకే తాము మద్దతు ఇస్తున్నామని ఈ పార్టీలు అంటున్నాయి. అయితే ఈ లెక్క కాదు చూడాల్సింది పెద్ద రాష్ట్రాలకు ఇదే రేషియో ప్రకారం ఎంత పెరిగిందో చూడమని కాంగ్రెస్ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి శశిధరూర్ అంటున్నారు. ఆయన ఒక ఆసక్తికరమైన పోలికను కూడా చెప్పుకొచ్చారు. నెలకు రెండు లక్షలు సంపాదించే మేనేజింగ్ డైరెక్టర్‌కు 20 వేల రూపాయలు సంపాదించే డ్రైవర్‌కు ఇద్దరికీ సమానంగా 50 శాతం జీతం పెంచితే వారిద్దరి మధ్య ఉన్న 10:1 నిష్పత్తి మారక పోవచ్చు కానీ వాస్తవ సంఖ్యలో ఎండీకి ఏకంగా లక్ష రూపాయలు పెరిగితే డ్రైవర్‌కు కేవలం 10 వేల రూపాయలు మాత్రమే పెరుగుతుందని శశిథరూర్ వివరించారు. దామాషా పద్ధతిలో సీట్లు పెరుగుతాయన్న కేంద్ర ప్రభుత్వ హామీని నమ్మి డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు పలకడం ద్వారా డీఎంకే రాష్ట్రాల హక్కుల విషయంలో రాజీ పడిందని ఆయన విమర్శించారు.

లాభమా నష్టమా :

మరో వైపు చూస్తే డీలిమిటేషన్ వల్ల జాతీయ పార్టీలకే ఎపుడూ లాభం అన్న వాదన కూడా ఉంది. ఈ రోజు బీజేపీ మీద విమర్శలు చేసినా రేపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఈ పెరిగిన సీట్లలో ప్రయోజనాలను పొందుతుందని అదే సమయంలో ప్రాంతీయ పార్టీలే నష్టపోతాయని అంటున్నారు. అవి ఈ రోజున తటస్థంగా ఉన్న పార్టీలు అయినా లేదా ఎన్డీయే ఇండియా కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అయినా పెరిగిన సీట్లలో పరచుకునే జాతీయ రాజకీయ చట్రంలో పడి ఇబ్బంది పడడం ఖాయమని అంటున్నారు. ఇక కేసీఆర్ జగన్ స్టాలిన్ ఈ బిల్లుకి మద్దతు ఇవ్వడం వెనక కాంగ్రెస్ వ్యతిరేకత కూడా మరో ప్రధాన కారణం అని కూడా విశ్లేషిస్తున్నారు. అందుకే ఇండీ కూటమికి టార్గెట్ అవుతున్నారని అంటున్నారు.