Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ పని అయిపోయింది.. కేసీఆర్ కాన్ఫిడెన్స్ కామెంట్స్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వాగ్ధాటికి తెరలేపారు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.

By:  A.N.Kumar   |   22 Dec 2025 1:00 AM IST
కాంగ్రెస్ పని అయిపోయింది.. కేసీఆర్ కాన్ఫిడెన్స్ కామెంట్స్
X

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వాగ్ధాటికి తెరలేపారు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. పంచాయితీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం హైదరాబాద్ లోని ‘తెలంగాణ భవన్’లో బీఆర్ఎస్ నేతలతో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ కీలక రాజకీయ వ్యాఖ్యలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పనిచేస్తోందని.. అదే పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందని అన్నారు.

గర్వంతో ఎగిరే ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ది చెప్పారు..

పంచాయితీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని కేసీఆర్ తెలిపారు. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే బీఆర్ఎస్ సత్తా ఏంటో మరింత స్పష్టంగా తెలిసేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికర గర్వంతో వ్యవహరిస్తున్నారని.. అలాంటి వైఖరికి ప్రజలే బుద్ది చెప్పారని అన్నారు. ‘నన్ను తిట్టడం.. అవమానించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానం. నన్ను చనిపోవాలని శాపాలు పెట్టడం రాజకీయమా?’ అంటూ కాంగ్రెస్ పై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క కొత్త పాలసీ కూడా తీసుకురాలేదు. మేము అమలు చేసిన పథకాలను కూడా నిలిపివేశారు’ అని ఆరోపించారు. కాంగ్రెస్ పాలన అంతా తనపై విమర్శలు చేయడానికే పరిమితమైందని.. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం లేదని మండిపడ్డారు.

మా పాలనలో అహంకారం లేదు.. ప్రజల ఆస్తుల విలువ పెరిగింది..

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అహంకార వైఖరి ప్రదర్శించలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. తాము తీసుకొచ్చిన విధానాల వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ సహా ప్రజల ఆస్తుల విలువ భారీగా పెరిగిందని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ విలువలు పూర్తిగా పడిపోయాయని ఆరోపించారు.

వ్యవసాయ రంగాన్ని ఉదాహరణగా చూపిన కేసీఆర్.. ఒకప్పుడు యూరియా రైతుల ఇంటికే, చేను దగ్గరకే వచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ లో యూరియా కోసం కుటుంబమంతా లైన్ లో నిలబడే పరిస్థితి వచ్చింది ’ అంటూ తీవ్రఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

పంచాయతీ ఎన్నికలే సంకేతం

పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతకు స్పష్టమైన సంకేతమని కేసీఆర్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఈ అసంతృప్తి మరింత పెద్ద రూపం దాలుస్తుందని హెచ్చరించారు. పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

మొత్తానికి కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాలను ఆయుధంగా చేసుకొని.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ దాడి మరింత ఉదృతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.