Begin typing your search above and press return to search.

కవితలో ఎంత మార్పు.. గమనించారా?

పొలిటికల్ గా మాత్రమే కాదు.. వ్యక్తిగతంగానూ పూర్తిస్థాయి మేకోవర్ అయినట్లుగా కనిపిస్తున్న ఆమె.. నిత్యం పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

By:  Garuda Media   |   23 Nov 2025 1:00 PM IST
కవితలో ఎంత మార్పు.. గమనించారా?
X

ఎవరు అవునన్నా.. కాదన్నా.. ఒక్కొక్కరికి ఒక్కోలాంటి ఇమేజ్ ఉంటుంది. ఇందులో నుంచి బయటపడి.. సరికొత్తగా కనిపించటం అంత తేలికైన విషయం కాదు. ఒకవేళ కొత్తగా మారినా.. దానికి గుర్తింపు లభించటం.. ఆ కొత్త తీరు ప్రజల్ని టచ్ చేసేలా ఉండటం అన్నింటి కంటే కీలకం. ఈ విషయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితలో మార్పు కొట్టొచ్చినట్లుగా మారటమే కాదు.. అందరూ గుర్తించే దిశగా అడుగులు మొదలయ్యాయని చెప్పక తప్పదు.

గులాబీ బాస్ కేసీఆర్ కుటుంబానికి అహంకారం అన్నది ఆభరణంగా మారటం తెలిసిందే. ఈ ఆభరణం బరువు తమ రాజకీయ తలరాతల్ని మారుస్తుందన్న విషయాన్ని కేసీఆర్.. కేటీఆర్ ఇంకా గుర్తించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో కేసీఆర్ కుమార్తె.. కేటీఆర్ సోదరి కవిత మాత్రం ఇట్టే పసిగట్టినట్లుగా చెప్పకతప్పదు. కారణం ఏమైనా కానీ.. బీఆర్ఎస్ కోట నుంచి బయటకు వచ్చేసిన ఆమె.. ఇప్పుడు హరీశ్ రావును లక్ష్యంగా చేసుకొని.. అప్పుడప్పుడు కేటీఆర్ కు తగిలే చురకలు సంధిస్తూ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

ఇంత చేసినా..ఆమెకు వస్తున్న ఇమేజ్ అంతంతే. ఆమె చేస్తున్న ప్రకటనలు.. ఇస్తున్న ప్రసంగాలు.. పడుతున్న కష్టానికి తగ్గ ఫలితం అంతగా లభించని పరిస్థితి. గతంలో కవిత అన్నంతనే ఖరీదైన చీర.. అందుకుఏ మాత్రం తీసిపోని రీతిలో డైమెండస్ ఆభరణాలతో పాటు.. రెండు చేతి వేళ్లకు కొట్టొచ్చినట్లుగా కనిపించే ఉంగరాలు మాత్రమే కాదు.. పొడుగైన గోళ్లు.. వాటికి వేసే గోళ్లరంగు అందరూ మాట్లాడుకునేలా చేసేది. ప్రజానేతగా ప్రజల్లో కలిసిపోవాల్సిన మహిళా నేత.. అందుకు భిన్నంగా మిగిలిన వారికి తాను పూర్తి వేరన్న భావన కలిగేలా ఆమె వైఖరి ఉండేది. అయితే.. ఇప్పుడు కవిత మొత్తంగా మారిపోయారని చెప్పాలి.

పొలిటికల్ గా మాత్రమే కాదు.. వ్యక్తిగతంగానూ పూర్తిస్థాయి మేకోవర్ అయినట్లుగా కనిపిస్తున్న ఆమె.. నిత్యం పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తనకు వచ్చే మైలేజీ.. డ్యామేజీల్ని పట్టించుకోకుండా నిత్యం ప్రజల మధ్య ఉంటున్నారు. మరి ముఖ్యంగా సామాన్యులు.. బడుగు జీవులకు దగ్గరగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్ని అమలు చేస్తున్న కవిత.. వివిధ వర్గాలకు చెందిన ముఖ్యుల్ని.. పెద్ద మనషుల్నికలుస్తూ.. తాను అందరిదానినన్న భావన కలిగేలా ప్రయత్నిస్తున్నారు.

ఇందుకు తగ్గట్లే కట్టుబొట్టును పూర్తిగా మార్చేశారు. గతంలో మాదిరి కాకుండా ఖరీదైన చీరలకు బదులుగా నేత చీరలు ధరిస్తూ.. పొడుగ్గా ఉండే చేతిగోళ్లను పూర్తిగా కత్తిరించేసి.. గోళ్ల రంగు అన్నది దరిదాపుల్లోకి రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మెడలో గతంలో బంగారు.. వజ్ర ఆభరణాలు మాత్రమే ధరించే స్థానంలో ఇప్పుడు నల్లపూసలతో సాదాసీదాగా ఉంటూ.. చేతివేళ్లకు పెట్టుకునే రింగ్స్ ను త్యజించారు. ఇలా టాప్ టు బాటమ్ మొత్తంగా తనను తాను మార్చేసుకున్న తీరు చూసినప్పుడు ఆమెలో మార్పు కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో అర్థమవుతుంది. అయితే.. ఈ మార్పులన్నీ జనబాహుళ్యంలోకి వెళ్లి.. మారిన కవిత ఇమేజ్ తో మరెంత మైలేజ్ సొంతం చేసుకుంటారో చూడాలి.