అంతరిక్షంలోకి మన నిడదవోలు అమ్మాయి
ఆకాశం వైపు ఆశగా చూసే వారు ఎంతో మంది ఉంటారు. ఆశలను ఆకాశాన్ని తాకి నెరవేర్చుకునే వారు కొందరే ఉంటారు.
By: Satya P | 7 Nov 2025 9:28 PM ISTఆకాశం వైపు ఆశగా చూసే వారు ఎంతో మంది ఉంటారు. ఆశలను ఆకాశాన్ని తాకి నెరవేర్చుకునే వారు కొందరే ఉంటారు. వారిలో మన నిడదవోలు అమ్మాయి ముందంజలో ఉంది. కలలు ఎవరైనా కంటారు, వాటిని సాకారం చేసుకోవడమే ముఖ్యం. ఆ విధంగా చూస్తే ఆ అమ్మాయి గొప్ప లక్ష్యాన్ని సాధించబోతుంది. ఏపీలోని గోదావరి జిల్లాలలోని నిడదవోలుకు చెదిన కైవల్యా రెడ్డి అనే అమ్మాయి తొందరలో అంతరిక్ష యానం చేయబోతోంది. ఇది నిజంగా ఆమె కుటుంబానికి నిడదవోలుకే కాదు ఏపీకి తెలుగు రాష్ట్రాలకు ఇంకా గట్టిగా చెప్పాలీ అంటే దేశానికీ గర్వకారణం అన్నది నిజం.
వ్యోమగామి శిక్షణకు :
అమెరికాలో ప్రతిష్టాత్మక వ్యోమగామి శిక్షణకు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కుంచల కైవల్య రెడ్డి ఎంపిక అయ్యింది. ఆమె కల అంతరిక్షంలోకి అడుగుపెట్టడం దానికి సాకారం చేసుకునే క్రమంలో పడిన తొలి అడుగుగా దీనిని భావిస్తున్నారు. ఒక కీలక మైలు రాయిని ఆమె దాటింది. దీంతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వేలాది తో పోటీ పడి :
ఏదీ ఊరికే రాదు శోధించి సాధించాలి అని మహా కవి శ్రీశ్రీ అన్నారు. అలా ఏపీకి చెందిన నిడదవోలు యువతి అరుదైన ఘనతను సొంతం చేసుకోవడం జరిగింది. ఫ్లోరిడాలోని టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో జరిగే ఈ శిక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా 36 దేశాల నుంచి వేలాది మంది పోటీ పడగా అందులో కేవలం 150 మంది మాత్రమే అర్హత సాధించారు. ఇక కైవల్యా రెడ్డి గురించి చూస్తే కనుక చిన్న వయస్సులోనే ప్రతిభ చాటుకొని పదుల సంఖ్యలో రికార్డులు ఆమె సాధించారు. ఇక అంతరిక్ష పరిశోధన రంగంలో ఏపీ తరపున చిన్న వయసులోనే ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. తన కల ఏమిటి అంటే వ్యోమగామి కావాలన్నది. అదే చిన్న నాటి నుంచీ గట్టిగా మనసులో పెట్టుకుని ఆ పట్టుదలను సంకల్పాన్ని ఈ రోజున ఆమె నెరవేర్చే క్రమంలో ఉండడం పట్ల అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆమెకు అభినందనలు :
కైవల్య రెడ్డి కల నెరవేరాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. వేలాది మందిలో ఆమె పోటీ పడి వ్యోమగామి శిక్షణకు ఎంపిక కావడం గర్వకారణం అని ఆయన అన్నారు. ఆమె తన జీవితంలో సాధించిన గొప్ప విజయంగా పేర్కొంటూ ఆమె కలలు సాకారం కావాలని ఆయన కోరారు. ఏపీకి కూడా ఇది ఆనందకరం అని మంత్రి అన్నారు.
