Begin typing your search above and press return to search.

'ముఖ్య‌మంత్రి క‌విత': నెటిజ‌న్ల‌ కామెంట్స్ ఇవే!

ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, యూట్యూబ్ ఇలా.. సోష‌ల్ మీడియా మాధ్య‌మాలు అన్నింటిలోనూ నెటిజ‌న్లు రియాక్ట్ అయ్యారు.

By:  Garuda Media   |   15 Dec 2025 4:00 AM IST
ముఖ్య‌మంత్రి క‌విత:  నెటిజ‌న్ల‌ కామెంట్స్ ఇవే!
X

''ఏదో ఒక రోజు నేను కూడా ముఖ్యమంత్రి అవుత‌క‌దా!. అప్పుడు చెప్తా''- అంటూ.. బీఆర్ ఎస్ పార్టీ నాయకుల‌ను అదే పార్టీకి చెందిన మాజీ నాయ‌కురాలు.. క‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. త‌న ఇంటి వివాదాన్ని ప్ర‌జ‌ల వివాదంగా సృష్టించార‌న్న వాద‌న ఉన్నా.. విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. ఆమె ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటం అంటూనే త‌న సొంత రాజ‌కీయాల‌పైనే ఆమె దృష్టి పెట్టారని కూడా కొంద‌రు నేత‌లు వ్యాఖ్యానించారు. తాజాగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ కూడా ఇదే వ్యాఖ్య చేశారు.

స‌రే.. రాజ‌కీయ నేత‌లు ఎలాంటి కామెంట్లు చేసినా ఫ‌ర్వాలేదు. క‌విత‌పై అస‌లు నెటిజ‌న్లు ఏమంటున్నా రు? వారి అభిప్రాయం ఎలా ఉంది? అనేది కీల‌కం. ఎందుకంటే.. క‌విత అనుకుంటున్న‌ట్టుగా ఆమె ముఖ్య మంత్రి కావాలంటే.. నెటిజ‌న్ల స‌హ‌కారం కూడా ఉండాలి. వారి అభిప్రాయాలు కూడా కావాలి. సో.. నెటిజ‌న్లు ఏమ‌నుకుంటున్నార‌న్న‌ది ఇంపార్టెంటు. ఈ క్ర‌మంలో క‌విత వ్యాఖ్య‌ల‌పై దాదాపు 12 వేల మందికి పైగా నెటిజ‌న్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా రియాక్ట్ అయ్యారు.

ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, యూట్యూబ్ ఇలా.. సోష‌ల్ మీడియా మాధ్య‌మాలు అన్నింటిలోనూ నెటిజ‌న్లు రియాక్ట్ అయ్యారు. మెజారిటీ నెటిజ‌న్లు.. క‌విత‌పై సెటైర్లు వేశారు. ఇక‌, రాష్ట్రంలో లిక్క‌ర్ బిజినెస్ చేసుకో వ‌చ్చ‌ని వ్యాఖ్యానించారు. మ‌రికొంద‌రు క‌విత.. కూడా జ‌గ‌న్ సెంటిమెంటును ఫాలో అవుతున్నార‌ని అన్నారు. జ‌గ‌న్ కూడా జైలుకు వెళ్లి వ‌చ్చిన త‌ర్వాత‌.. క‌సితో ముఖ్య‌మంత్రి పీఠం కోసం క‌ష్ట‌ప‌డ్డారు. ఇప్పుడు క‌విత కూడా అదే త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మంచిదేన‌ని.. కొంద‌రు ఎద్దేవా చేశారు.

మ‌రికొంద‌రు.. ఉట్టికెగ‌ర‌లేన‌మ్మ అంటూ.. ఎమ్మెల్యేగా కూడా గెల‌వ‌లేక‌పోయార‌ని.. అన్నారు. ఇక‌, మెజారిటీ నెటిజ‌న్లు మాత్రం.. కేసీఆర్ ఇరుకున ప‌డ‌తార‌ని.. క‌విత ముఖ్య‌మంత్రి అయితే ముందుగానే కేసీఆర్ నే జైలుకు పంపిస్తారా? అని ప్ర‌శ్నించారు. ఇక‌, ఒక‌రిద్ద‌రు.. క‌విత ముఖ్య‌మంత్రి అయితే.. మ‌హిళ‌ల‌కు మ‌రిం త `స్వేచ్ఛ‌` వ‌స్తుంద‌ని ద్వంద్వార్థాలు తీశారు. ఎక్కువ మంది క‌విత‌ను రాజ‌కీయ నాయ‌కురాలిగా కాకుండా.. కేసీఆర్ త‌న‌య‌గానే గౌర‌విస్తున్నామ‌ని చెప్ప‌డం మ‌రో కొస‌మెరుపు. ఇంకొంద‌రు.. ఇదొక రాజ‌కీయ గేమ్ అని.. వ్యాఖ్యానించారు. మొత్తంగా.. క‌విత వ్యాఖ్య‌ల‌ను నెటిజ‌న్లు పెద్ద‌గా సీరియ‌స్ అనుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.