Begin typing your search above and press return to search.

కవిత సంచలన నిర్ణయం: రేపే కొత్త పార్టీ ప్రకటన?

తెలంగాణలో తాను ప్రారంభించబోయే కొత్త పార్టీపై మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తుది నిర్ణయానికి వచ్చారు.

By:  Tupaki Political Desk   |   26 March 2026 2:59 PM IST
కవిత సంచలన నిర్ణయం: రేపే కొత్త పార్టీ ప్రకటన?
X

తెలంగాణలో తాను ప్రారంభించబోయే కొత్త పార్టీపై మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తుది నిర్ణయానికి వచ్చారు. శ్రీరామ నవమి సందర్భంగా శుక్రవారమే పార్టీపై ప్రకటన ఉంటుందని విస్తృత ప్రచారం జరుగుతోంది. అధికారికంగా వచ్చేనెల 25న పార్టీని ప్రారంభిస్తారని, కానీ శుక్రవారం పార్టీ పేరు మాత్రం వెల్లడిస్తారని చెబుతున్నారు. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపించిన భారత రాష్ట్ర సమితి నుంచి బహిష్కరణకు గురైన కవిత సొంత పార్టీ ప్రారంభిస్తారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో తన అనుచరులు, మద్దతుదారులతో సుదీర్ఘంగా మంతనాలు సాగించిన కవిత మంచి ముహూర్తం చూసుకుని పార్టీని ప్రకటిస్తున్నారని అంటున్నారు.

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా తన పార్టీపై ప్రకటన చేయాలని కవిత నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీనిపై తన అభిమానులు, సన్నిహితులకు ఆమె సంకేతాలు పంపినట్లు సమాచారం. ఇక కవిత పార్టీ కోసం పలు పేర్లు పరిశీలించినా, తెలంగాణ ఉద్యమంలో తను బాగా ప్రాచుర్యం పొందిన జాగృతి పేరుతోనే పార్టీ ఉండాలని కవిత భావించారని, దీంతో ‘తెలంగాణ ప్రజా జాగృతి’ అనే పేరును ఖరారు చేశారని అంటున్నారు. అదేవిధంగా పార్టీ ఎన్నికల గుర్తును కవిత ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ సమాజం కోసం తాను ఉద్యమిస్తానని, వారి హక్కులు కాపాడతానని చాటిచెప్పేందుకు ‘ధర్మగంట’ను ఎన్నికల గుర్తుగా కవిత ఎంపిక చేసుకున్నారని అంటున్నారు.

ఇక పార్టీ ప్రకటనకు కవిత ఎంచుకున్న వేదిక కూడా చర్చనీయాంశంగా మారింది. సహజంగా రాజకీయ నాయకులు ఎవరైనా కొత్త పార్టీలు ప్రారంభిస్తే అందుకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను వేదికగా ఎంపిక చేసుకుంటారు. మీడియా కవరేజ్, పబ్లిక్ అటెన్షన్ కోసం హైదరాబాద్ సరైన వేదికగా భావిస్తారు. కానీ, కవిత మాత్రం వ్యూహాత్మకంగా తన పార్టీపై ప్రకటన చేసేందుకు ఓ రామాలయాన్ని ఎంపిక చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి ప్రాచుర్యం పొందిన ఉత్తర తెలంగాణ ప్రాంతమైన నిజామాబాద్ జిల్లాలోని శ్రీరఘునాథ ఆలయం (ఖిల్లా రాంమందిర్)లో శ్రీరాముడి కల్యాణోత్సవం తర్వాత పార్టీపై ప్రకటన చేస్తారని చెబుతున్నారు.

ఇక నిజామాబాద్ లో ఉదయం 8 గంటలకు జాగృతి ప్రెస్ మీట్ ఉంటుందని కవిత అనుచరులు ఇప్పటికే మీడియాకు సమాచారం అందించారు. ఈ సమయంలో పార్టీని ప్రకటిస్తారా? లేక రామాలయంలో రాముడి కల్యాణోత్సవం ముగిశాక తన రాజకీయ ప్రస్థానంలో రెండో అధ్యాయానికి తెర తీస్తున్నట్లు వెల్లడిస్తారా? అన్నది మాత్రం ఉత్కంఠ రేపుతోంది. అయితే కవిత పార్టీ ప్రకటనపై మాత్రం శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకటన ఉంటుందని ఆమె సన్నిహితులు కుండబద్ధలు కొడుతున్నారు.

ఇక ఆమె పార్టీ పేరు కూడా ఖరారైందని, ఇప్పటికే ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారని అంటున్నారు. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో తాను దరఖాస్తు చేసుకున్నానని, కానీ ఎన్నికల సంఘం పేరు రిజిస్ట్రేషన్ చేయకుండా జాప్యం చేస్తోందని కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో ఆమె పార్టీ పేరుపై ముందే ఓ స్పష్టత వచ్చేసినట్లైందని అంటున్నారు. మరోవైపు కవిత పార్టీ ప్రారంభంతో తెలంగాణ రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాల్సివుంది. ఇప్పటికే రాష్ట్రంలో చాలా మంది పార్టీలు పెట్టారు. కానీ అధికార కాంగ్రెస్, విపక్షం బీఆర్ఎస్ పార్టీలదే హవా సాగుతోంది. బీజేపీ కూడా దశాబ్ద కాలంగా వెన్నుచూపని పోరాటం చేస్తోంది. కానీ టీడీపీ, కమ్యూనిస్టులు బలమైన కేడర్ ఉన్నప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కవిత ఆరంగేట్రం ఆసక్తి రేపుతోంది.