Begin typing your search above and press return to search.

"తోలు తీసే టైం ఇంకా రాలేదా?" కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్ పై ఇంట్రస్టింగ్ డిబేట్

‘ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క’ అంటూ డిసెంబరు 21న వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.

By:  Tupaki Political Desk   |   30 Dec 2025 8:00 PM IST
తోలు తీసే టైం ఇంకా రాలేదా? కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్ పై ఇంట్రస్టింగ్ డిబేట్
X

‘ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క’ అంటూ డిసెంబరు 21న వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయిందని, ప్రభుత్వానికి తానిచ్చిన సమయం ముగిసిందని చెప్పడమే కాకుండా "తోలు తీస్తాం.. అడుగడుగునా నిలదీస్తాం" అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ రేపాయి. దాదాపు రెండేళ్ల పాటు రాజకీయంగా పూర్తి నైరాశ్యంతో గడుపుతున్న బీఆర్ఎస్ అధినేత ఎట్టకేలకు మీడియాకు ముందుకు రావడం, అసెంబ్లీ సమావేశాలకు ముందు ప్రభుత్వానికి హెచ్చరికలు పంపేలా మాట్లాడటంతో బీఆర్ఎస్ శ్రేణులలో ఉత్సాహం కనిపించింది. అయితే తోలు తీయడం సంగతేమో కానీ, ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయంలో కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరే ఇప్పుడు ప్రధానంగా చర్చకు తావిస్తోందని అంటున్నారు.

సోమవారం తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష నేత హోదాలో సభకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ సభలో కేవలం 7 నిమిషాలు మాత్రమే గడిపారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే మాజీ సీఎం కేసీఆర్ వెళ్లిపోవడంపై రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోందని చెబుతున్నారు. పది రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. ‘ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క’ అంటూ ఇచ్చిన వార్నింగును అంతా ప్రస్తావిస్తున్నారు. రెండేళ్ల మౌనం తర్వాత బీఆర్ఎస్ అధినేత గళం విప్పుతారని అంతా ఎదురుచూడగా, ఆయన అందరినీ నిరాశలో ముంచేసినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక తొలిరోజు పలు ప్రజాసమస్యలపై సభలో చర్చ జరిగింది. విపక్షానికి చెందిన హరీశ్ రావు, కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వంటివారు సభలో మాట్లాడారు.

అయితే శాసనసభలో ఎవరు మాట్లాడినా, అంతా కేసీఆర్ మాట్లాడకుండా వెళ్లిపోవడాన్నే ఎక్కువగా ప్రస్తావిస్తున్నట్లు చెబుతున్నారు. పది రోజుల క్రితం సీరియస్ వార్నింగు ఇచ్చిన బీఆర్ఎస్ అధినేత మళ్లీ మౌనాన్ని ఆశ్రయించారా? లేక తదుపరి చర్చల్లో పాల్గొంటారా? అనేది ఎక్కువగా చర్చిస్తున్నారు. సోమవారం సభ ప్రారంభమైనా, బీఏసీ నిర్ణయం మేరకు సభకు మూడు రోజులు వాయిదా వేశారు. తిరిగి జనవరి 2వ తేదీన అసెంబ్లీ ప్రారంభమవుతుంది. దీంతో కేసీఆర్ ఆ రోజు సభకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సోమవారం ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన కేసీఆర్.. 2వ తేదీన జరిగే సమావేశానికి వస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో కేసీఆర్ సవాల్ విసిరినట్లు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం చర్చకు ముందుకు వచ్చిన రోజున కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

మరోవైపు పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాల వినియోగంపై సభలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కేసీఆర్ తీవ్ర కసరత్తు చేస్తున్నారనే ప్రచారం ఆసక్తి రేపుతోంది. రెండేళ్ల తర్వాత తాను క్రియాశీలమవుతున్నట్లు స్వయంగా చెప్పిన కేసీఆర్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు సాగునీటి రంగ నిపుణులతో చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ ఈ అంశంపై మాట్లాడితే ఎదుర్కొడానికి సిద్దంగా ఉండాలని కాంగ్రెస్ శాసనసభ్యులకు పిలుపునిచ్చారు. కృష్ణ పరివాహక ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలకు ఈ మేరకు సమాచారం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్ష నేతపై ఎదురుదాడికి సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చినట్లు సమాచారం.

ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పాలమూరు - రంగారెడ్డి, కృష్ణా జలాల వినియోగంపై అసెంబ్లీ వేదికగా వాడివేడి చర్చ జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో విపక్ష నేత కేసీఆర్ 2 లేదా 3వ తేదీల్లో సభకు వచ్చే పరిస్థితి ఉందని చెబుతున్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా, గత ప్రభుత్వాల ప్రతిపాదనలు, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయాలపై కేసీఆర్ మాట్లాడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న వైఖరి వల్ల రెండు జిల్లాల రైతులకు ఎలాంటి నష్టం జరగనుందో కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉందని అంటున్నారు.