కేటీఆర్ కు కవిత సపోర్టు.. అసలు ఆమె స్టాండేంటి?
తెలంగాణ రాజకీయాల్లో కవిత అడుగులు ఎటు పడుతున్నాయి? ఆమె ఎలాంటి వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తున్నారు? ఇదీ..ఇప్పుడు రాజకీయంగా జరుగుతున్న చర్చ
By: Garuda Media | 20 Nov 2025 11:00 PM ISTతెలంగాణ రాజకీయాల్లో కవిత అడుగులు ఎటు పడుతున్నాయి? ఆమె ఎలాంటి వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తున్నారు? ఇదీ..ఇప్పుడు రాజకీయంగా జరుగుతున్న చర్చ. దీనికి కారణం.. నిన్న మొన్నటి వరకు విమర్శించిన.. తన సొదరుడు, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్‌ను ఆమె తాజాగా సమర్థించుకున్నారు. కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ అనుమతిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఆయనపై కేసు నమోదు చేసి.. విచారణ పేరుతో అరెస్టు చేసే అవకాశం ఏర్పడింది.
అయితే.. ఈ పరిణామాలను కవిత తప్పుబట్టారు. కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం వెనుక బీజేపీ ఉందని కవిత వ్యాఖ్యానించారు. బీజేపీ చెప్పినట్టే కాంగ్రెస్ ఆడుతోందని అన్నారు. అంతేకాదు.. ప్రత్యర్థులపై కేసులు పెట్టడం తప్ప బీజేపీకి మరో పనిలేదని విమర్శించారు. ఇది కేవలం రాజకీయ కుట్రలో భాగమేనని కవిత చెప్పారు.
ఏం జరిగింది...
బీఆర్ ఎస్ హయాంలోతెలంగాణలో నిర్వహించిన(హైదరాబాద్) ఈ ఫార్ములా కార్ రేస్‌లో అక్రమాలు జరిగాయని.. ప్రస్తుత ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. జీహెచ్ ఎంసీ నిధులను అప్పటి మంత్రి కేటీఆర్ దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణకు ఆదేశించిన రేవంత్ రెడ్డి సర్కారు.. కేటీఆర్‌ను కూడా కేసులో భాగం చేసింది. దీంతో ఆయనను విచారించేందుకు.. ఏసీబీ ప్రయత్నించింది. కానీ, మాజీ మంత్రి కావడంతో గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. అయితే.. సుదీర్ఘకాలంగా ఈ విషయాన్ని పెండింగులో పెట్టిన రాజ్ భవన్ తాజాగా అనుమతి ఇచ్చింది.
దీంతో కేటీఆర్‌ను విచారించేందుకు, అవసరమైతే.. అరెస్టు కూడా చేసేందుకు అవకాశం ఏర్పడింది. ఈ విసయాన్ని ప్రస్తావిస్తూ.. కేటీఆర్ సోదరి, ఎమ్మెల్సీ కవిత ఫైరయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉద్దేశ పూర్వకంగా వేధిస్తున్నాయని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. బస్తీల్లో ప్రజల ముఖం చూసే ధైర్యం కూడా అధికార పార్టీ నేతలకు లేదన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రత్యర్థులపై కేసులు పెడుతోందన్నారు.
కవిత స్టాండ్ ఏంటి?
ఈ పరిణామంతో అసలు కవిత స్టాండ్ ఏంటి? అనేది రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చింది. ఎందుకంటే. జూబ్లీహిల్స్‌లో బీఆర్ ఎస్ ఓడిపోయినప్పుడు.. కర్మ హిట్స్ బ్యాక్ అని కామెంటు చేశారు. తర్వాత.. కేటీఆర్ సోషల్ మీడియా రాజకీయాలకు పరిమితమయ్యారని దెప్పిపొడిచారు. ఆమె చేపట్టిన జాగృతి జనం బాటలోనూ విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు అన్నను వెనుకేసుకు వచ్చేలా మాట్లాడారు. ఈ పరిణామాలు చూస్తే.. `మాలో మేం ఏమైనా అనుకుంటాం. మేమంతా ఒక్కటే.. ఇంకెవరూ మాజోలికి రాకూడదు`` అనే స్టాండ్ తీసుకున్నారా? అనే చర్చ జరుగుతోంది.
