దెయ్యం అతనే.. కేసీఆర్ కూతురు సంచలనం
బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుపై కేసీఆర్ కూతురు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: A.N.Kumar | 27 Jan 2026 3:25 PM ISTబీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుపై కేసీఆర్ కూతురు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నాయకులకు రక్త కన్నీరు తెప్పించిన మొదటి దుర్మార్గుడు సంతోష్ రావేనని మండిపడ్డారు. బీఆర్ఎస్ కు, కేసీఆర్ కు ఉద్యమకారులను దూరం చేసిన దెయ్యం కూడా సంతోష్ రావేనని వ్యాఖ్యానించారు. గద్దర్ అన్నను గేటు బయట నిలబెట్టినా, ఈటెల రాజేందర్ వంటి నాయకులు పార్టీని వీడినా అందుకు కారణం సంతోష్ రావేనని అన్నారు. ఆ పాపం ఊరికే పోదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, సంతోష్ గూఢచారి అని, రేవంత్ రెడ్డితో సంతోష్ అంటకాగుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఫాం హౌస్ సమాచారాన్ని సంతోష్ రావే..రేవంత్ రెడ్డికి అందిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఏం తిన్నా, సగం ఇడ్లీ తిన్నాడా, పూర్తీ ఇడ్లీ తిన్నారా లాంటి సమాచారం కూడా సంతోష్ రావే రేవంత్ రెడ్డికి అందిస్తున్నారని కవిత ఆరోపణలు చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది.
కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సంతోష్ రావు పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రావడంతో సిట్ అధికారులు విచారణకు పిలిచారు. సంతోష్ రావ్ ను రేవంత్ రెడ్డి శిక్షిస్తాడంటే తాను నమ్మనని కవిత అన్నారు. సంతోష్ లాంటి దుర్మార్గుడికి కేటీఆర్, హరీష్ రావు ఎందుకు మద్దతిస్తున్నారో అర్థం కావడంలేదని కవిత మాట్లాడారు. చట్టం తన పని తాను చేస్తే సంతోష్ రావుకు ఖచ్చితంగా శిక్ష పడుతుందని కవిత అన్నారు. కవిత వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. సంతోష్ పై కవిత వ్యాఖ్యల నేపథ్యంలో .. కవితకు ఎవరిపైన కోపం ఉందో స్పష్టంగా అర్థమవుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కవిత కోపం కేటీఆర్, హరీష్ రావుపై కంటే ఎక్కువగా సంతోష్ రావుపై ఉన్నట్టు ఆమె వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. తనకు, తన తండ్రి దూరం కావడానికి సంతోష్ రావే కీలకమని కవిత నమ్ముతున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంతోష్ రావుపై కవిత కామెంట్ చేసే క్రమంలో .. హరీష్, కేటీఆర్ పై కొంత సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించి, వారిద్దరూ సంతోష్ ఎందుకు మద్దతిస్తున్నారో అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకసారి హరీష్ రావును, ఇంకోసారి సంతోష్ రావును కవిత విమర్శించడం వ్యూహమా.. లేదా నిజంగా వారిద్దరి వల్ల కవితకు నష్టం జరిగిందా అన్న కోణంలో చర్చ జరుగుతోంది.
కవిత వ్యవహారంలో కేసీఆర్ ను సంతోష్ రావు ఆ స్థాయిలో ప్రభావితం చేశారా.. లేదా ఇంటి గుట్టు రట్టు కాకుండా సంతోష్ రావుపై అనవసర ఆరోపణలు చేస్తున్నారా అన్న ప్రశ్న కూడా రాజకీయవర్గాల్లో ఉంది. నిజంగా కేసీఆర్ ను ఎవరైనా ప్రభావితం చేయగలరా ?. సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్న కేసీఆర్ ఎప్పుడు ఏం చేయాలో.. చేయకూడదో నిర్ణయించుకోలేరా ?. కవిత చెప్పినట్టు సంతోష్ కేసీఆర్ ను ప్రభావితం చేస్తున్నారా అన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో ఉంది.
