కవిత తిరుగుబాటు వెనుక జాతీయ పార్టీ ?
కలలో కూడా అనుకోనివి జరగడమే రాజకీయం. రాజకీయం ఎంత నిర్దాక్షిణ్యం అయింది అంటే దానికి అనుబంధాలతో సంబంధం లేదు.
By: Satya P | 6 Sept 2025 1:00 AM ISTకలలో కూడా అనుకోనివి జరగడమే రాజకీయం. రాజకీయం ఎంత నిర్దాక్షిణ్యం అయింది అంటే దానికి అనుబంధాలతో సంబంధం లేదు. రాగ ద్వేషాలతో అసలు పని లేదు. కన్న వారికి బిడ్డలకు మధ్య ఎడం పెంచగలదు, పేగు బంధాన్ని సైతం పరిహాసం చేయగలదు. ఇపుడు తెలంగాణాలో అదే జరుగుతోంది. బీఆర్ ఎస్ నుంచి తండ్రి కేసీఆర్ కి ఎదురు నిలిచి కవిత బయటకు వచ్చారు. ఆమె మీద సస్పెన్షన్ వేటు పడింది. ఆమె కూడా ఎక్కడా తగ్గకుండా దూకుడు ప్రదర్శించారు. తనపైన సస్పెన్షన్ పడిన మరుసటి రోజే తన ఎమ్మెల్సీ పదవికి ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తన రాజకీయం రూట్ ఏమిటో చెప్పేశారు.
లోతైన చర్చ జరిగిందా :
ఇదిలా ఉంటే కవిత సస్పెన్షన్ ముందు లోతైన చర్చ ఫాం హౌస్ లో అధినేత సమక్షంలో జరిగింది అని ప్రచారం సాగుతోంది. కేసీఆర్ అయితే తాను ఆమెకు ఎంతో న్యాయమే చేశాను అని పార్టీ సీనియర్లతో ముఖ్య నాయకులతో చెప్పినట్లుగా అంటున్నారు. ఎంపీగా ఎమ్మెల్సీగా చాన్స్ ఇచ్చామని అంతే కాదు ఆమెకు అన్ని వేళలా అండగా ఉన్నామని చెప్పుకొచ్చారని టాక్. అయినా సరే ఆమె పార్టీ వ్యతిరేక వైఖరిని తీసుకోవడం బాధాకరం అన్నారని టాక్.
ఆమె వెనక కాంగ్రెస్ :
ఇక ఇదే సమావేశంలో కొందరు బీఆర్ఎస్ నాయకులు అయితే ఆమె వెనక కాంగ్రెస్ ఉందని తమ వద్ద అధారాలు కూడా ఉన్నాయని చెప్పారని అంటున్నారు. అంతే కాదు ఆమెకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా ఇస్తారని కూడా మరికొందరు చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. ఆమెని పార్టీ నుంచి కుటుంబం నుంచి విడదీసి తమ మీదనే ప్రయోగిస్తున్నారు అన్న ఆవేదన అయితే ఈ సమావేశంలో వ్యక్తం అయింది ఆ మీదటనే ఆమె పార్టీలో కొనసాగితే మరింతగా బీఆర్ఎస్ కి రాజకీయంగా నష్టం జరుగుతుందని భావించే సస్పెండ్ చేశారు అని అంటున్నారు.
జాతీయ పార్టీల పాత్ర :
సాధారణంగా బలమైన ప్రాంతీయ పార్టీలలో చీలిక కానీ లేదా ఇబ్బందులు కానీ వస్తే వాటి వెనక జాతీయ పార్టీలు ఉంటాయని ప్రచారంలోకి రావడం సహజం. ఇక తెలంగాణా రాజకీయ ముఖ చిత్రం చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ ప్రతిపక్ష పార్టీలో ఉంది. ఈ రెండు పార్టీలూ కూడా తెలంగాణాలో అధికారమే అన్నట్లుగా ఉన్నాయని అంటున్నారు. ఏకైక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ గా ఉంది. దాతో త్రిముఖ పోరు కాస్తా ద్విముఖ పోరుగా మార్చాలీ అంటే బీఆర్ఎస్ వీలైనంతవరకూ బహలీహనపరచే వ్యూహాలు అమలు చేస్తారు అన్నది కూడా ఉంది. అయితే బీఆర్ఎస్ విషయంలో బీజేపీ కంటే కాంగ్రెస్ పాత్ర ఎక్కువగా ఉందని బీఆర్ఎస్ నేతలు అనుమానిస్తున్నారుట.
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే :
ఇక తెలంగాణా రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానే పొలిటికల్ వార్ సాగుతోంది. దాంతో ఈ రెండు పార్టీల మధ్య జరిగే రాజకీయం కీలక మలుపు తిరిగేలా చేయడం అన్నది కనుక జరగాలి అంటే కాంగ్రెస్ వైపు నుంచి ఎత్తుగడలు వచ్చి ఉంటాయని అనుమానిస్తున్నారుట. ఏది ఏమైనా కవిత సొంతంగా పార్టీని ధిక్కరించింది అంటే మాత్రం బీఆర్ఎస్ నేతలు నమ్మడం లేదు అని అంటున్నారు. కవిత వెనక కాంగ్రెస్ ఉందని గులాబీ పార్టీలు అనుమానించడమే కాదు ముందు ముందు హస్తం పార్టీ వ్యూహాలు ఎలా ఉంటాయో అన్న ఆలోచనలో కూడా ఉన్నాయని అంటున్నారు. మరి బీఆర్ఎస్ లో చర్చ జరిగినట్లుగా ప్రచారంలో ఉన్న మాటలే నిజమా కవితకు మంత్రి పదవి దక్కుతుందా ఆమె కాంగ్రెస్ కి చేరువ అవుతున్నారా అంటే కాలమే వీటికి జవాబు చెప్పాల్సి ఉంటుంది అని అంటున్నారు.
