Begin typing your search above and press return to search.

ఎంత కాదనుకున్నా కవితలో షర్మిల కనిపిస్తారెందుకు?

సంబంధం లేని కొన్ని అంశాల్లో అనూహ్య సారూప్యతలు కనిపిస్తాయి. ఆ కోవలోకే వస్తారు వైఎస్ షర్మిల.. కల్వకుంట్ల కవిత.

By:  Garuda Media   |   27 Sept 2026 12:00 PM IST
ఎంత కాదనుకున్నా కవితలో షర్మిల కనిపిస్తారెందుకు?
X

సంబంధం లేని కొన్ని అంశాల్లో అనూహ్య సారూప్యతలు కనిపిస్తాయి. ఆ కోవలోకే వస్తారు వైఎస్ షర్మిల.. కల్వకుంట్ల కవిత. ఇద్దరు అధినేతల గారాలపట్టిలు.. అనూహ్యరీతిలో రాజకీయాల్లోకి రావటం.. ఏ సోదరుడితో అయితే అత్యంత ఆప్తురాలిగా ఉన్నారో.. అదే అన్నతో ఆ తర్వాత రోజుల్లో విభేదాలు పొడచూపటం.. సూటిగా విమర్శలు చేయటం.. తమకు అన్యాయం జరిగిందన్న ఆవేదనను వ్యక్తం చేయటం కనిపిస్తుంది. కవిత అడుగుల్ని చూసే ప్రతిఒక్కరికి షర్మిల అప్రయత్నంగా గుర్తుకు వస్తూ ఉంటుంది. అయితే ఒక్క తేడా మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

సోదరుడితో విభేదించిన షర్మిల తన రాజకీయాల్ని వేరే రాష్ట్రంలో షురూ చేస్తే.. కవిత మాత్రం సొంత రాష్ట్రంలోనే మొదలుపెట్టారు. షర్మిల తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో విభేదించకపోవటం.. కవిత మాత్రం సొంత తండ్రి గీసిన గీతల్ని దాటేసి.. తండ్రి మీద కీలక విమర్శలు చేసేందుకు సైతం వెనుకాడని వైనం కనిపిస్తుంది. మిగిలినవన్నీ దాదాపు ఒక్కలానే కనిపిస్తాయి.

షర్మిల.. కవిత ఇద్దరిలోనూ పోరాడే తత్త్వం.. వాక్ చాతుర్యం కనిపిస్తుంది. కాకుంటే.. రాంగ్ ప్లేస్ లో తన రాజకీయాల్ని మొదలు పెడితే.. కవిత మాత్రం ఆ తప్పు కనిపించదు. తాజాగా కవిత చేసిన రెండు కీలక వ్యాఖ్యల్ని చూసినప్పుడు మరోసారి ఆమెలో షర్మిల కనిపిస్తారు. అందులో మొదటిది.. దానం నాగేందర్ పై కోర్టు నిర్ణయం నేపథ్యంలో ఆర్నెల్ల వ్యవధిలో జరిగే ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. షర్మిల కూడా అప్పట్లో తెలంగాణలో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కవిత మాట్లాడుతూ.. వచ్చే ఉగాది నుంచి తాను తెలంగాణ వ్యాప్తంగా బస్సుయాత్ర చేస్తానని స్పష్టం చేశారు. గతంలో షర్మిల సైతం తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రను నిర్వహించటం తెలిసిందే. అప్పట్లో ఆమె పాదయాత్రను అడ్డుకోవటానికి ప్రయత్నాలు జరగటం.. చివరకు తన పాదయాత్రకు అనుమతుల్ని హైకోర్టు నుంచి తెచ్చుకోవటం తెలిసిందే. మరి.. కవిత విషయంలో ఆమె చేపట్టాలని భావిస్తున్న బస్సుయాత్రకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో చూడాలి.

తనకంటే ముందు తన మాదిరే రాజకీయాల్ని నిర్వహించిన షర్మిల చేసిన తప్పుల్ని కవిత చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది. అంతోఇంతో సానుకూల అంశం ఏమంటే.. షర్మిల చేసిన రాజకీయంలో ఎలాంటి భావోద్వేగం లేకపోవటం. కానీ.. కవిత విషయంలో అందుకు మినహాయింపు ఉంది. అయితే.. ఒక మహిళ తన తండ్రి.. సోదరుడికి వ్యతిరేకంగా రాజకీయం చేయటం.. దానికి ఎంతటి మద్దతు లభిస్తుందన్నది ప్రశ్న. కవిత తండ్రి సాదాసీదా నాయకుడైతే కాదు కదా? తెలంగాణ పితామహుడిగా ఉన్న ఆయన కూతురుగా.. ప్రజాక్షేత్రంలోకి దిగి.. ఆయన పాలనను..ఆయన ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రశ్నించటంపై తెలంగాణ సమాజం స్పందించే వైనంపై బోలెడన్ని సందేహాలు ఉన్నాయి. వాటిని తన నిబద్ధతతో.. కమిట్ మెంట్ తో బద్ధలు కొడితే.. ఆమె మీద పడిన షర్మిల ముద్ర మాట తొలిగిపోతుంది. అప్పటివరకు ఆమె నడకలో షర్మిల ముద్రను చూసే ధోరణి తగ్గుతుంది.