Begin typing your search above and press return to search.

ఆ రూ.22 కోట్లతో కేసీఆర్ ను డిఫెన్స్ లో పడేసిన సీఎం రేవంత్!

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది.

By:  A.N.Kumar   |   31 Aug 2026 10:59 PM IST
ఆ రూ.22 కోట్లతో కేసీఆర్ ను డిఫెన్స్ లో పడేసిన సీఎం రేవంత్!
X

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. మూసారాంబాగ్‌లో మూసీ నదిపై నూతనంగా నిర్మించిన వంతెనను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతగా ఉన్న మాజీ సీఎం కేసీఆర్‌పై 1,000 రోజుల్లో ప్రభుత్వ ఖజానా నుంచి రూ.22.24 కోట్లు ఖర్చయ్యాయని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ రూ.22 కోట్లతో కేసీఆర్ ను డిఫెన్స్ లో పడేసిన సీఎం రేవంత్ రాజకీయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

కేసీఆర్ ఖర్చులపై సీఎం లెక్కలు బయటపెడుతూ.. ఆయనకు 1,000 రోజులకు గాను రూ.1.24 కోట్లకు పైగా జీతం చెల్లించామని.. అలాగే ఆయన భద్రత, బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, ఇతర సౌకర్యాల కోసం సుమారు రూ.21 కోట్లు ఖర్చయ్యాయని వెల్లడించారు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగి ఏడాది పాటు విధులకు హాజరుకాకపోతే డిస్మిస్ చేస్తారని.. మరి అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యలను పట్టించుకోని కేసీఆర్‌ను ఏం చేయాలని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో పూర్తిగా విఫలమైనందున ఆయన రాజీనామా చేయాలన్నారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో పరిష్కారం కాని మూసారాంబాగ్‌ బ్రిడ్జి సమస్యను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పూర్తి చేసిందని సీఎం తెలిపారు. అంబర్‌పేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. బతుకమ్మ కుంట ఆక్రమణలను అడ్డుకుంటామని స్పష్టం చేస్తూ చెరువుల సంరక్షణ కోసం తీసుకొచ్చిన హైడ్రా చర్యలను పూర్తిస్థాయిలో సమర్థించారు.

గత ప్రభుత్వం రూ.70 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పును రూ.8.11 లక్షల కోట్లకు పెంచి ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ఉద్యోగులకు ప్రతి నెలా మొదటి తేదీనే జీతాలు ఇస్తున్నామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు 2,000 పడకలతో ఉస్మానియా ఆసుపత్రిని అందుబాటులోకి తెస్తున్నామని, నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రులకు మర్రి చెన్నారెడ్డి, టి. అంజయ్య, కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ వంటి తెలంగాణ ప్రముఖుల పేర్లు పెడతామని ప్రకటించారు. 1931 తర్వాత ఏ నాయకుడూ చేయని కులగణనను తెలంగాణలో చేపడుతున్నామని, కేంద్రం కూడా జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.

మొత్తానికి ప్రతిపక్ష నేతగా యాక్టివ్ గా లేకుండా.. అసెంబ్లీకి కూడా రాకుండా వెళ్లదీస్తున్న కేసీఆర్ ను డిఫెన్స్ లో పడేసేలా.. ప్రజలకు దూరమైన నేతగా ప్రొజెక్ట్ చేయడంలో రేవంత్ తన మాటల చాణక్యాన్ని మరోసారి ప్రదర్శించినట్టైంది.