Begin typing your search above and press return to search.

కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది? కారణమేంటి?

కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్డు మీద ఏడెనిమిది ఫ్లైఓవర్లు, ఏడెనిమిది అండర్‌పాస్‌లతో భారీ సెట్ వేసేద్దామని ప్లాన్ చేస్తే.. తీరా చూస్తే పర్మిషన్ల దగ్గర సీన్ రివర్స్ అయింది.. కేబీఆర్ పార్క్ చుట్టూ 'రైట్ రైట్.. లెఫ్ట్ లెఫ్ట్' అని తిప్పే సరికి గంటల కొద్దీ ఉండే ట్రాఫిక్ జామ్‌లు కాస్త సగం పోయాయి

By:  A.N.Kumar   |   5 Oct 2026 3:44 PM IST
కేబీఆర్ పార్క్ చుట్టూ  ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది? కారణమేంటి?
X

కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్డు మీద ఏడెనిమిది ఫ్లైఓవర్లు, ఏడెనిమిది అండర్‌పాస్‌లతో భారీ సెట్ వేసేద్దామని ప్లాన్ చేస్తే.. తీరా చూస్తే పర్మిషన్ల దగ్గర సీన్ రివర్స్ అయింది.. కేబీఆర్ పార్క్ చుట్టూ 'రైట్ రైట్.. లెఫ్ట్ లెఫ్ట్' అని తిప్పే సరికి గంటల కొద్దీ ఉండే ట్రాఫిక్ జామ్‌లు కాస్త సగం పోయాయి. "ఇంత తేలిగ్గా అయ్యేదానికి వేల కోట్లు దండగ ఎందుకు బాస్?" అని జ్ఞానోదయం పొందిన సర్కారు.. పాత ప్రణాళికలోని అరడజను ఫ్లైఓవర్ల స్థానంలో.. 'ఒకే ఒక్క ఎలివేటెడ్ కారిడార్' అనే సింగిల్ విండో సిస్టమ్‌ను తీసుకొచ్చింది. అసలు ప్రాజెక్టే ఆగిపోయిందని నెత్తీ నోరూ బాదుకుంటున్న వారికి జీహెచ్‌ఎంసీ సస్పెన్స్ వీడదీసింది.. "ప్రాజెక్టు ఆగిపోలేదు భయ్యా.. సైజు తగ్గించి కాస్త బడ్జెట్ ఆదా చేశామంతే!" అని కబురు చల్లగా చెప్పింది.

హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో ప్రతిపాదించిన భారీ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల సంఖ్యను తగ్గించి.. ప్రధాన ట్రాఫిక్‌ను సిగ్నల్ రహితంగా తరలించేలా కొత్త రీ-అలైన్‌మెంట్‌కు జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. పాత ప్రతిపాదనలో 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లు నిర్మించాలని భావించగా.. ఇప్పుడు ఒక ప్రధాన ఎలివేటెడ్ కారిడార్.. ఒక అండర్‌పాస్‌తో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా ప్రణాళిక మారింది.

రూ.1,090 కోట్ల ప్రాజెక్టుకు కొత్త రూపం

కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం తొలుత దాదాపు రూ.826 కోట్లతో ప్రాజెక్టును ప్రతిపాదించింది. అనంతరం అంచనా వ్యయం రూ.1,090 కోట్లకు చేరింది. రోడ్ నంబర్ 45, ఫిలింనగర్, మహారాజా అగ్రసేన్, క్యాన్సర్ హాస్పిటల్, ఎన్ఎఫ్‌సీఎల్ జంక్షన్, టీవీ9 జంక్షన్ తదితర ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, స్టీల్ బ్రిడ్జిలు నిర్మించాలన్నది అప్పటి ప్రణాళిక.

అయితే కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ఎకో సెన్సిటివ్ జోన్‌లో చెట్ల తొలగింపు అంశం న్యాయపరమైన సమస్యలకు దారితీయడంతో పనులు ముందుకు సాగలేదు. ఇదే సమయంలో కేబీఆర్ పార్క్ చుట్టూ అమలు చేసిన క్లాక్‌వైజ్ వన్‌వే ట్రాఫిక్ విధానం మంచి ఫలితాలను ఇచ్చింది. ప్రారంభంలో వాహనదారులకు కొంత ఇబ్బంది ఎదురైనా.. తర్వాత సిగ్నళ్ల వద్ద వేచి ఉండే సమయం తగ్గడంతో ట్రాఫిక్ ప్రవాహం మెరుగుపడింది.

4.4 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్

వన్‌వే విధానం సానుకూల ఫలితాలు ఇవ్వడంతో భారీ సంఖ్యలో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించాల్సిన అవసరంపై అధికారులు పునరాలోచన చేశారు. ఇందులో భాగంగా కొత్త ప్రతిపాదనను సిద్ధం చేశారు. నాగార్జున సర్కిల్, ముఫ్ఫాకమ్ జా ఇంజినీరింగ్ కాలేజీ పరిసరాల నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు సుమారు 4.4 కిలోమీటర్ల పొడవున ఆరు లైన్ల ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మించాలని నిర్ణయించారు.

ఈ కారిడార్ ద్వారా పంజాగుట్ట, నాగార్జున సర్కిల్ వైపు నుంచి ఐటీ కారిడార్ దిశగా వెళ్లే వాహనాలకు సిగ్నల్ రహిత ప్రయాణం కల్పించడం ప్రధాన లక్ష్యం. దీంతో కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ఒక్కో జంక్షన్ వద్ద వేర్వేరు ఫ్లైఓవర్లు నిర్మించే అవసరం తగ్గనుంది.

రోడ్ నంబర్ 10–12 మధ్య అండర్‌పాస్

ప్రధాన ఎలివేటెడ్ కారిడార్‌తో పాటు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 నుంచి రోడ్ నంబర్ 12కు అనుసంధానంగా మరో అండర్‌పాస్ నిర్మించనున్నారు. అలాగే రోడ్ నంబర్ 1 వైపు వెళ్లే వాహనాలకు అనుకూలంగా జలగం వెంగళరావు పార్క్ వైపు ప్రత్యేక ర్యాంప్ ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

శాశ్వతంగా వన్‌వే విధానం

కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రస్తుతం అమల్లో ఉన్న వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని శాశ్వతంగా కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వన్‌వే మార్గంలోని డివైడర్ల పరిమాణాన్ని తగ్గించి రహదారిని మరింత విస్తరించి ఆరు లైన్ల సామర్థ్యానికి తీసుకురానున్నారు.

రూ.400 కోట్ల వరకు ఆదా

పాత ప్రణాళికలోని బహుళ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల స్థానంలో కొత్త డిజైన్‌ను అమలు చేయడం ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.400 కోట్ల వరకు నిధులు ఆదా అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ రీ-అలైన్‌మెంట్ ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భవిష్యత్‌లో పెరగనున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్‌ను రూపొందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

మొత్తంగా చూస్తే.. కేబీఆర్ ట్రాఫిక్ ప్రాజెక్టు రద్దు కాలేదు. భారీ నిర్మాణాల సంఖ్యను తగ్గించి, ప్రధాన ట్రాఫిక్ ప్రవాహాన్ని ఒకే ఎలివేటెడ్ కారిడార్‌పైకి మళ్లించేలా ప్రాజెక్టు రూపురేఖలు మారాయి. ప్రస్తుత వన్‌వే విధానం, కొత్త ఎలివేటెడ్ కారిడార్, అండర్‌పాస్ కలిసి పనిచేస్తే కేబీఆర్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం లభించే అవకాశం ఉంది.