గుంటనక్కలూ ఖబడ్దార్..సీఎంనవుతా..విమర్శకులపై కవిత ఫైర్
తనను విమర్శిస్తున్నవారిపై తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీచేశారు.
By: Tupaki Political Desk | 12 Dec 2025 3:05 PM ISTతనను విమర్శిస్తున్నవారిపై తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీచేశారు. ప్రధానంగా కూకట్ పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం క్రిష్ణారావును ఆమె టార్గెట్ చేశారు. ఇటీవల ఆయన... కవితను తీవ్రంగా దూషించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మీడియా ముందుకువచ్చిన కవిత... ఎమ్మెల్యే మాధవరం చేసిన భూ ఆక్రమణలు ఇవీ అంటూ బయటపెట్టారు. ఐడీపీఎల్ భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఆయనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి కూడా లీగల్ నోటీసులు పంపారు. మరోవైపు టీ న్యూస్ చానల్ కూ లీగల్ నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వీరిద్దరూ తాను కాంగ్రెస్ తో జట్టు కట్టినట్లుగా ఆరోపణలు చేస్తున్నారని కవిత మండిపడ్డారు. వెకిలి చేష్టలు చేస్తున్న గుంట నక్కలూ జాగ్రత్త అంటూ హెచ్చరించారు.
క్షమాపణలు చెప్పకుంటే కోర్టుకు లాగుతా..
అధికారంలో ఉన్నప్పుడు సైతం తన తండ్రి కేసీఆర్ ను ఒక్క సాయమైనా అడగలేదని కవిత చెప్పారు. తనకు ఎవరితోనూ అవగాహన లేదని.. వ్యాపారాలూ లేవని స్పష్టం చేశారు. తన ఆరోపణలకు దమ్ముంటే సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. మాధవరంనకు నోటీసులు ఇస్తున్నానని, వారంలో క్షమాపణలు చెప్పకుంటే కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఎమ్మెల్సీ పోచంపల్లి చాలా సన్నిహితంగా ఉంటారని, ఏవీ రెడ్డితో ఆయనకు భూలావాదేవీలు ఉన్నాయని కవిత ఆరోపించారు. ఆయన ఎవరికి బినామీ? అని ప్రశ్నించారు.
మాధవరం చిన్నోడు.. ఆయన వెనుక గుంట నక్క..
తనపై తీవ్ర విమర్శలు చేసిన మాధవరం క్రిష్ణారావు చాలా చిన్న వ్యక్తి అని అసలు ఆయన వెనుక ఉన్నది గుంట నక్క అని కవిత వ్యాఖ్యానించారు. క్రిష్ణారావు బాధితులు చాలామంది ఉన్నారని, వారంతా తనకు ఫోన్ చేసి గోడు వెళ్లబోసుకుంటున్నారని చెప్పారు. క్రిష్ణారావు కుమారుడు డైరెక్టర్ గా ఉన్న ప్రణీత్, ప్రణవ్ కంపెనీ నిర్మించిన విల్లాలు అన్నీ కబ్జా భూమిలో కట్టినవేనని కవిత ఆరోపించారు. వెంచర్ మధ్యలో 10 ఎకరాల్లో చెరువు ఉండగా అది 6 ఎకరాలకు కుంచించికుపోయిందని.. సీఎం రేవంత్, హైడ్రా దీనిపై ఫోకస్ పెట్టాలని కోరారు.
డెవలప్ మెంట్ పేరిట చెరువునే మింగారు..
కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో డెవలప్ మెంట్ పేరిట చెరువునే మింగేశారని కవిత పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో చాలా తప్పులు జరిగాయని, పదేళ్ల పాటు జరిగిన బీఆర్ఎస్ పాలనతో తనకు సంబంధం లేదని.. ఎంపీగా ఉన్న సమయంలో ఢిల్లీ, తన నియోజకవర్గం నిజామాబాద్ కే పరిమితం అయ్యానని కవిత వివరించారు. తనను పార్టీ నుంచి వెళ్లగొట్టినా ఇంకా కళ్లు చల్లబడలేదా? అని నిలదీశారు. తనపై, తన భర్తపై బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. దేవుడి దయతో తాను సీఎం అవుతానని పేర్కొన్న కవిత.. 2014 నుంచి తెలంగాణలో జరిగిన అన్యాయాలను వెలికితీస్తాను అని ప్రకటించారు.
