కేరళ సీఎంగా కేసీ వేణుగోపాల్? 47 మంది ఎమ్మెల్యేల మద్దతుతో రేసులో ముందంజ!
పదేళ్ల నిరీక్షణ తర్వాత కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.
By: Tupaki Political Desk | 8 May 2026 3:52 PM ISTపదేళ్ల నిరీక్షణ తర్వాత కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు సీఎం అభ్యర్థి ఎంపిక ప్రక్రియ క్లైమాక్స్‌కు చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు సీనియర్ నేత రమేష్ చెన్నితల, మరోవైపు ప్రజాదరణ ఉన్న వీడీ సతీశన్ రేసులో ఉన్నప్పటికీ, అధిష్టానానికి అత్యంత సన్నిహితుడైన కేసీ వేణుగోపాల్ వైపే మెజారిటీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపడం విశేషం. ఏఐసీసీ ప్రతినిధులు ముకుల్ వాస్నిక్, అజయ్ మాకెన్ సేకరించిన అభిప్రాయాల్లో వేణుగోపాల్ కు స్పష్టమైన ఆధిక్యం లభించడంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (మే 2026) కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 102 స్థానాల్లో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. కేవలం కాంగ్రెస్ పార్టీయే 63 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది.
కేసీ వేణుగోపాల్‌కు క్లీన్ స్వీప్!
థియేటర్లలో క్లైమాక్స్ సీన్ లాగా సాగిన ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణలో కేసీ వేణుగోపాల్ అందరికంటే ముందు నిలిచారు. కాంగ్రెస్ గెలిచిన 63 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 47 మంది కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేత రమేష్ చెన్నితలకు ఎనిమిది మంది, వీడీ సతీశన్‌కు ఆరుగురి ఎమ్మెల్యేల మద్దతు లభించినట్లు సమాచారం. ఏఐసీసీ పరిశీలకులు ముకుల్ వాస్నిక్, అజయ్ మాకెన్ ఎమ్మెల్యేలతో వన్-టు-వన్ సమావేశాలు నిర్వహించి సిద్ధం చేసిన నివేదికను ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేకు అందజేశారు.
ముకుల్ వాస్నిక్ ఢిల్లీ పయనం.. లీకైన సమాచారం?
తిరువనంతపురంలో చర్చలు ముగించుకొని ముకుల్ వాస్నిక్ ఢిల్లీకి బయలుదేరినప్పుడు ఒక ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఆయన చేతిలో ఉన్న మద్దతు పత్రాల కవరుపై, ఫైల్ పత్రాల్లో 'కేసీ వేణుగోపాల్' అనే పేరు స్పష్టంగా కనిపించడంతో, ఆయన ఎంపిక దాదాపు ఖాయమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆదివారం నాటికి హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
కేసీ ముందున్న సవాళ్లు
ఒకవేళ కేసీ వేణుగోపాల్ సీఎంగా ఎంపికైతే ఆయన కొన్ని సాంకేతిక ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయన ఆలప్పుళా లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. సీఎం అయితే ఆ ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆయన ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాబట్టి, సీఎంగా ప్రమాణం చేసిన ఆరు నెలల్లోగా ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలి. పార్టీలోని సీనియర్ నేతలను కలుపుకొని వెళ్లడం, కూటమిలోని మిత్రపక్షాలను (ఐయూఎంఎల్ వంటివి) సంతృప్తి పరచడం ఆయన ముందున్న ప్రధాన సవాలు.
రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకస్తుడిగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా (ఆర్గనైజేషన్) ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన కేసీ వేణుగోపాల్, ఇప్పుడు తన సొంత రాష్ట్రానికి బాస్ కాబోతున్నారు. దశాబ్ద కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఆయన నాయకత్వంలో కేరళను ఏ దిశగా నడిపిస్తుందో చూడాలి.
