‘నాన్న ఉద్దేశం అర్థమైంది’ కవిత కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ పై మాజీ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కేసీఆర్ అసలు ఉద్దేశం ఏంటో సస్పెన్షన్ తర్వాతే తనకు తెలిసిందని ఆమె వెల్లడించారు.
By: Tupaki Political Desk | 9 Oct 2025 9:00 PM ISTబీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ పై మాజీ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కేసీఆర్ అసలు ఉద్దేశం ఏంటో సస్పెన్షన్ తర్వాతే తనకు తెలిసిందని ఆమె వెల్లడించారు. ఓ జర్నలిస్టుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ ఎపిసోడ్ ప్రస్తావనకు వచ్చింది. ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సస్పెన్షన్ ఉత్తర్వులపై కేసీఆర్ సంతకం లేకపోయినా ఆయన ‘ఉద్దేశం’ ఏంటో తనకు తెలిసిందని కవిత వెల్లడించారు.
బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేయడం బాధ పెట్టినట్లు కవిత తెలిపారు. తాను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఎప్పుడూ చేయలేదని స్పష్టం చేశారు. కొంతమంది కారణంగానే ఇది జరిగిందని, కుటుంబానికి దూరమవడం తేలికైన విషయం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కవిత. కాగా, ఆమె తాజా వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్ నుంచి కవితను సాగనంపడంపై కేసీఆర్ రెండో ఆలోచన చేయలేదని అభిప్రాయపడుతున్నారు. బిడ్డపై మమకారంతో ఆయన అడ్డు చెప్పి ఉంటారని ఇన్నాళ్లు ఓ వాదన వినిపించగా, తన సస్పెన్షన్ వెనుక ‘ఉద్దేశం’ ఆయనదేనంటూ కవిత చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అంతేకాకుండా సొంత పార్టీ పెట్టే దిశగా కవిత అడుగులు వేస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో కుటుంబానికి దూరంగా ఉండటం తేలికైన విషయం కాదంటూ కవిత చెప్పడం మహిళా సెంటిమెంటును టచ్ చేసే ఉద్దేశమే అంటున్నారు. తనను బీఆర్ఎస్ నుంచి బలవంతంగా వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారని, ఈ విషయం తెలుసుకోకుండా తన తండ్రి పార్టీ నుంచి సస్పెన్షన్ చేశారని చెప్పడానికే కవిత ఇలా మాట్లాడుతున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ అనంతరం కవిత వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. కొత్త పార్టీ ప్రకటనపై సహచరులతో సమాలోచనలు జరుపుతున్న కవిత తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న జూబ్లిహిల్స్ ఉప ఎన్నికతోపాటు స్థానిక ఎన్నికల్లో తమ మద్దతు ఎవరికీ ఇవ్వకుడదని కూడా కవిత భావిస్తున్నట్లు చెబుతున్నారు. పెద్దగా సమయం లేకపోవడం, పార్టీ నిర్మాణం ఇంకా జరగకపోవడం వల్ల ఈ ఎన్నికలకు దూరంగా ఉండటమే మంచిదని ఆమెకు రాజకీయ ఉద్దండులు సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇక ప్రజల్లో తన ఉనికి చాటుకోవడానికి సెంటిమెంటు రెచ్చగొట్టి ఫాలోయింగు పెంచుకోడానికి ఆమె వ్యూహరచన చేస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.
