వాళ్లే నన్ను తల్లిదండ్రుల నుంచి దూరం చేశారు.. కవిత మరో బాంబ్
కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటకు వచ్చారో ఇప్పటికే పలు సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు తాజాగా అదే విషయంపై మరోసారి మాట్లాడుతూ ఏమోషనల్ అయ్యారు.
By: A.N.Kumar | 28 Nov 2025 10:27 PM ISTకల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటకు వచ్చారో ఇప్పటికే పలు సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు తాజాగా అదే విషయంపై మరోసారి మాట్లాడుతూ ఏమోషనల్ అయ్యారు. తన ఎగ్జిట్ వెనుక కుట్ర జరిగిందన్న విషయాన్ని నొక్కి చెప్పారు. కవిత మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ నుంచి ఎందుకు బహిష్కరించారో బయటపెట్టారు. అవే ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి బహిష్కరించడం. తన తండ్రి స్థాపించిన పార్టీ నుంచి దూరం కావడంతో ఆమె తెలంగాణలో సొంతంగా రాజకీయ పోరాటాన్ని ప్రారంభించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కవిత తాజాగా మీడియాతో మాట్లాడినప్పుడు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తనను బీఆర్‌ఎస్ నుంచి బయటకు నెట్టేందుకు జరిగిన కుట్ర గురించి స్పందిస్తూ ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
* తల్లిదండ్రుల నుంచి కూడా దూరం చేసే ప్రయత్నం
కొంతమంది వ్యూహాత్మకంగా నన్ను బీఆర్‌ఎస్ నుంచి బయటకు పంపేలా కుతంత్రాలు పన్నారు. పార్టీ నుంచి నన్ను తొలగించడం మాత్రమే కాదు… నన్ను నా తల్లిదండ్రుల నుంచి కూడా దూరం చేసే ప్రయత్నం చేశారు అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక జైలు జీవితాన్ని గుర్తు చేసుకుంటూ తన కుటుంబ బంధాన్ని గురించి మాట్లాడారు. “నేను జైలులో ఉన్నప్పుడు నా పిల్లల కన్నా ఎక్కువగా నా తల్లి గురించి ఆలోచించేదాన్ని. వారినే ఎంతో ప్రేమిస్తాను. కానీ ఈరోజు వారి ఆశీర్వాదం లేకుండా కుటుంబం సహకారం లేకుండా ముందుకు సాగాల్సిన పరిస్థితి వచ్చింది” అని కన్నీటి పర్యంతమయ్యారు.
* అంతర్గత కుట్రపై కవిత ఆరోపణలు
బీఆర్‌ఎస్ నుంచి తన బహిష్కరణ వెనుక అంతర్గత కుట్ర ఉందని కవిత మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌లతో సహా కొందరు పార్టీ నాయకత్వానికి తనపై ప్రతికూల అభిప్రాయాలు ఇచ్చి, తనను పార్టీ నుంచి బయటకు పంపేలా కుట్ర పన్నారని ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే.
తాజా వ్యాఖ్యలు ఈ రాజకీయ విభేదాలు కవిత వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా తన కుటుంబ సంబంధాలపై కూడా తీవ్రంగా ప్రభావం చూపినట్లు స్పష్టం చేస్తున్నాయి. తండ్రి కేసీఆర్ నుంచి కూడా ఆమెకు మద్దతు కొరవడడం, తల్లిదండ్రుల నుంచి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.
