Begin typing your search above and press return to search.

చంద్రబాబు, పవన్ టార్గెట్‌.. తెలంగాణ పాలిటిక్స్‌లో మళ్లీ 'ఆత్మగౌరవ' అస్త్రం

రామగుండంలో నిర్వహించిన 'బాయిబాట' కార్యక్రమంలో ఆమె మాట్లాడిన మాటలు.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు పక్క రాష్ట్ర నేతల జోక్యాన్ని తీవ్రంగా ఆక్షేపించేలా ఉన్నాయి.

By:  A.N.Kumar   |   17 Jun 2026 8:08 PM IST
చంద్రబాబు, పవన్ టార్గెట్‌.. తెలంగాణ పాలిటిక్స్‌లో మళ్లీ ఆత్మగౌరవ అస్త్రం
X

తెలంగాణ రాజకీయాలు మరోసారి ప్రాంతీయ ఆత్మగౌరవ సెంటిమెంట్ చుట్టూ తిరుగుతున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. రామగుండంలో నిర్వహించిన 'బాయిబాట' కార్యక్రమంలో ఆమె మాట్లాడిన మాటలు.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు పక్క రాష్ట్ర నేతల జోక్యాన్ని తీవ్రంగా ఆక్షేపించేలా ఉన్నాయి.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై ఘాటు విమర్శలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారానికి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉంటూ రాజకీయాలు చేస్తున్నారని కవిత ఆరోపించారు. "పక్క రాష్ట్ర నేతలు ఇక్కడ తిష్ట వేసి రాజకీయాలు చేస్తుంటే.. కాంగ్రెస్ నేతలు మాత్రం మమ్మల్ని రాజకీయాలు చేయనివ్వడం లేదంటూ నెపం నెట్టేస్తున్నారు" అని ఆమె ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి బలహీనత వల్లే పక్క రాష్ట్ర నాయకులు తెలంగాణ రాజకీయాల్లో చొరబడి ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శలు గుప్పించారు.

టీఆర్ఎస్ వ్యూహం: మళ్లీ సెంటిమెంట్ పాలిటిక్స్?

కవిత వ్యాఖ్యలను పరిశీలిస్తే టీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా రెండు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నట్లు స్పష్టమవుతోంది. ఉద్యమ కాలంలో "తెలంగాణను తెలంగాణవారే పాలించాలి" అనే నినాదం ఎంతలా ప్రజల్లోకి వెళ్లిందో.. ఇప్పుడు అదే తరహా ప్రాంతీయ భావజాలాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి ప్రజల్లో సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం జరుగుతోంది. రేవంత్ రెడ్డి నాయకత్వ లోపాలను ఎత్తిచూపుతూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. "కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మనమే ఏలుకోవాలి" అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ భవిష్యత్ రాజకీయ కార్యాచరణకు, ప్రచార శైలికి స్పష్టమైన సంకేతంగా కనిపిస్తున్నాయి.

తెరపైకి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశం

హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న కాల పరిమితి ముగిసినప్పటికీ.. భౌగోళికంగా, ఆర్థికంగా, వ్యాపార పరంగా రెండు తెలుగు రాష్ట్రాల నేతలకు ఈ నగరం ఇప్పటికీ ఒక ప్రధాన కేంద్రంగానే ఉంది. ఏపీకి చెందిన ప్రముఖ నేతలు ఇక్కడికి రావడం, సమావేశాలు నిర్వహించడం సహజమేనని అధికార కాంగ్రెస్ వర్గాలు వాదించే అవకాశం ఉంది. అయితే దీన్ని సాధారణ విషయంగా వదిలేయకుండా.. తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపెట్టి రాజకీయ లాభం పొందాలనే పక్కా స్కెచ్‌తో బీఆర్ఎస్ ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

రానున్న ఎన్నికలను, రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ప్రాంతీయ స్వాభిమానాన్ని మరోసారి ప్రధాన అజెండాగా మార్చేందుకు కారు చౌకగా ప్రయత్నాలు మొదలయ్యాయి. కవిత విసిరిన ఈ పొలిటికల్ సవాల్‌పై అధికార కాంగ్రెస్, అలాగే ఏపీ అధికార కూటమికి చెందిన టీడీపీ, జనసేన నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.