కేసీఆరే సీఎం...కొత్త చర్చకు తెర లేపిన కేటీఆర్ !
బీఆర్ఎస్ లో సుప్రీం లీడర్ కేసీఆర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అదే సమయంలో ఆయన తరువాత వారసుడిగా కేటీఆర్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
By: Satya P | 30 Sept 2026 11:22 PM ISTబీఆర్ఎస్ లో సుప్రీం లీడర్ కేసీఆర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అదే సమయంలో ఆయన తరువాత వారసుడిగా కేటీఆర్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆయన ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటున్నారు. పార్టీలో దైనందిన వ్యవహారాలు అన్నీ ఆయనే చూస్తున్నారు. ఇక హరీష్ రావు కూడా మరో అగ్ర నేతగా గులాబీ పార్టీలో ఉన్నారు. ఈ ముగ్గురితోనే బీఆర్ఎస్ ఉంది. మిగిలిన నాయకులు సీనియర్లు ఎంత మంది ఉన్నా బీఆర్ఎస్ అనే రధానికి సారధులు వీరే అన్నది నిజం. ఇదిలా ఉంటే 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తే కేటీఆర్ సీఎం అవుతారు అన్న ప్రచారం ఆ మధ్య దాకా సాగింది. అయితే ఇపుడు ఆ పార్టీ పొలిటికల్ టోన్ మారింది. కేసీఆరే సీఎం అని గట్టిగానే ఈ మధ్య కాలంలో ప్రచారం చేస్తున్నారు.
క్లారిటీ ఇచ్చిన కేటీఆర్ :
ఇక కేరళలోని కొచ్చిలో జరిగిన ఇండియా టు డే కాంక్లేవ్ సౌత్ 2026 లో కేటీఆర్ తాను సీఎం అభ్యర్ధిని కాను అంటూ పక్కాగా క్లారిటీ ఇచ్చేశారు. 2028 లో తెలంగాణాలో జరిగే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేసీఆర్ ఉంటారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కాంక్లేవ్ లో కేటీఆర్ కి కీలక ప్రశ్న ఎదురైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున మీరే సీఎం అభ్యర్థా అని అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిస్తూ తాను అయితే ఖచ్చితంగా కానే కాదు అని కుండబద్ధలు కొట్టారు. రాబోయే ఎన్నికల్లో మా పార్టీ తరఫున సీఎం అభ్యర్థి కేసీఆర్ అని ఆయన తేల్చేశారు.
రెండేళ్లలో సీఎంగా :
తెలంగాణాలో రెండేళ్లలో జరిగే ఎన్నికల్లో సీఎం గా తిరిగి కేసీఆర్ ప్రమాణం చేస్తారు అని కేటీఆర్ జోస్యం చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలలో విపతీరమైన వ్యతిరేకత ఉందని విశ్లేషించారు. అందువల్ల రాబోయే రెండేళ్లలో జరిగే ఎన్నికలలో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని అలా తన నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అని ధీమాగా చెప్పారు. తాను మాత్రం ముఖ్యమంత్రిని కాను అని చెప్పారు. దీంతో బీఆర్ఎస్ లో సీఎం ఎవరు అన్న దానికి కేటీఆర్ ఫుల్ స్టాప్ పెట్టారా లేక కొత్త చర్చకు తెర తీశారా అన్నదే అంతా విశ్లేషిస్తున్నారు.
అలా అందుకుంటారా :
కేటీఆర్ సీఎం అభ్యర్ధి అని ఇప్పటికే బీఆర్ఎస్ లో నాయకత్వం క్యాడర్ చాలా వరకూ ఫిక్స్ అయి ముందుకు సాగుతోంది. అయితే కేసీఆర్ సీఎం అని కేటీఆర్ చెప్పడంతో వారంతా ఇపుడు ఏ విధంగా ఆలోచిస్తారు అన్నది చర్చగా ఉంది. అయితే బీఆర్ఎస్ వ్యూహాత్మకంగానే ఇలా చేస్తోంది అని అంటున్నారు. రేవంత్ రెడ్డిని ఢీ కొట్టాలీ అంటే కేసీఆర్ సరైన వారు అని ఆయన్ని ముందు పెడుతున్నారని అంటున్నారు. పైగా తెలంగాణా తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ కి ఇమేజ్ ఉంది. దాంతో ఆయన నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తేనే బీఆర్ఎస్ కి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని లెక్క వేస్తున్నారు మరి కేటీఆర్ సీఎం ఎపుడు అంటే ఒక్కసారి పార్టీ అధికారం దక్కించుకున్నాక అయిదేళ్ల పాటు పవర్ చేతిలో ఉంటుంది. దాంతో ఆ తరువాత ఎన్నో మార్పులు చేర్పులు జరగవచ్చు అని అంటున్నారు. అంటే ఒకవేళ కేటీఆర్ చెప్పినట్లుగా కేసీఆర్ 2028లో సీఎం అయినా ఎక్కువ కాలం ఆయన ఆ సీటులో ఉండకపోవచ్చు. మధ్యలోనే కేటీఆర్ కి పట్టాభిషేకం జరగవచ్చు అన్నది కూడా ఊహాగానాలుగా ఉంది. మొత్తానికి కేసీఆర్ ని ముందు పెట్టి అధికారం సంపాదించాలన్నది గులాబీ పార్టీ చాణక్య వ్యూహంగా కనిపిస్తోంది అంటున్నారు.
