టీఆర్ఎస్ లేకపోతే కవితకు ఇబ్బందేనా ?
తెలంగాణాలో ప్రస్తుత రాజకీయ వాతావరణంలో కొత్త పార్టీకి ఎంత వరకూ స్కోప్ ఉంది అన్నది అయితే ఎవరికీ తెలియదు.
By: Satya P | 9 July 2026 12:48 PM ISTతెలంగాణాలో ప్రస్తుత రాజకీయ వాతావరణంలో కొత్త పార్టీకి ఎంత వరకూ స్కోప్ ఉంది అన్నది అయితే ఎవరికీ తెలియదు. ఎందుకంటే బలంగా అధికార కాంగ్రెస్ ఉంది. విపక్ష బీఆర్ఎస్ కూడా సంస్థాగతంగా పటిష్టంగా ఉంది. చాన్స్ దొరికితే దూసుకుని పోవాలని బీజేపీ వంటి జాతీయ పార్టీ ఎదురుచూస్తోంది. ఇక వామపక్షాలు వంటివి ఉన్నాయి. ఈ నేపధ్యంలో కేవలం కేసీఆర్ కుమార్తె అన్న ట్యాగ్ తోనే తప్ప మరేమీ ఇతరత్రా లేకుండా కవిత సొంత రాజకీయం ప్రారంభించారు. ఆమె ఒకసారి నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. ఒకసారి ఎమ్మెల్సీ అయ్యారు. ఆమె రాజకీయ జీవితంలో సొంతంగా గెలిచినది లేదు, బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా 2019లో ఎంపీగా ఓటమి పాలు అయ్యారు. కానీ కవిత మాత్రం మొండి ధైర్యంతో పార్టీని పెట్టారు. దాని పేరు విషయంలోనే ఇపుడు తకరారు ఎదుర్కొంటున్నారు.
ఆ పేరు మాత్రం ఎందుకు :
తనకు కన్న వారు దూరం అయ్యారని ఆమె చెబుతూ వచ్చారు. తనను అన్యాయంగా బీఆర్ఎస్ నుంచి బయటకు నెట్టారని కూడా చెబుతూ ఉంటారు. అయితే కవిత బీఆర్ఎస్ అధినాయకత్వం మీద విమర్శలు చేసి మరీ బయటకు వెళ్ళగొట్టేలా చేసుకున్నారు అన్న మాట కూడా ఉంది. ఏది ఏమైనా సొంత రాజకీయం చేస్తాను తండ్రి పేరు కానీ ఫోటో కానీ ఎక్కడా వాడను అని గంభీరమైన ప్రకటనలు చేసిన కవిత ఆచరణలో మాత్రం ఆ విధంగా వ్యవహరిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. కేసీఆర్ టీఆర్ ఎస్ ని స్థాపించారు. తరువాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తూ దానికి బీఆర్ఎస్ అని నామకరణం చేశారు. దాంతో పాత టీఆర్ఎస్ పేరు కలసి వచ్చేలా కవిత తెలంగాణా రక్షణ సేనగా పేరుతో కొత్త పార్టీ పెట్టి షార్ట్ కట్ లో తమదే అసలైన టీఆర్ఎస్ అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు.
ఈసీ షాక్ తోనే :
అయితే కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ అని ఉండడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బీఆర్ ఎస్ సహా అనేక మంది ఈసీకి ఫిర్యాదులు చేసారు. దాంతో ఈసీ కవితకు షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ ని పోలిన పేర్లు ఉండరాదు అని ఈసీ కవితకు స్పష్టం చేయడం ఆమెకు కొత్త పార్టీకి కూడా ఇబ్బందిగా మారింది. దీని మీద ఢిల్లీ హై కోర్టుని ఆమె ఆశ్రయించారు. అయితే కోర్టు సైతం రెండు పేర్లు ఒకేలా ఉన్నపుడు ఈసీ అభ్యంతరం పెట్టడంలో తప్పు లేదుగా అని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో కవిత పార్టీకి టీఆర్ఎస్ దూరం అయ్యేలా సీన్ కనిపిస్తోంది అంటున్నారు.
టీఆర్ఎస్ అంటే కనుక :
టీఆర్ఎస్ మీద కవితకు సెంటిమెంట్ ఉండొచ్చు కానీ జనాలు అయితే పార్టీ గుర్తు చూసే ఓట్లు వేస్తారు కదా అన్నది గుర్తుంచుకోవాల్సి ఉంది. అంతే కాదు కేసీఆర్ ఫోటో గులాబీ జెండా కారు గుర్తు గత పాతికేళ్ళుగా తెలంగాణా జనాలకు అలవాటు అయింది. టీఆర్ఎస్ అని కవిత పార్టీ పేరు అలా ఉంచేసినా కూడా జనాలు ఓటేసేది కారు గుర్తుకే అన్న లాజిక్ ని ఎలా మరచిపోతున్నారు అంటున్నారు. కవిత తన పార్టీని జనంలోకి తీసుకుని వెళ్ళాలి, తాను నాయకురాలిగా జనం మన్నన పొందాలి. ఆ విధంగా ఆమె మమేకం కావాలి, జనాలకు భరోసా ఇవ్వాలి. అపుడు ఆమె పార్టీ పేరు ఏదైనా గుర్తు వేరు అయినా జనాలు ఆదరిస్తారు అని అంటున్నారు. అందువల్ల టీఆర్ఎస్ సెంటిమెంట్ పేరు అని అనుకుంటే అది ఉంటేనే గెలుపు అన్న భ్రమలలో ఉంటే మాత్రం రాజకీయంగా ఇంకా ఎన్నో మెట్లు ఎక్కాల్సి ఉంటుందని అంటున్నారు.
