Begin typing your search above and press return to search.

తండ్రి కేసీఆర్ ఫొటో లేకుండా.. బీఆర్ఎస్ ఉనికి రాకుండా.. కవిత పాదయాత్ర

కవిత ఈ యాత్ర ద్వారా ప్రతి జిల్లాలో ప్రజలతో ప్రత్యక్షంగా కలిసి, వారి సమస్యలు తెలుసుకునే లక్ష్యాన్ని పెట్టుకున్నారు.

By:  A.N.Kumar   |   15 Oct 2025 12:49 AM IST
తండ్రి కేసీఆర్ ఫొటో లేకుండా.. బీఆర్ఎస్ ఉనికి రాకుండా.. కవిత పాదయాత్ర
X

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకోబోతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర వ్యాప్తంగా ఒక సుదీర్ఘ పాదయాత్ర చేపట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ యాత్ర అక్టోబర్ చివరి వారంలో ప్రారంభమై, ఫిబ్రవరి వరకు నాలుగు నెలల పాటు కొనసాగనుంది.

* యాత్ర ప్రత్యేకతలు: కేసీఆర్ ఫోటో లేదు, జయశంకర్ గారే స్ఫూర్తి!

ఈ యాత్రలో అత్యంత చర్చనీయాంశమైన.. ప్రత్యేకమైన అంశం ఏమిటంటే, మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు అయిన తన తండ్రి కేసీఆర్ ఫోటోలను పోస్టర్లలో ఉపయోగించకుండా నిర్ణయం తీసుకోవడం. దానికి బదులుగా.. తెలంగాణ ఆత్మను, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించే ప్రొఫెసర్ జయశంకర్ గారి ఫోటోలను మాత్రమే ఉపయోగించనున్నట్లు కవిత వెల్లడించారు.

ఈ నిర్ణయం ద్వారా కవిత స్వతంత్ర రాజకీయ ధోరణిని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ముందకు తీసుకువెళ్లాలనే తన లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల సమస్యల పరిష్కారం, రాష్ట్ర ఆత్మను గుర్తు చేయడం

కవిత ఈ యాత్ర ద్వారా ప్రతి జిల్లాలో ప్రజలతో ప్రత్యక్షంగా కలిసి, వారి సమస్యలు తెలుసుకునే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ఆత్మను మరల గుర్తు చేసుకునేందుకు, తెలంగాణ ఉద్యమ స్పూర్తిని గ్రామగ్రామాన నింపేందుకు ఆమె ఈ యాత్రను చేపడుతున్నారు.పల్లెలు, పట్టణాలు, విద్యాసంస్థలు, సాంస్కృతిక కేంద్రాలను ఆమె సందర్శించనున్నారు. ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాలు, విద్యార్థి సమాఖ్యలు, సామాజిక సంస్థలతో సమావేశాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. బీసీ అభివృద్ధి, మహిళా సాధికారత, తెలంగాణ భవిష్యత్తు వంటి కీలక అంశాలపై చర్చలు కొనసాగించనున్నారు.

ఈ యాత్రలో తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకున్న మార్పులు, సాధించిన విజయాలు, ఇంకా చేయాల్సిన పనులపై విస్తృత చర్చ జరగనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి కవిత ఇప్పటికే విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, విద్యావేత్తలతో సమావేశమై సూచనలు తీసుకున్నారు.

* అధికారిక పోస్టర్ రేపు విడుదల

కవిత పాదయాత్రకు సంబంధించిన అధికారిక పోస్టర్ రేపు (బుధవారం) విడుదల కానుంది. జాగృతి కార్యాలయంలో జరుగనున్న ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ ప్రతిభా చిత్రంతో, తెలంగాణ మట్టి వాసనతో రూపొందించిన పోస్టర్‌ను ప్రజలకు చూపించనున్నారు. పోస్టర్ విడుదల అనంతరం యాత్ర షెడ్యూల్, మార్గం, ప్రారంభ స్థలం తదితర వివరాలను కూడా ప్రకటించనున్నారు.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. కేసీఆర్ ఫోటో లేకుండా స్వతంత్రంగా సాగబోతోన్న ఈ యాత్ర తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు కావొచ్చు.. బీఆర్‌ఎస్ భవిష్యత్తు కార్యాచరణలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి స్పూర్తితో మొదలయ్యే ఈ యాత్ర, తెలంగాణ భవిష్యత్తుపై కొత్త చర్చలకు దారితీయడం ఖాయమని భావిస్తున్నారు.